close
Updated : 03/10/2021 01:57 IST

శాంతి కోసం.. నారీశక్తి!

అమ్మాయంటే అందమేకాదు.. అవసరమైతే నాయకురాలై ముందుండీ నడిపించగలదు, విభేదాలనూ రూపుమార్చగలదు. ఈ విషయాన్ని మాటల్లోనే కాదు.. అవకాశమిస్తే చేతల్లోనూ నిరూపించగలరంటోంది ఏక్తా కపూర్‌. ఇందుకుగానూ దక్షిణాసియా దేశాలకు చెందిన 45 మంది మహిళలను ఒక వేదిక మీదకీ తీసుకువచ్చింది. ఇంతకీ ఎవరీమె? వీళ్లంతా ఏం చేయబోతున్నారు?

క్తా ఫ్యాషన్‌ జర్నలిస్ట్‌. 15 ఏళ్లపాటు దేశంలోని ప్రముఖ పత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేసింది. ఏళ్లు గడిచే కొద్దీ అమ్మాయిలంటే అందమే అన్న తరహా కథనాలను చూసి విసిగిపోయింది. యువతరంపై ఇదెంతలా చెడు ప్రభావం చూపుతోందో అర్థమయ్యాక దాన్నుంచి బయటకు వచ్చేసింది. సహజంగా ఆడవాళ్లు, వాళ్లలోని మానవత్వం మొదలైన అంశాలను అందరికీ పరిచయం చేయాలనుకుంది. అలాగే వివిధ రంగాల్లో దూసుకుపోతున్నవారిని చూపించి, మరింత మందిలో ఆత్మవిశ్వాసం నింపాలనుకుంది. అందులో భాగంగానే ఓ మేగజీన్‌ను ప్రారంభించాలనుకుంది. ఎల్లలతో సంబంధం లేకుండా ఇది అమ్మాయిల్లో ధైర్యం పెంచడమే కాకుండా వాళ్ల మనసులోని భావాలను ధైర్యంగా పంచుకునేలా ఉండాలనుకుంది.

ఆ ఆలోచన ఫలితమే 2016లో ప్రారంభమైన ‘ఇషీ’. దీనిలో ఎక్కువగా ఆమె శాంతి, విభేదాలకు వ్యతిరేకంగా సాగడం వంటి అంశాలపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా మహిళల కథలను అందివ్వడం ప్రారంభించింది. గత ఏడాది ఏక్తా.. అణు నిరాయుధీకరణపై పోరాడుతున్న నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత డాక్టర్‌ సిల్లా ఎల్‌వర్తీని ఇంటర్వ్యూ చేసింది. అందులో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య విభేదాలకు ఏం చేయొచ్చని అడిగింది. దానికి సిల్లా.. ‘నీ మేగజీన్‌ వేదికగా ఆడవాళ్ల అభిప్రాయాన్ని అడిగి చూడు.. సమాధానం దొరుకుతుంద’ని సలహా ఇచ్చింది. దీంతో ఏక్తా ఇండో-పాక్‌ సమ్మిట్‌ను ఏర్పాటు చేసింది. అది విజయవంతమైంది. దీంతో ఈసారి కాస్త పరిధి పెంచి భారత్‌, పాకిస్థాన్‌, కెనడా సహా దక్షిణాసియాలోని 13 దేశాల నుంచి 45 మంది మహిళలతో ‘సౌత్‌ ఆసియా సమ్మిట్‌’ను నిర్వహిస్తోంది. దీనిలో చరిత్ర, ఆర్థికం, విద్య సహా ఎన్నో రంగాలవాళ్లు పాల్గొంటున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, సరిహద్దు దేశాలతో ముఖ్యంగా పాకిస్థాన్‌తో భారత్‌ విభేదాలు వంటి అంశాలపై దీనిలో చర్చిస్తారు. వాదనల్లా కాకుండా ఒక్కొక్కరి దృష్టికోణాన్ని అర్థం చేసుకోవడానికే ప్రాధాన్యమిచ్చేలా చూస్తానంటోంది ఏక్తా.

‘శాంతిని కోరుకునేవాళ్లు అటువైపు నుంచీ ఉంటారు. కానీ వాళ్లకి మాట్లాడే వేదిక దొరక్కపోయుండొచ్చు. ఆ అవకాశం నేను కల్పించాలనుకున్నా. శాంతికి ప్రాధాన్యమిచ్చే వాళ్లలో ఆడవాళ్లే ముందుంటారు. కానీ దక్కే ప్రాధాన్యం చాలా తక్కువ. మహిళలే నిర్వహించేవి ఇంకా అరుదు. ఆడాళ్లలో సహజంగానే ఓర్పు ఉంటుంది. వీళ్లకి నాయకత్వ అవకాశమిస్తే ప్రజాభివృద్ధికి బాటలు వేయగలుగుతారు. వీళ్లెప్పుడూ దీర్ఘకాలిక ప్రయోజనాల గురించే ఆలోచిస్తారు. కాబట్టి శాంతిచర్చల్లో మహిళల ప్రాధాన్యం పెరగాలి. ఈ భావన ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. దానికి ఊతమిచ్చే ప్రయత్నమే నాది’ అని వివరిస్తోంది ఏక్తా.


Advertisement

మరిన్ని