వయసు 35... ఆస్తి 3 లక్షల కోట్లు!

దేశంలోనే ధనవంతుల జాబితాలో స్థానం దక్కడమంటే మాటలా! ఎన్నో ఏళ్ల అనుభవం, తరతరాల ఆస్తులు తోడైతేనే అది సాధ్యం... చాలామంది భావనే ఇది! కానీ ఓ సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయి వాళ్ల సరసన చేరడమే కాదు.. అతిపిన్న వయస్కురాలిగానూ నిలిచింది.

Updated : 03 Aug 2022 17:12 IST

దేశంలోనే ధనవంతుల జాబితాలో స్థానం దక్కడమంటే మాటలా! ఎన్నో ఏళ్ల అనుభవం, తరతరాల ఆస్తులు తోడైతేనే అది సాధ్యం... చాలామంది భావనే ఇది! కానీ ఓ సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయి వాళ్ల సరసన చేరడమే కాదు.. అతిపిన్న వయస్కురాలిగానూ నిలిచింది. ఫోర్బ్స్‌ ‘100 రిచెస్ట్‌ ఇండియన్స్‌’ జాబితాలో స్థానం దక్కించుకున్న దివ్యా గోకుల్‌నాథ్‌ గురించే ఇదంతా!

ఎప్పుడూ పెద్ద లక్ష్యాలనే నిర్దేశించుకోవాలనే తత్వం దివ్య అమ్మానాన్నల నుంచి నేర్చుకుంది. దానికి స్వీయ నమ్మకమూ, నిర్భీతీ తోడైతే.. వాటిని అందుకోవడం చాలా తేలికంటోంది. ఆమె ఈ తీరే.. బైజూస్‌ను అభివృద్ధి పథంలో సాగేలా చేసింది. దివ్య నాన్న ఏర్‌ఫోర్స్‌లో డాక్టర్‌, అమ్మ దూరదర్శన్‌ ఉద్యోగి. నాన్న స్ఫూర్తితో సైన్స్‌, మేథ్స్‌లపై ఇష్టాన్ని పెంచుకుంది. బయోటెక్నాలజీలో డిగ్రీ చేసింది. పై చదువులకు విదేశాలకు వెళ్లేందుకు జీఆర్‌ఈ కోచింగ్‌ తీసుకోవాలనుకుంది. అప్పుడే ఆమెకు బైజూ రవీంద్రన్‌ గురించి తెలిసింది. ఆయన శిక్షణతో పరీక్ష రాసింది. ఫలితాలొచ్చేలోగా బైజూ ఇన్‌స్టిట్యూట్‌లో తాత్కాలికంగా బోధించడం మొదలుపెట్టింది. అప్పటికి ఆమె వయసు 21. తర్వాత యూఎస్‌లో మంచి విద్యాసంస్థలో సీటు వచ్చినా టీచింగ్‌పై మమకారంతో దాన్ని వదులుకుంది. ఈ క్రమంలోనే బైజూ రవీంద్రన్‌తో ప్రేమ, పెళ్లి.

నేర్చుకోవడం పరీక్షల కోసం కాకుండా ఇష్టంగా సాగాలని దివ్య భావించేది. అందుకే బోధనలో కొత్త పద్ధతులను అనుసరించేది. బోధనలో కొనసాగే కొద్దీ ఒక్కొక్కరికీ ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తే బాగుంటుందనుకుంది. ఆ ఆలోచనా ఫలితమే 2015లో బైజూస్‌ లెర్నింగ్‌ ఆప్‌కు కారణమైంది. దీనికి దివ్య కోఫౌండర్‌. సంస్థ పనులు చూసుకుంటూనే బోధననూ కొనసాగించింది. సబ్జెక్టులను విడమరిచి, సులువుగా అర్థమయ్యేలా చెప్పడం ఆమె ప్రత్యేకత. అందుకే విద్యార్థులూ ఆకర్షితులయ్యారు. సంఖ్య పెరిగే కొద్దీ టీచర్లనూ పెంచుకుంటూ వెళ్లారు. మొదట 4-12 తరగతుల వారికోసం ప్రారంభమైన ఈ యాప్‌ ఇప్పుడు పోటీపరీక్షల వారికీ శిక్షణనిస్తోంది. ప్రస్తుతం దీనికి ఏడున్నర కోట్లకుపైగా సబ్‌స్క్రైబర్లున్నారు. ఫేస్‌బుక్‌ అధినేత జుకర్‌బర్గ్‌ సహా ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ప్రముఖులు బైజూస్‌లో పెట్టుబడులు పెట్టారు. కరోనా కారణంగా ఆన్‌లైన్‌ తరగతులతో దీనికి మరింత ఆదరణ పెరిగింది. దీంతో ఈమె సంపద ఒక బిలియన్‌ డాలర్లు పెరిగి రూ.3.02 లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాదికిగానూ ఫోర్బ్స్‌ విడుదల చేసిన ‘దేశంలో 100 మంది సంపన్ను’ల జాబితాలో 47, మహిళల్లో 4వ స్థానాల్లో నిలిచింది. పైగా.. అందరిలో తనే పిన్న వయస్కురాలు (35ఏళ్లు).


ధనలక్ష్ముల్లో సీనియర్లు...

ఓపీ జిందాల్‌ గ్రూప్‌ అధినేత్రి 71 ఏళ్ల సావిత్రీ జిందాల్‌ రూ. 13.46 లక్షల కోట్లతో మహిళల్లో మొదటి స్థానంలో ఉన్నారు. గత ఏడాదిలో ఆమె సంపద వృద్ధి రూ.9.72 లక్షల కోట్లు. మొత్తం జాబితాలో ఈమెది ఏడో స్థానం. 24వ ర్యాంకుతో రెండో స్థానంలో హ్యావెల్స్‌ ఇండియా అధినేత్రి వినోద్‌ రాయ్‌ గుప్తా (76) నిలిచారు. ఈమె సంపద విలువ రూ.5.68 లక్షల కోట్లు. 43వ ర్యాంకు, రూ.3.28 లక్షల కోట్లతో యూఎస్‌వీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అధినేత్రి లీనా తివారి మూడో స్థానంలో నిలిచారు. ఐదో స్థానం 68 ఏళ్ల కిరణ్‌ మజుందార్‌షా (రూ.2.91 లక్షల కోట్లు)ది. గత ఏడాది (రూ.3.43 లక్షల కోట్లు) తో పోలిస్తే ఈమె సంపద విలువ చాలా తగ్గింది. ర్యాంకు 53. రూ.2.16 లక్షల కోట్లతో చివరగా ట్రాక్టర్స్‌ అండ్‌ ఫార్మ్‌ ఎక్విప్‌మెంట్‌ లిమిటెడ్‌ అధినేత్రి మల్లికా శ్రీనివాసన్‌ నిలిచారు. ఈమె ర్యాంకు 73.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్