ఆర్మీ పహరాకు ఆసరా.. మేజర్‌ రాణా!

ఒక్కోసారి దట్టంగా కురిసే మంచు.. ఇంకోసారి ముంచుకొచ్చే వరదలు.. పరిస్థితి ఏదైనా పహారా, తక్షణ చర్యలు తప్పనిసరే. ఇవి సరిగ్గా జరగాలంటే రహదారులూ సరిగా ఉండాలి. ఆ బాధ్యతే తీసుకుంది మేజర్‌ ఐనా రాణా! దేశంలో ఆ బాధ్యతను అందుకున్న తొలి మహిళా అధికారిగా నిలిచింది.

Published : 08 Oct 2021 01:18 IST

ఒక్కోసారి దట్టంగా కురిసే మంచు.. ఇంకోసారి ముంచుకొచ్చే వరదలు.. పరిస్థితి ఏదైనా పహారా, తక్షణ చర్యలు తప్పనిసరే. ఇవి సరిగ్గా జరగాలంటే రహదారులూ సరిగా ఉండాలి. ఆ బాధ్యతే తీసుకుంది మేజర్‌ ఐనా రాణా! దేశంలో ఆ బాధ్యతను అందుకున్న తొలి మహిళా అధికారిగా నిలిచింది.
ఐనా రానాది హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి. కానీ పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో స్థిర పడ్డారు. ఆమె కుటుంబంలో ఆర్మీ నేపథ్యమున్న వారెవరూ లేరు. పఠాన్‌కోట్‌లో వాళ్ల ఇంటికి దగ్గర్లో కంటోన్మెంట్‌ ఏరియా ఉండేది. అక్కడ కనిపించే సైనికులను చూసి దేశరక్షణ వైపు ఆకర్షితురాలైంది. ఎప్పటికైనా సైన్యంలోకి వెళ్లాలన్న కోరికతో ఎన్‌సీసీలో చేరింది. రిపబ్లిక్‌ డే పరేడ్‌ల్లో పాల్గొంది. తర్వాత శిక్షణకు ఎంపికై సైన్యంలో చేరింది. ఈమె భర్త అనూప్‌ కుమార్‌ యాదవ్‌ కూడా మేజరే. తొమ్మిదేళ్లపాటు భారతీయ ఆర్మీలో సేవలందించింది. ఇటీవలే భారత్‌ - చైనా సరిహద్దుల్లో పని చేస్తున్న రహదారి సంస్థ (ఆర్‌సీసీ) సారథ్య బాధ్యతను తీసుకుంది. తద్వారా దేశంలో ఆ బాధ్యతలను తీసుకున్న తొలి మహిళా ఆర్మీ ఆఫీసర్‌గానూ నిలిచింది. మహిళా సాధికారతను పెంచాలనే ఉద్దేశంతో బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌ఓ) ఐనాకు ఈ అవకాశమిచ్చింది. బీఆర్‌ఓ కూడా సైన్యంలో ఓ భాగమే. భారత సరిహద్దుల్లో రహదారుల అభివృద్ధి, నిర్వహణ బాధ్యత ఈ సంస్థదే.
ఉత్తరాఖండ్‌లోని పిపల్‌కోట్‌లో పోస్టింగ్‌. భారత్‌-చైనా బోర్డర్‌ను కలిపే బద్రీనాథ్‌ రోడ్‌లో పని. ఇది 14000 అడుగుల ఎత్తులో ఉండటమే కాక భారీగా మంచు కురిసే ప్రాంతం కూడా. అంతేకాదు అనుకోని వాతావరణ మార్పులు, విపత్తులు, వర్షాలు, వరదలు వంటివి ఇక్కడ సాధారణం. ఏటా 75% రోడ్లు కొట్టుకు పోతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాటి నిర్వహణ పెద్ద సవాలే. కానీ.. ‘ఆర్మీ అంటేనే రోజుకో సవాలు. వాటికెప్పుడూ భయపడలేదు. బాధ్యత ఇంకాస్త పెరిగిందనుకుంటున్నా. ఇక్కడ ఆడ, మగ అన్న తేడా కూడా ఉండదు, ఆఫీసర్‌ అంతే. ఈ విషయమే నా మనసులో ఎప్పుడూ ఉంటుంది. సైన్యం విధులకు అంతరాయం కలిగించకుండా నావంతుగా కృషి చేయడమే నా బాధ్యత’ అని జవాబిస్తోంది ఐనా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్