Updated : 09/10/2021 02:07 IST

అంధులకు వంట నేర్పుతోంది!

కొన్ని నిమిషాలు చీకట్లో ఉండటానికే కంగారు పడిపోతాం. అలాంటిది జీవితాంతం వెలుగును చూసే ఆస్కారమే లేనివాళ్ల పరిస్థితేంటి? అలాంటి వాళ్లలో స్థైర్యం నింపడంతోపాటు రుచికరంగా వంటలు చేయడమూ నేర్పిస్తోంది... పాయల్‌ కపూర్‌..

పాయల్‌.. పాడ్‌కాస్ట్‌, తన యూట్యూబ్‌ ఛానెల్‌ ‘రసోయి కే రహస్య’ ద్వారా చూపు లేని వారికోసం కుకింగ్‌ ట్యుటోరియల్స్‌ నిర్వహిస్తోంది. ఆవిడ రెండు దశాబ్దాలుగా అంధుల కోసం పాటు పడుతోంది. ఈమె కూడా అంధురాలే కానీ పుట్టుకతో మాత్రం కాదు. పాయల్‌ది హైదరాబాద్‌. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్‌ చేసింది. చెఫ్‌గా ప్రముఖ హోటల్‌లో ఉద్యోగమూ సాధించింది. అనుకోకుండా ఆమె కళ్లకి సమస్య వచ్చింది. చూపు పోవడమే కాదు.. కొద్దిశాతం వినికిడీ, స్పర్శలనూ కోల్పోయింది. కారణమేంటో డాక్టర్లూ చెప్పలేకపోయారు. కొద్దిరోజులకు వినికిడి, స్పర్శ తిరిగొచ్చినా చూపు మాత్రం దక్కలేదు. అప్పటికి ఆమె వయసు 22 ఏళ్లే. అలాగని ఆమేం కుంగిపోలేదు. మిగతా అంధులతో పోలిస్తే తన పరిస్థితి నయమేననుకుంది. ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంది. మళ్లీ నేర్చుకోవడం ప్రారంభించింది. బ్రెయిలీ లిపిపై దృష్టిపెట్టింది. చదవడం, రాయడం, తోడు లేకుండా బయటికి వెళ్లడం.. వంటి వన్నీ నేర్చుకోవడానికి ఆరేళ్లు పట్టింది.

తర్వాత అంధుల ఆశ్రమంలో చేరి అక్కడి వాళ్లకి తాను నేర్చుకున్నవి నేర్పించడం, సాయం చేయడం మొదలుపెట్టింది. ఇక్కడ ఆరేళ్లు గడిపాక తిరిగి వంటపై దృష్టిపెట్టి ఓ హోటల్‌లో పనిచేసింది. ఆపై ‘మెర్క్యురీ మెడికా’ అనే సంస్థలో చేరింది. ఆపత్కాలంలో సీపీఆర్‌, ఫస్ట్‌ ఎయిడ్‌ వంటి వాటిలో సర్టిఫికేషన్‌నూ పొందింది. దేశంలో ఈ ఘనత సాధించిన తొలి అంధురాలిగానూ నిలిచింది. టెడెక్స్‌ వంటి వేదికలపైనా ప్రసంగాలనిస్తోంది. అంధుల కోసం అవగాహన కార్యక్రమాలూ, దైనందిన జీవితంలో ఎలా సాగాలో శిక్షణనిస్తోంది. గత ఏడాది లాక్‌డౌన్‌ తర్వాత అంతా స్తంభించింది. బయటికి వెళ్లి తినే ఆస్కారం లేదు. దీంతో చూపులేని వాళ్లూ వండుకోక తప్పని పరిస్థితి. అదిగో అప్పుడే వాళ్ల కోసం పాడ్‌కాస్టింగ్‌, యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించింది. ‘వంట చేయడం నాకు చాలా ఇష్టం. కానీ నా పరిధుల దృష్ట్యా త్వరగా ప్రయోగాల జోలికి వెళ్లను. లాక్‌డౌన్‌తో ఎందరో అంధులు తిండికి ఇబ్బంది పడ్డారు. వీళ్లకి సాయం చేయడానికి ఏవైనా ఛానెళ్లు ఉన్నాయేమోనని వెతికా. ప్రయోజనం లేదు. అందుకే ‘రసోయి కే రహస్య’ మొదలు పెట్టా. మసాలాలను గుర్తించడం, వాటిని ఎలా పెట్టుకోవాలి వంటివన్నీ దీనిలో చెబుతా. చాలా మంది మొబైళ్లలో టాక్‌బ్యాక్‌ వంటి యాప్‌లు ఉంటున్నాయి. బార్‌కోడ్‌, బ్రెయిలీ లిపిలో రాసుంటాయి. వాటి ఆధారంగా ఎలా ఎంచుకోవాలో సూచనలిస్తా. టైమర్‌తో ఎన్ని నిమిషాలు వండాలో, వాసన, పట్టుకుని కూడా ఉడికిందో లేదో ఎలా తెలుసుకోవచ్చో వంటివన్నీ దీనిలో ఉంటాయి’ అని వివరిస్తోంది పాయల్‌. చిన్న చిన్న వంటలతో వారానికో ఎపిసోడ్‌ చేస్తోంది. పిల్లల్లో తమ వైకల్యాన్ని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై పనిచేస్తోంది. ఈమె సేవలకు గుర్తింపుగా ఈ ఏడాది ఎన్‌సీపీఈడీపీ మెఫసిస్‌ యూనివర్సల్‌ డిజైన్‌ అవార్డుకూ ఎంపికైంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని