దేశాధ్యక్షుణ్నే ఢీ కొట్టింది!

యుద్ధభూములు... ఉగ్రవాద అడ్డాలు... ఆమెను అడ్డుకోలేకపోయాయి.. తమ దేశాధ్యక్షుడి అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నిస్తూ ‘ఢీ... అంటే ఢీ’ అంటూ 58 ఏళ్ల మారియారెస్సా చేస్తున్న అక్షర సమరం అవినీతికి వ్యతిరేకంగా కోట్ల మందికి పిడికిళ్లు బిగించే శక్తిని అందించింది. నోబెల్‌ శాంతి బహుమతిని అందుకున్న ఈ ఫిలిప్పీన్స్‌ పాత్రికేయ యోధురాలి పోరాట గాథ ఇది...ఫిలిప్పీన్స్‌లో ఆ దేశ అధ్యక్షుడు రోడ్రిగో ఎంతమందికి తెలుసో... జర్నలిస్టు మారియారెస్సా గురించి కూడా అంతమందికీ తెలుసు.

Updated : 09 Oct 2021 01:52 IST

యుద్ధభూములు... ఉగ్రవాద అడ్డాలు... ఆమెను అడ్డుకోలేకపోయాయి.. తమ దేశాధ్యక్షుడి అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నిస్తూ ‘ఢీ... అంటే ఢీ’ అంటూ 58 ఏళ్ల మారియారెస్సా చేస్తున్న అక్షర సమరం అవినీతికి వ్యతిరేకంగా కోట్ల మందికి పిడికిళ్లు బిగించే శక్తిని అందించింది. నోబెల్‌ శాంతి బహుమతిని అందుకున్న ఈ ఫిలిప్పీన్స్‌ పాత్రికేయ యోధురాలి పోరాట గాథ ఇది...

ఫిలిప్పీన్స్‌లో ఆ దేశ అధ్యక్షుడు రోడ్రిగో ఎంతమందికి తెలుసో... జర్నలిస్టు మారియారెస్సా గురించి కూడా అంతమందికీ తెలుసు. రోడ్రిగో మేయర్‌గా ఉండగా అతని మొదటి ఇంటర్వ్యూ చేసింది రెస్సా. ఆ ఇంటర్వ్యూలో అతని హత్యారాజకీయాల్ని అతని నోటితోనే చెప్పించింది. అతనూ తగ్గలేదు. గంటకు 90 చొప్పున అభ్యంతరకర మెసేజ్‌లు పంపిస్తూ వేధింపులు మొదలుపెట్టాడు. ప్రశ్నించడానికీ, అధికారానికీ మధ్య మొదలైన ఆ యుద్ధం ఎక్కడా తగ్గలేదు. సాగుతూనే ఉంది. అతను అంచలంచెలుగా దేశాధ్యక్షుడి స్థాయికి వెళ్లాడు. అతనితోపాటు అతని అవినీతి, అధికార దుర్వినియోగం కూడా పెరిగాయి. రెస్సా కూడా తగ్గలేదు. అతను డ్రగ్‌ మాఫియాను తుదముట్టించే నెపంతో పన్నెండువేలమంది ప్రజల్ని చంపడాన్ని కథనాలుగా రాసింది. పక్కలో బల్లెంలా మారింది. అందుకే పదేళ్ల కాలంలో ఆమెపై పది అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. వాటికీ భయపడలేదు. ఈ పోరాటం నా ఒక్కదానిదే కాదు... నాలాంటి అనేక మంది జర్నలిస్టులది అంటూ వారిలో ప్రశ్నించే తత్వాన్ని మేలుకొలిపింది. ఈ నోబెల్‌ బహుమతి నాలోని పోరాడే శక్తికి ఇంధనంగా మారుతుందని అనుకుంటున్నా అనే  మారియా వృత్తిపరంగా ఎన్నో విజయాలని మూటగట్టుకుంది.
మారియా పుట్టింది ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో. ఆమె పుట్టిన ఏడాదికే తండ్రి చనిపోవడంతో... పిల్లలని తాతగారింట్లో వదిలి అమెరికా వెళ్లింది మారియా తల్లి. కొన్నాళ్లకి మరో పెళ్లి చేసుకుని పిల్లల్నీ అమెరికా తీసుకెళ్లింది. మారియా అమెరికాలోనే మాలిక్యులర్‌ బయాలజీలో డిగ్రీ చదివింది. ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ నుంచి బీఏ ఇంగ్లిష్‌, థియేటర్‌ కోర్సులు చేసింది. ఇక్కడే ఆమెకు మిషెల్‌ ఒబామా సహాధ్యాయి. మొదట ప్రోబ్‌ అనే సంస్థని మొదలుపెట్టింది. తర్వాత  కొన్నాళ్లు ప్రభుత్వ ఉద్యోగం చేసింది. కానీ పరిశోధనాత్మక జర్నలిజంపై ఇష్టంతో సీఎన్‌ఎన్‌లో చేరింది. ఆ సంస్థ ఆగ్నేయాసియా విభాగంలో కీలక ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్టుగా మారి 20 ఏళ్లు సేవలందించింది. మనీలా, జకార్తాలకు బ్యూరోచీఫ్‌గా పనిచేసింది. ఈ సమయంలోనే ఆల్‌ఖైదా నెట్‌వర్క్‌ కార్యకలాపాలను పూర్తిస్థాయిలో వెలికి తీసి శెభాష్‌ అనిపించుకుంది. ఆ అనుభవంతోనే ‘సీడ్స్‌ ఆఫ్‌ టెర్రర్‌’, ‘ఫ్రమ్‌ బిన్‌లాడెన్‌ టు ఫేస్‌బుక్‌’ అనే పుస్తకాలని రాసింది. సీఎన్‌ఎన్‌లో పనిచేస్తూనే 2012లో మరో ముగ్గురు మహిళా పాత్రికేయులతో కలిసి రాప్లర్‌ అనే డిజిటల్‌ మీడియా సంస్థని స్థాపించింది. ఫేస్‌బుక్‌ పేజీగా ప్రారంభమయిందీ సంస్థ. దీనిలో వచ్చే కథనాలు ఆ దేశయువతలో చైతన్యం నింపడం మొదలుపెట్టాయి. ఏది నిజం.. ఏది అబద్ధం అని తెలుసుకోవడానికి ప్రజలంతా రాప్లర్‌ని అనుసరించడం మొదలుపెట్టారు. ప్రభుత్వ అవినీతిని, అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నిస్తూ మల్టీమీడియాగా ఎదిగిన ఈ సంస్థ క్రమంగా దేశంలో నెంబర్‌ వన్‌ స్థానానికి చేరడంతోపాటు అంతర్జాతీయంగా ఎన్నో ప్రశంసలనీ అందుకుంటూ వచ్చింది. అలాగే సోషల్‌ మీడియాలో వచ్చే ఫేక్‌ కథనాలు, వాటిని వాడుకుని ప్రత్యర్థులపై జరిగే దాడి వంటివాటిపైనా, ట్రోలింగ్‌ ఆర్మీపైనా రెస్సా ఉద్యమిస్తూ పత్రికల భావప్రకటనా స్వేచ్ఛకోసం పోరాడింది. 2012లో ఒక వ్యాపారవేత్తపై రాప్లర్‌ రాసిన కథనం అభ్యంతరకరంగా ఉందంటూ సైబర్‌ లైబుల్‌ చట్టం కింద 2019లో ఆమెను అరెస్టు చేసింది అక్కడి ప్రభుత్వం. ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే వార్త ప్రచురితం అయ్యేనాటికి దేశంలో అసలు ఆ చట్టమే లేదు. మరోసారి పన్ను ఎగ్గొట్టిందన్న నెపంతో పదేళ్లు జైలు శిక్ష విధించింది. ఆమెను అరెస్టుని నిరసిస్తూ ప్రజలు, జర్నలిస్టులు ప్రచారోద్యమాన్ని సాగించారు. ఎన్నో గడ్డు పరిస్థితుల్ని ధైర్యంగానే ఎదుర్కొంటూ వచ్చింది రెస్సా. 2018లో టైమ్‌ మ్యాగజైన్‌ ముఖచిత్రంపైనా మెరిసింది. గోల్డెన్‌ పెన్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌ వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులనీ అందుకుంది. వ్యక్తిగత విషయానికొస్తే ‘నాకు పిల్లలు లేరు. ఒక వేళ ఉన్నా వాళ్లకి సరైన న్యాయం చేసేదాన్ని కాదేమో. ఎందుకంటే నాకు నా పనే ముఖ్యం. నేనొక మొక్కనే సరిగ్గా పెంచలేకపోయాను’ అంటూ నవ్వేస్తారామె.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్