చెట్లకు డబ్బులు కాయిస్తోంది!

డబ్బు చెట్లకు కాయదంటే ఆవిడ నవ్వుతుంది. ఎందుకంటే...తను అదే పని చేస్తోంది కాబట్టి.  ఒక చెట్టుతో కోట్లు కురిపించిన బిక్కవోలు మహిళ మార్గాని సత్య విజయగాథ ఇది. ఆ కథేంటో వసుంధరతో పంచుకున్నారావిడ. 

Updated : 10 Oct 2021 06:00 IST

డబ్బు చెట్లకు కాయదంటే ఆవిడ నవ్వుతుంది. ఎందుకంటే...తను అదే పని చేస్తోంది కాబట్టి.  ఒక చెట్టుతో కోట్లు కురిపించిన బిక్కవోలు మహిళ మార్గాని సత్య విజయగాథ ఇది. ఆ కథేంటో వసుంధరతో పంచుకున్నారావిడ.  

మా పుట్టిల్లు తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు. చదివింది ఏడో తరగతే. పెళ్లైన తర్వాత కడియం వచ్చా. మావారికి అక్కడ నర్సరీ ఉండటంతో ఆ పనులు చూసుకునేదాన్ని. మొక్కలు నాటడం, పాదులు చేయడం, నీరుపెట్టడం, అంటుకట్టడం, కలుపుతీయడం, ఎరువులు వెయ్యడం, మందుల పిచికారీ... కూలీలతో నర్సరీ పనులు చేయించడం నా పని. ఇరవై ఏళ్లుగా మొక్కలు నా జీవితంలో భాగమైపోయాయి. అవి నాకు చంటిపిల్లల్లానే అనిపిస్తాయి. నేను వాటితో మాట్లాడతాను. వాటికేమయినా ఇబ్బందులుంటే తెలుసుకుంటా. పన్నెండేళ్ల క్రితం ఇంటి పెరట్లో వేసేందుకని నాలుగు మొక్కలని సింగపూర్‌ నుంచి తెప్పించా. వీటిని మడగాస్కర్‌ ఆల్మండో అంటారు. బాదం జాతి మొక్కలు. మనదేశంలో ఇవి తక్కువ. కానీ కంబోడియా, చైనా, సింగపూర్‌, థాయ్‌లాండ్‌, మలేసియా దేశాల్లో వర్షాధార అడవుల్లో పెరిగే చెట్టని తెలుసుకున్నా. చూడ్డానికి అందంగా ఉండేవి. నాలుగేళ్లకు అవి పూతకొచ్చి గింజలు రాలడం మొదలైంది. మా వాకిలంతా గింజలతో నిండిపోయేది. వాటిని ఊడ్చి బయట పారేస్తుంటే ప్రాణం ఉసూరుమనిపించేది. అలా వృథాగా పారేసేకంటే మొక్కలుగా మారిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. సరదాకి నాలుగు విత్తనాలు కుండీలో వేశా. అంతకుమించి ఆ చెట్ల పెంపకం గురించి నాకేం తెలీదు. చూస్తే... అవి మొలకలొచ్చి కనిపించాయి. ఎందుకో అవి మన వాతావరణంలో బాగానే పెరుగుతాయనే నమ్మకమొచ్చింది. అలా సుమారు అయిదు వేల విత్తనాలు సేకరించి వాటిని మడులుగా చేసి విత్తాను. రెండున్నర వేలకు పైగా చెట్లు మొలిచాయి. వాటిని చాలా జాగ్రత్తగా పెంచాను. అలా నాలుగు మొక్కల నుంచి ఇప్పటి వరకు సుమారు 16 లక్షల మొక్కలని పెంచాం. మొదటి ఏడాదే లక్ష మొక్కలని పెంచి వాటిని అమ్మి రూ.కోటిన్నర ఆదాయం పొందాను. కడియం ప్రాంతంలో ఈ మొక్కను పెంచింది మొదట నేనేనని గర్వంగా చెప్పగలను. చూడ్డానికి ఈ చెట్లు ఆకర్షణీయంగా.. సుమారు 45 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. ఏడాదంతా పచ్చగా ఉంటూ.. నీడనిస్తాయి. బలమైన ఈదురుగాలులని తట్టుకొని నిలబడగలవు. పర్యావరణానికీ, జీవవైవిధ్యానికీ సహకరిస్తాయి. నేలసారం పోకుండా అడ్డుకుంటాయి. అన్నింటికీ మించి వీటి అందమైన ఆకృతీ, మన వాతావరణానికి తట్టుకోగలిగే లక్షణం ఉండటం వల్ల దేశమంతా విస్తరించింది. 

దేశం నలుమూలకు..
మా నర్సరీకి వచ్చేవారికి ఈ మొక్క బాగా నచ్చేది. దాంతో అనూహ్యంగా ఆర్డర్లు వచ్చాయి. దిల్లీ, ముంబయి, బెంగళూరు, పుణె, హైదరాబాద్‌ తదితర నగరాలతో పాటు అనేక రాష్ట్రాలకు వీటిని ఎగుమతి చేస్తున్నాం. ఇన్ఫోసిస్‌, విప్రో, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ తదితర ఐటీ సంస్థలు వీటిని తమ కార్యాలయ ప్రాంగణాల్లో పెంచుతున్నాయి. అలాగే నగరాల్లో ఇంటి వాకిట్లో, ఫాంహౌస్‌లు, విల్లాలు, పార్కులు, ప్రైవేట్‌ స్థలాల్లో వీటిని పెంచడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో ల్యాండ్‌ స్కేపింగ్‌ చేసేవారు వీటిని ఎక్కువగా కొంటున్నారు. శంషాబాద్‌, విశాఖ, విజయవాడ విమానాశ్రయాలకు వెళ్లే మార్గాల్లో ఉన్న చెట్లన్నీ మా నర్సరీ నుంచి వెళ్లినవే. ఏటా 80 నుంచి 90 వేల మొక్కలని పెంచుతున్నాం. స్థానికంగా ఉండే చిన్న నర్సరీలకు విత్తనాలు అందజేస్తున్నా. మొదట్లో ఈ మొక్కలకి బాగా డిమాండ్‌ ఉండేది. ఇప్పుడు మాత్రం ధర అందరికీ అందుబాటులోకి వచ్చింది. వీటి పెంపకం ద్వారా పది మందికి ఉపాధి లభిస్తోంది. ఆదాయం కంటే పర్యావరణానికీ మేలు చేస్తున్నాననే సంతృప్తి నాకు అన్నిటికంటే ఎక్కువ ఆనందాన్నిస్తుంది. మా పెరట్లో పెరిగే టెర్మినాలియా మాంటలి అదేనండీ ఈ మొక్క శాస్త్రీయనామం. నా కుటుంబంతో పాటు వందల కుటుంబాలను పోషించడం సంతోషంగా ఉంది.

- అమ్ముల మోహిత్‌ నాగప్రసాద్‌, రాజమహేంద్రవరం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్