Updated : 12/10/2021 05:44 IST

పది రూపాయల పొదుపుతో జాగృతి

రోజుకో రూపాయి పొదుపు అంటే నవ్వారందరూ.  ఆ నినాదమే వేల మంది సామాన్య మహిళల తలరాతలను మార్చింది. దాన్ని అందిపుచ్చుకుని వారు ఏర్పాటు చేసుకున్న ఓ చిన్న సంఘం నేడు బ్యాంకై వారి జీవితాలకు భరోసానిస్తోంది. సమష్టి బలాన్ని గ్రహించిన వాళ్లు ప్రారంభించుకున్న స్వచ్ఛంద సంస్థ ఆర్థికేతర సమస్యల్లోనూ అండగా నిలుస్తోంది.... ఇదంతా విశాఖ జిల్లా ‘జాగృతి పరస్పర సహకార పొదుపు సంఘం’ విజయగాథ... 22 వేల మంది మహిళల స్ఫూర్తిగాథ...

* గాయత్రికి తన కాళ్లపై తాను నిలబడాలనేది కోరిక. పెట్టుబడి పెట్టలేక భర్త చేసే పనిలో సాయం చేసేది. వ్యాపారం కోసం ఎక్కువ వడ్డీకి రుణాలు తెచ్చి ఇబ్బందుల్లో పడిందా కుటుంబం. ఆ సమయంలో వారికి జాగృతి సహకార సంఘం అండగా నిలిచింది. తక్కువ వడ్డీకి రుణం ఇచ్చి... సమస్యల నుంచి గట్టెక్కించింది. పొదుపు బాట పట్టించి మరికొంత మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేర్చింది.

శ్రీలక్ష్మికి సొంత ఇల్లు కల. ఒక్కోరూపాయి ఇందులో పొదుపు చేసింది. అక్కడే మరి కొంత రుణం తీసుకుని ఇల్లు కట్టుకుంది. నెలసరి వాయిదాలు సరిగ్గా కడుతూ... త్వరగానే ఆ రుణం నుంచీ బయటపడింది. వీరికే కాదు.. ఎందరో మహిళల జీవితాల్లో జాగృతి పరస్పర సహకార పొదుపు సంఘం వెలుగులు నింపుతోంది. మూడు దశాబ్దాల ప్రయాణంలో వేల మంది గ్రామీణ స్త్రీల భాగస్వామ్యంతో ముందుకు వెళ్తోంది. నిజానికి వీరెవరూ పొదుపు, రుణాల కోసం బ్యాంకుకి వెళ్లనవసరం లేదు. అవసరం చెబితే బ్యాంకే వీరి దగ్గరకు వచ్చి సాయమందిస్తుంది. ఇందువల్లే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎందరో మగువలు తమ కాళ్లపై తాము నిలబడగలిగారు. ఉపాధి అవకాశాలు కల్పించుకుని వ్యాపారాలు చేస్తున్నారు. ఎండీగా కందర్ప సుజాత, సీఈవోగా మౌక్తిక వ్యవహరిస్తున్నారు. వీరి బృందంలో మరో తొమ్మిది మంది మహిళలూ కీలకంగా పనిచేస్తున్నారు.

పొదుపు సంఘంగా మొదలై...

1992లో సబ్బవరం మండలం ఇరువాడ గ్రామంలో మొదట కేవలం పదిమందితో ఓ పొదుపు సంఘం ఏర్పాటైంది. పొదుపు చేసిన అయిదు నెలల తర్వాత ఆ మొత్తానికి అయిదు రెట్లు రుణం తీసుకునే విధంగా దీన్ని ఏర్పాటు చేశారు. దీనికి రూపకల్పన చేసింది దేవీపురానికి చెందిన ప్రహ్లాదశాస్త్రి. ఆయన ఆధ్యాత్మికవేత్త. గ్రామాలు, మహిళల్లో మార్పుని కాంక్షించిన ఆయన అవగాహన కల్పించడం ప్రారంభించారు. వ్యవసాయ పనుల్లో తలమునకలైన స్త్రీలను ఆర్థిక సాధికారత దిశగా నడిపించేందుకు రాత్రిళ్లు డప్పులతో ఆటాపాటా ఏర్పాటు చేసేవారు. ‘రోజుకో రూపాయి పక్కన పెట్టుకో’ అని అర్థమయ్యేలా చెప్పేవారు. అయితే మార్పు అంత సులువుగా జరగలేదు. మగవారి విమర్శలతో ఆడవాళ్లు ముందడుగు వేసే వారు కాదు. అయినా సరే పట్టు వదలకుండా ఏడాదిన్నర పాటు ప్రయత్నించి విజయం సాధించారు. రోజుకో రూపాయి పక్కన పెట్టించి... ముప్పైలో పదిరూపాయల్ని పొదుపు చేయించారు. ఐదునెలల తర్వాత ఆ మొత్తానికి ఐదురెట్లు రుణాలు ఇచ్చి... వారు తమ ఇబ్బందులను అధిగమించేలా చేశారు. దీంతో రెండేళ్ల కాలంలో పది మందితో ప్రారంభమై అయిదు గ్రామాల పరిధిలో 1600 మంది చేరారు. ఆపై 1995లో ప్రభుత్వం సహకార చట్టం తీసుకు రావడంతో సంస్థను సహకార సంఘంగా రిజిస్టర్‌ చేయించుకున్నారు. అలా అది విశాఖ జిల్లాలోనే మొదటి రిజిస్టర్డ్‌ సహకార సంఘం బ్యాంకుగా పేరు తెచ్చుకుంది. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. 2021 నాటికి విశాఖ జిల్లా సబ్బవరం, గాజువాక, పరవాడ, పెందుర్తి, కె.కోటపాడు, అనకాపల్లి మండలాల్లోని 252 గ్రామాల్లో 22 వేల మంది మహిళలు ఇందులో భాగస్వాములయ్యారు. రూ.16 వేలతో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ బ్యాంకు ఇప్పుడు ఏటా రూ.24 కోట్ల టర్నోవర్‌ చేస్తోంది. ఇందులో పొదుపు రూ.18 కోట్ల పైమాటే.

గ్రామాల్లోకే బ్యాంకు..

సంఘ సభ్యులకు బ్యాంకు సిబ్బంది ప్రతి నెలా 1 నుంచి 23వ తేదీ వరకు మహిళా మండలి కన్వీనర్‌ ఆధ్వర్యంలో రుణాలు అందజేస్తారు. ప్రస్తుతం రూ.5 - 10 వేల రుణం అందిస్తున్నారు. అంతకుమించి కావాలనుకునే వారు బ్యాంకుకి వెళ్లి తీసుకోవాలి. అలానే వివిధ అవసరాల నిమిత్తం రూ.10 లక్షల వరకు అప్పు ఇస్తారు. పొదుపు పది రూపాయల నుంచి ఐదొందలయ్యింది. రుణం ఇచ్చే ముందు ఆమె సక్రమంగా వడ్డీ చెల్లిస్తుందా, కుటుంబ పరిస్థితులు వంటివన్నీ గమనిస్తారు. ప్రారంభంలో ఎక్కువగా వ్యవసాయ పనులు, పాడి పశువుల కొనుగోలుకు రుణం ఉపయోగించుకునేవారు. ప్రస్తుతం పిల్లల చదువులు, ఆస్తుల కొనుగోలు, వివాహాల కోసం రుణం తీసుకుంటున్నారు. అప్పట్లో వ్యతిరేకించిన వాళ్లు సైతం రుణాల కోసం వరుసలో నిలబడుతున్నారు.


సాధికారత దిశగా...

పొదుపు, రుణాలే కాదు...మహిళల ఇబ్బందులు తెలుసుకునేందుకు 2010లో జాగృతి స్వచ్ఛంద సంస్థని కూడా ఏర్పాటు చేసుకున్నారు. గర్భాశయ, నేత్ర సమస్యలను గుర్తించి గాయత్రీ ఆసుపత్రుల సాయంతో చికిత్సలూ అందిస్తున్నారు. పిల్లలకు కెరీర్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించడంతో పాటు కుటుంబ తగాదాలనూ పరిష్కరిస్తున్నారు. ‘జాగృతి మా గ్రామాల్లో సామాజిక చైతన్యం తీసుకొచ్చింది. పదిరూపాయల పొదుపుతో మేం మొదలుపెట్టిన ప్రయాణం ఇప్పుడు పదిలక్షల రుణం అందించే స్థాయికి చేర్చింది. మరింతమంది మహిళల్ని చైతన్యవంతుల్ని చేసి సాధికారత దిశగా నడిపించడమే మా ధ్యేయం’ అంటారు ఆ సంస్థ ఎండీ సుజాత. 

-సురేష్‌ రావివలస, విశాఖపట్నం


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని