Updated : 08/12/2021 16:50 IST

ఈ రికార్డుల బామ్మ బ్యాగులు పంచుతుంది

పర్యావరణ కాలుష్యం నుంచి ప్రకృతిని కాపాడాలనుకున్నారామె. ఇందులో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలనుకున్నారు. అందులో భాగంగానే... ఎదుటపడిన ప్రతి ఒక్కరికీ వస్త్రంతో తయారైన సంచులు ఉచితంగా పంచుతున్నారు. మరెన్నో పరిరక్షణ కార్యక్రమాలూ చేస్తున్నారు. రాయ్‌పుర్‌కు చెందిన 67ఏళ్ల డాక్టర్‌ శుభాంగి ఆప్టే. ఆ వివరాలను ‘ఈటీవీ భారత్‌’తో పంచుకున్నారు...

ప్లాస్టిక్‌ తిని పశువులు చనిపోతున్నాయన్న వార్తలు చదివినా, విన్నా మనసంతా ఆందోళనగా ఉండేది. ప్లాస్టిక్‌ వాటికే కాదు... మన మనుగడకూ ప్రమాదమే. దీన్ని అరికట్టాలంటే అందరం భాగస్వాములం కావాలి. అది నా నుంచే మొదలవ్వాలనుకున్నా. మార్కెట్‌కు వచ్చిన వారి చేతిలో ప్లాస్టిక్‌ బ్యాగులు చూసే దాన్ని. అక్కడి నుంచే మార్పు తేవాలనుకున్నా. 2008లో నా ప్రయత్నాన్ని ప్రారంభించా. ఇంట్లో తయారు చేసిన క్లాత్‌బ్యాగులను తీసుకెళ్లి కనిపించిన వారికల్లా ఇవ్వడం మొదలుపెట్టా. పాఠశాలల్లో, మహిళా దినోత్సవం వంటి సందర్భాల్లో, మార్కెట్లు, బ్యాంకుల వద్ద కాటన్‌ సంచులు పంచేదాన్ని.

ప్రశ్నించేవారు... ఈ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నా. సంచుల తయారీకి వస్త్రాన్ని సేకరించడానికి టైలర్ల వద్దకు వెళ్లేదాన్ని. వారు అనుమానంగా చూసి ఎందుకని అడిగేవారు. కొందరు నేను చెప్పేది నమ్మేవారు కాదు. వారిని నాతోపాటు ఆహ్వానించి సంచుల పంపిణీ చూపించేదాన్ని. కొందరు మహిళలైతే నా గురించి తెలిసి మా ఇంటికి వచ్చి మరీ వృథా వస్త్రాలను ఇచ్చి వెళ్లేవారు. ఒక్కొక్క సంచి తయారీకి రూ.4 ఇస్తే కొందరు మహిళలు కుట్టి తీసుకొస్తుంటారు. దీనికయ్యే ఖర్చంతా నాదే. నా లక్ష్యం కోసం నేను పొదుపు చేసినందంతా వాడేశా. గడిచిన 13 ఏళ్లలో 37 వేల బ్యాగులను పంచగలిగా. నా లక్ష్యం 50 వేలు...కానీ కొవిడ్‌ కారణంగా పూర్తి చేయలేకపోయా. ప్లాస్టిక్‌ను నిషేధించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి. ముఖ్యంగా మహిళలు ఇందులో భాగస్వాములు కావాలి. ఎవరైనా కేజీ వాడేసిన ప్లాస్టిక్‌ బ్యాగులిస్తే వారికి ఒక క్లాత్‌ బ్యాగు ఇస్తానని చెబుతున్నా. అలా సేకరించిన వాటితో ఎకో ఫ్రెండ్లీ బ్రిక్స్‌ తయారుచేస్తున్నా.

రికార్డులు... మా అమ్మాయికి పెళ్లైంది. అబ్బాయి కెరీర్‌లో స్థిరపడ్డాడు. నేనూ బిజీ అవ్వాలనుకున్నా. ఓసారి టీవీలో ఒక దివ్యాంగ చిన్నారి పెన్సిళ్లు సేకరించి రికార్డుల్లో కెక్కినట్లు చూశా. ఆ స్ఫూర్తితో 3,500 కీ రింగ్స్‌ సేకరించి 2007లో లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నా. తర్వాత విజిటింగ్‌ కార్డులు, హోటల్‌ మెనూలు, కర్చీఫ్‌లు, పాకెట్‌ భగవద్గీత, ఇన్విటేషన్‌ కార్డులు వంటివి సేకరించి మొత్తం 20 సార్లు ‘లిమ్కాబుక్‌’లో స్థానం అందుకున్నా.. ప్రతి మహిళా శక్తివంతురాలే. అనుకుంటే చేయలేనిది ఏమీ లేదు. పూర్తిగా ఇల్లు, కుటుంబం కోసమే కాకుండా మనకంటూ కనీసం ఓ గంట సమయాన్ని వెచ్చించుకుని మనసుకు నచ్చినదానికి వినియోగిస్తే... మరింత ఉత్సాహంగా ఉండగలం.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని