Updated : 16/12/2021 05:16 IST

గూగుల్‌లో వెతికి నేర్చుకున్నా!

జీవితంలో ముందుకు నడిపించేందుకు కష్టాలను మించిన గొప్ప గురువు ఎవరుంటారు? తల్లిలేదు... కూలిపని చేసి చదువుకోవాల్సిన పరిస్థితి... అడుగడుగునా ఎదురైన కష్టాల నడుమనే ఎంబీఏ చేసి వ్యాపారవేత్తగా స్థిరపడ్డారామె. తోటి మహిళలకూ ఉపాధిబాట చూపిస్తున్నారు. ఆమే.. గుంటూరుకు చెందిన వెలగపూడి కృష్ణకుమారి..

ల్లిలేని బాల్యం ఏ ఆడపిల్లకయినా చేదుగానే ఉంటుంది. కృష్ణకుమారి పరిస్థితి కూడా అదే. ఐదేళ్ల వయసులో అనారోగ్యం కారణంగా తల్లి నిర్మలని కోల్పోయారామె. తండ్రి పకీరయ్య రైతు. స్వస్థలం గుంటూరు జిల్లా శలపాడు గ్రామం. బంధువుల ఆదరణ అంతంతమాత్రం. దాంతో తండ్రి కూడా ఆడపిల్లకు చదువు ఎందుకంటూ ఏడో తరగతితోనే మాన్పించేశారు. బాగా చదివే అమ్మాయి కావడంతో టీచర్లు తిరిగి బడిలో చేర్పించారు. ‘పొలం పనులకు వెళుతూ, పశువులను కాస్తూ చదువుకునేదాన్ని. సాయంత్రం పూట పక్కింటావిడ దగ్గర టైలరింగ్‌ నేర్చుకున్నా. దాంతోపాటే క్యాండిల్స్‌ తయారీ, ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్‌ ప్రింటింగ్‌, స్క్రీన్‌ ప్రింటింగ్‌, కంప్యూటర్‌ కూడా నేర్చుకున్నాను. అప్పుడే నాకు కృష్ణా జిల్లాలోని ఆర్థిక సమతా మండలి అనే స్వచ్ఛంద సంస్థ గురించి తెలిసింది. ఆ సంస్థలో చేరి వాలంటీర్‌గా సేవా కార్యక్రమాలు చేస్తూ బాల్వాడీ టీచర్‌ శిక్షణ, దివ్యాంగులకు స్పీచ్‌ థెరపీ, చేతివృత్తులు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ వంటివి నేర్చుకున్నా. వాళ్లు నెలకు రూ.250 ప్రోత్సాహక నగదు ఇచ్చేవాళ్లు. అక్కడ ఉంటూనే బీఏ పూర్తి చేశాను. ఆ సంస్థ వాళ్లే నాకు పెళ్లి చేశారు. కానీ నా వైవాహిక జీవితం నేను కోరుకున్నట్టుగా ఆనందంగా సాగలేదు. దాంతో పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేశాను. ఓ పునరావాస కేంద్రంలో దివ్యాంగులకు శిక్షణ ఇచ్చే పనికి కుదిరాను. నెలకు రూ.8 వేల జీతం. అద్దె, పిల్లల అవసరాలకు ఆ డబ్బులు సరిపోకపోవడంతో టైలరింగ్‌, శారీ ఎంబ్రాయిడరీ వంటివి కూడా చేసేదాన్ని. ఆ డబ్బుతోనే పిల్లలను పాఠశాలలో చేర్పించాను. పగలు ఉద్యోగం చేసి, సాయంత్రం పిల్లలను చదివించుకుంటూ... దూరవిద్య ద్వారా ఎంబీఏ చదివాను’ అంటారు కృష్ణకుమారి.

ఎదుగూబొదుగూ లేని జీతంతో జీవితాన్ని సరిపుచ్చుకోవాలనుకోలేదీవిడ. తోటి మహిళలకు అండగా ఉండేందుకు శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించారు. అయితే ఇదంతా సులువుగా అయిపోలేదు. ‘అంతవరకూ మా కుటుంబానికి అండగా ఉన్న పొలం అమ్మి, వచ్చిన రూ. 20 లక్షలతో ఏదైనా చేద్దామనుకున్నా. కానీ తెలిసిన ఒకాయన ఆ డబ్బుని తీసుకుని మోసం చేశాడు. చేతిలో చిల్లి గవ్వలేదు. ఇక నాకొచ్చిన టైలరింగ్‌నే నమ్ముకున్నా. నాలా కష్టపడుతున్న మహిళల కోసం ఉపాధి అవకాశాలు కల్పించడానికని వెలగపూడి ఫౌండేషన్‌ పేరుతో ఒక సంస్థను రిజిస్టర్‌ చేయించి  దాని ద్వారా ప్రభుత్వ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి దరఖాస్తు చేసుకున్నా. టైలరింగ్‌, బ్యూటీషియన్‌, కంప్యూటర్‌ మొదలైన శిక్షణ తరగతులు చేపట్టాను. అలా 30 సంవత్సరాలు ఈ కార్యక్రమాలు నిర్వహించాను. ఇందులో భాగంగా పర్యావరణానికి మేలుచేసేలా జ్యూట్‌బ్యాగ్‌ల తయారీని ఉపాధిగా ఎంచుకోవాలనుకున్నా. నా ఆలోచన విని ఒకాయన 350 జ్యూట్‌ ఫోల్డర్లు ఆర్డర్‌ ఇచ్చారు. నిజానికి అప్పటికి నాకు వాటి తయారీ తెలియదు. గూగుల్‌ సాయంతో హైదరాబాద్‌లోని జాతీయ జ్యూట్‌ బోర్డు వివరాలు తెలుసుకుని వాళ్ల సాయం తీసుకున్నా. అప్పుచేసి ముడిసరకు కొన్నాను. మిషన్‌ కొనిస్తానంటూ ఆ సమయంలోనూ కొందరు మోసం చేశారు. చివరికి ఎలా అయితేనేం నేనే గూగుల్‌లో నేర్చుకుని అనుకున్న సమయానికి ఆ ఆర్డర్‌ని అందించా. వాళ్లూ బాగున్నాయని మంచి ధర ఇచ్చారు. అక్కడి నుంచి వెనుతిరిగి చూడలేదు. జ్యూట్‌ బ్యాగుల తయారీ ప్రారంభించి నాలుగేళ్లు అవుతోంది. లంచ్‌బ్యాగులు, పౌచెస్‌, స్లింగ్‌ బ్యాగ్స్‌, షాపింగ్‌ వెరైటీస్‌, స్కూల్‌బ్యాగ్స్‌, ఫోల్డర్లు తయారు చేస్తున్నాం. పుట్టినరోజులకీ, బారసాల, నిశ్చితార్థం, వివాహం, శ్రీమంతం, గృహప్రవేశం, కిట్టిపార్టీలు, ఉద్యోగ విరమణ తదితర వేడుకలకూ ఏపీ, తెలంగాణాల్లో ప్రభుత్వ కార్యక్రమాలకీ వివిధ డిజైన్లలో వీటిని చేసి ఇస్తున్నాం. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, అసోం, కశ్మీర్‌, కన్యాకుమారి, చత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, గోవా తదితర రాష్ట్రాలూ, యూకే, యూఎస్‌, కెనడా, సింగపూర్‌, మలేసియా, దుబాయ్‌, ఆస్ట్రేలియా తదితర దేశాలకూ మా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఏడాదికి రూ.40 లక్షల టర్నోవర్‌ చేస్తున్నా. ఇక మా పెద్ద అబ్బాయి సందేష్‌ యూకేలో ఎంబీఏ చదువుతున్నాడు. చిన్నబ్బాయి సందీప్‌ పాలిటెక్నిక్‌ చదువుకుంటూ నాకు సాయంగా ఉంటున్నాడు.’ అంటూ చెప్పుకొచ్చారు కృష్ణకుమారి. ఈ కృషికిగానూ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మినిస్ట్రీస్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌కు చెందిన సీజీఎస్‌టీ నుంచి ప్రశంసలు అందుకున్నారు.

-యద్దల  సాంబశివరావు, గుంటూరు


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని