పేదరికాన్ని ఓడించి... హాకీలో గెలిచింది...

పేదరికం అడ్డునిలిచింది.. ఆడపిల్లకి ఆటలెందుకనే విమర్శలను లెక్కచేయ్యలేదు.. చెట్టుకొమ్మలనే స్టిక్కులుగా మార్చుకొని 12 ఏళ్ల వయసులో హాకీ ప్రాక్టీస్‌ మొదలు పెట్టింది.. అంచెలంచెలుగా ఎదిగింది. పాఠశాల నుంచి జాతీయ స్థాయి వరకు అనేక టోర్నమెంట్లలో ప్రతిభ చూపింది. పేద బాలికలకు శిక్షణ ఇస్తూ వారిని అంతర్జాతీయ క్రీడాకారిణులుగా తయారు చేస్తోంది కరుణపుర్తి.

Updated : 25 Dec 2021 05:19 IST

పేదరికం అడ్డునిలిచింది.. ఆడపిల్లకి ఆటలెందుకనే విమర్శలను లెక్కచేయ్యలేదు.. చెట్టుకొమ్మలనే స్టిక్కులుగా మార్చుకొని 12 ఏళ్ల వయసులో హాకీ ప్రాక్టీస్‌ మొదలు పెట్టింది.. అంచెలంచెలుగా ఎదిగింది. పాఠశాల నుంచి జాతీయ స్థాయి వరకు అనేక టోర్నమెంట్లలో ప్రతిభ చూపింది. పేద బాలికలకు శిక్షణ ఇస్తూ వారిని అంతర్జాతీయ క్రీడాకారిణులుగా తయారు చేస్తోంది కరుణపుర్తి.

రుణ వాళ్లది ఝార్ఖండ్‌ రాష్ట్రం ఖుంటి జిల్లాలో బరియతు అనే కుగ్రామం. స్కూల్‌ బయట కొందరు పిల్లలు హాకీ ఆడుతుంటే 11 ఏళ్ల కరుణ కంట్లో అది పడింది. వారు ఏం చేస్తున్నారో కూడా తెలియదు కానీ.. అది చూస్తుంటే ఆమెలో తెలియని ఆనందం. తానూ అలాగే ఆడాలనే తపన అప్పుడే మొదలైంది. కానీ నేర్పించే కోచ్‌ లేదు. మెలకువలు తెలియదు. తెలిసిందల్లా ఒకటే... కర్రతో బంతిని నియంత్రించడం... గోల్‌ పోస్టు వైపు దాన్ని మళ్లించి పాయింట్లు సాధించడం. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభించలేదు. వాళ్ల అమ్మమ్మ హాకీ ఆడటాన్ని తీవ్రంగా వ్యతిరేకించేది. దీంతో దొంగచాటుగా.. ఇంట్లో వారికి తెలియకుండా హాకీ ఆడేది. కిట్టుకొనే ఆర్థికస్తోమత లేక చెట్టు కొమ్మలతో బ్యాట్లు తయారు చేసి మగపిల్లలతో పోటీపడుతూ ఆడేది. కరుణ ఆసక్తి గమనించిన ఆమె అక్క అండగా నిలబడింది. తన ప్రోత్సాహంతో మొదటిసారి హాకీ టోర్నమెంటుకు ఎంపికయింది. షూ వేసుకొనే అలవాటు లేకపోవడంతో ఒట్టికాళ్లతోనే ఆడేది. ఆటలో పొరపాటు చేస్తే కోచ్‌ చూపించే.. కార్డు గురించి కూడా తెలియదు. అలాంటి కరుణను కోచ్‌లు రాజ్‌పాల్‌ సిద్ధూ, నరేంద్రసింగ్‌ సైనీ అసలు సిసలైన హాకీ క్రీడాకారిణిగా తీర్చిదిద్దారు. అలా జిల్లా అండర్‌-14తో మొదలైన ఆమె 1988లో తొలిసారి జాతీయ హాకీ జట్టులో చోటు సంపాదించింది.

వీడని ఆర్థిక సమస్యలు..

క్రీడల్లో రాణిస్తున్నా ఆర్థిక సమస్యలు మాత్రం తనను వదల్లేదు. చివరికి కుటుంబ పోషణా కష్టమైంది. దీంతో ఉద్యోగ వేటలో పడింది. ఎన్నో ఒడుదొడుకుల తర్వాత దిల్లీ ఎయిర్‌ ఇండియాలో ఉద్యోగం వచ్చింది. హాకీ మీద ఉన్న ప్రేమ ఆమెను అక్కడ ఉద్యోగం చేయనివ్వలేదు. దీంతో ఝార్ఖండ్‌ వచ్చి రాష్ట్ర హాకీ శిక్షణ కేంద్రంలో అతి తక్కువ వేతనానికి కోచ్‌గా చేరింది. ఇంతలో తనకు అండగా నిలిచిన అక్క మరణం ఆమెను కుంగదీసింది. ఆ బాధ నుంచి తేరుకొని పంజాబ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్సులో శాశ్వత కోచ్‌గా చేరింది. నాటి నుంచి నేటిదాకా వందల మందికి ఆమె శిక్షణ ఇచ్చింది. వారిలో 35 మంది ఇప్పుడు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. కొందరు అంతర్జాతీయ వేదికలపై ఉత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారు. ఇదంతా కరుణ వల్లే సాధ్యపడిందని వారంతా గర్వంగా చెబుతారు. ‘దేశంలో క్రీడా నైపుణ్యం ఉన్న యువతకు కొదవలేదు.. లేనిదల్లా ప్రోత్సాహమే.. ప్రభుత్వం అండగా నిలిస్తే అంతర్జాతీయ వేదికలపై మనవాళ్లు అద్భుతాలు చేస్తారంటారు కరుణ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్