Updated : 09/03/2022 06:11 IST

చేతుల్లేకపోయినా పోల్‌డ్యాన్స్‌ చేస్తోంది!

అవయవాలన్నీ సవ్యంగా ఉన్నవాళ్లకే పోల్‌డ్యాన్స్‌లో బ్యాలెన్స్‌ తప్పుతుంది. పొడవైన పోల్‌పై పైకీ,కిందకీ కదుల్తూ చేసే ఈ డ్యాన్స్‌ను రెండు చేతులూ, ఒక కాలు లేని యువతి అద్భుతంగా చేసి అందరినీ నివ్వెరపరుస్తోంది. అంతర్జాతీయస్థాయిలో ఛాంపియన్‌షిప్‌నూ గెలుచుకుంది. చిన్నచిన్న లోపాలకే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేవారికి ఓ పాఠ్యపుస్తకంగా నిలిచిన 18 ఏళ్ల ఫ్రాన్సెస్కా సెజరినీ స్ఫూర్తి కథనమిది.

మార్కో సెజరినీ, వలేరియా మెన్‌కరోనీ దంపతులది ఇటలీ. వీరికి లేకలేక పుట్టింది ఫ్రాన్సెస్కా. ఈ అమ్మాయికి పుట్టుకతోనే రెండు చేతులూ, ఒక కాలు లేవు. ఆ పాపాయిని చూసి వారిద్దరికీ గుండె తరుక్కుపోయింది. పెద్దయిన తర్వాత తమ పాప జీవితాన్ని ఎలా మలచాలనే ఆలోచన ఆ తల్లిదండ్రులను తీవ్ర వేదనకు గురిచేసేది. అయితే ఎదుగుతున్నకొద్దీ  ఫ్రాన్సెస్కా ఆత్మవిశ్వాసాన్ని చూసి వారు ఆశ్చర్యపోయేవారు. ఆమె స్థైర్యాన్ని చూసి వైకల్యాన్ని మర్చిపోయేవారు. చిన్నవయసులోనే కృత్రిమకాలు, మోజేతుల సౌకర్యాన్నీ.. అందించారు. పాఠశాల స్థాయికి వచ్చేసరికి ఫ్రాన్సెస్కా తనకు అమర్చిన చేతులు అవసరం లేదంటూ వాటిని వినియోగించడం మానేసింది. అవి లేకుండానే తన పనులు తాను చేసుకోవడం నేర్చుకుంది. రాయడం నుంచి తినడం వరకు ప్రతి పనీ సొంతంగా పూర్తిచేయడం చూసి ఆ తల్లిదండ్రులకు ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది. అయితే ఆమె ధైర్యసాహసాలు అక్కడితో పరిమితం కాలేదు. అకస్మాత్తుగా ఓ రోజు ‘పోల్‌ డ్యాన్స్‌ నేర్చుకోవాలనుకుంటున్నా’ అని తల్లితో చెప్పింది. ఆమెకు ఒక్క నిమిషం ఏమీ అర్థంకాలేదు. అదెలా సాధ్యమవుతుందని చెప్పాలనుకున్నా.. కూతురు చిన్నబుచ్చుకుంటుందని ఊరుకుంది. అయితే ఫ్రాన్సెస్కా మాత్రం ఏదో మాటవరసకి చెప్పి ఉండదని తెలుసామెకు. ఎందుకంటే తను ఏది అనుకుంటే దాన్ని సాధించేవరకు తను నిద్రపోదు.

బంగారు పతకం...

‘ఓ ఉదయం నిద్ర లేచేసరికి యాక్రోబేటిక్‌ పోల్‌ డ్యాన్స్‌ నేర్చుకోవాలనిపించింది. ఆ ఆలోచనెందుకొచ్చిందో నాకే తెలీదు. సోషల్‌మీడియాలో చూశానో.. లేదా కల కన్నానో. అందులో శిక్షణ పొంది అందరిలో ప్రత్యేకంగా నిలవాలనిపించింది. అంతే, అదే విషయాన్ని అమ్మకు చెప్పా. మొదట తను ఆశ్చర్యపోయినా, తర్వాత ‘నేర్చుకుందువులే’ అంది. ఏ విషయంలోనైనా నేనెంత పట్టుదలతో ఉంటానో, చిన్నప్పట్నుంచీ అమ్మానాన్నలకు తెలుసు. అలా దగ్గరలోని జిమ్‌లో చేర్పించారు. అక్కడ శిక్షకురాలు నా ఆసక్తిని చూసి మంరింత ప్రోత్సహించింది. కొంచెం కూడా నిరుత్సాహపరచకుండా నేను జిమ్‌లో ఉన్న ప్రతి క్షణం దగ్గరుండి మరీ శిక్షణనిచ్చేది. కొంచెం కష్టమైన ఫీట్స్‌ కూడా చేస్తానని అడిగితే తను కూడా ఉత్సాహపరిచేది. ఇంట్లోనూ సాధన చేసేదాన్ని. ఎప్పుడూ అవయవలోపం ఉన్నట్లు అనిపించదు. అంతర్జాతీయస్థాయిలో ఈ క్రీడలో నన్ను నేను నిరూపించుకోవాలనేది నా లక్ష్యం’ అని చెబుతుంది ప్రాన్సెస్కా. శిక్షణ ప్రారంభించిన మూడేళ్లకు తనపైన పూర్తి విశ్వాసం వచ్చాక గతేడాది నవంబరులో ఇంటర్నేషనల్‌ పోల్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ నిర్వహించిన ‘వరల్డ్‌ పోల్‌ అండ్‌ ఏరియల్‌ ఛాంపియన్‌షిప్‌’ పోటీలకు దరఖాస్తు చేసుకుని అనుమతి పొందింది. కొవిడ్‌ కారణంగా ఈ పోటీల్ని వర్చువల్‌గానే నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా పోల్‌ డ్యాన్సర్స్‌ తాము చేసిన డ్యాన్స్‌ను రికార్డు చేసి వీడియోలు పంపించారు. అందులో ఫ్రాన్సెస్కా కూడా ఉంది. అవయవలోపం ఉండి కూడా ఈ పోటీలో డ్యాన్స్‌ చేసింది తను మాత్రమే. మొండి చేతులూ, కృత్రిమ కాలుతో ఆమె చూపిన ప్రతిభ న్యాయనిర్ణేతల్ని ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో పోటీల్లో విజేతగా ప్రకటించి బంగారు పతకాన్ని అందించారు. ‘అనుకున్నది సాధించినందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. అమ్మానాన్నల కళ్లల్లో ఆనందం మాటల్లో చెప్పలేను. స్నేహితులతో కలిసి రెస్టారెంట్‌లకు వెళ్లడం, పాప్‌ గీతాలు పాడుకుంటూ వాళ్లతో కలిసి నడవడమంటే నాకిష్టం. కష్టమనుకుంటే ఏదీ అందుకోలేం. పట్టుదలగా ప్రయత్నిస్తే ఏదైనా మన చేతికి చిక్కాల్సిందే’ అంటోంది ఫ్రాన్సెస్కా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని