సైనా, సింధులని చూద్దామని వెళ్లి... షూటర్‌గా మారా!

సైనా, సింధులాంటి వాళ్లు ఎలా ఆడతారో చూద్దామని వెళ్లిందా అమ్మాయి.  ఆ క్రమంలో గచ్చిబౌలి స్టేడియంలో ఓ అద్భుతం క(వి)నిపించిందా పిల్లకి... అదే తుపాకుల చప్పుడు. అంతే... ఆ క్రీడతో ప్రేమలో పడింది. అలా మొదలై... అంతర్జాతీయ స్థాయిలో పతకాల పంట పండిస్తున్న ఆ అమ్మాయే 17 ఏళ్ల ఇషాసింగ్‌... ఈ హైదరాబాదీ యువ సంచలనాన్ని వసుంధర పలకరించింది...

Published : 26 Mar 2022 04:36 IST

సైనా, సింధులాంటి వాళ్లు ఎలా ఆడతారో చూద్దామని వెళ్లిందా అమ్మాయి.  ఆ క్రమంలో గచ్చిబౌలి స్టేడియంలో ఓ అద్భుతం క(వి)నిపించిందా పిల్లకి... అదే తుపాకుల చప్పుడు. అంతే... ఆ క్రీడతో ప్రేమలో పడింది. అలా మొదలై... అంతర్జాతీయ స్థాయిలో పతకాల పంట పండిస్తున్న ఆ అమ్మాయే 17 ఏళ్ల ఇషాసింగ్‌... ఈ హైదరాబాదీ యువ సంచలనాన్ని వసుంధర పలకరించింది...

ఆ రికార్డు నాదే..

షూటింగ్‌ అంటే ఇష్టం మొదలయ్యాక మా నాన్న స్నేహితుడొకరు తుపాకీని నాకు పరిచయం చేశారు. అప్పటి నుంచి నేను దాన్ని వదల్లేదు. రాష్ట్రస్థాయిలో ఛాంపియన్‌గా నిలవడంతో ఇక దాన్నే కెరియర్‌గా మార్చుకున్నా. నిజానికి మొదట్లో సరదా కోసమే తుపాకీ చేతబట్టా. గురి చూసి లక్ష్యాలను కొట్టడం అంటే చిన్నతనంలో చాలా ఇష్టంగా ఉండేది. అదే ఆ తర్వాత లక్ష్యంగా మారింది. 13 ఏళ్ల వయసులోనే జాతీయ సీనియర్‌ షూటింగ్‌ ఛాంపియన్‌గా నిలవడం ఎప్పటికీ మర్చిపోను. అప్పటికే షూటింగ్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న మను బాకర్‌, హీనా సిద్ధూ లాంటి వాళ్లను దాటి 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో పసిడి గెలిచా. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయసు షూటర్‌గా నిలవడంతో నా ఆత్మవిశ్వాసం పెరిగింది. అక్కడి నుంచి అత్యుత్తమంగా ఆడటంపైనే గురి పెట్టా.

నాకోసం నాన్న...

నాన్న సచిన్‌సింగ్‌ బైక్‌రేసర్‌. నాక్కూడా చిన్నప్పటి నుంచీ టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌, స్కేటింగ్‌, కార్టింగ్‌లంటే ఇష్టం. అన్నీ ప్రయత్నించే దాన్ని. అది గమనించిన నాన్న బ్యాడ్మింటన్‌ స్టార్లు సింధు, సైనాల ఆటను చూపించడానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత గచ్చిబౌలి స్టేడియానికీ వెళ్లాం. అక్కడ నా దృష్టి షూటింగ్‌పై పడింది. ఇక మిగతావన్నీ పక్కకు వెళ్లిపోయాయి. రోజూ సాధన కోసం మారేడుపల్లి నుంచి గచ్చిబౌలి వెళ్లిరావడం కష్టమే. దీంతో నాన్న మా ఇంట్లోనే షూటింగ్‌ రేంజ్‌ ఏర్పాటు చేశారు. అందువల్ల లాక్‌డౌన్‌లోనూ ప్రాక్టీస్‌ చేసుకోగలిగా. నా కోసం ఆయన తన కెరియర్‌ని పక్కన పెట్టారు. నేనెక్కడికి వెళ్లినా ఆయన నా పక్కన ఉండాల్సిందే. అమ్మ శ్రీలత మా స్పోర్ట్స్‌ షాప్‌ చూసుకుంటోంది. వాళ్ల ప్రోత్సాహం లేకుంటే నేను ఇలా ఉండే దాన్ని కాదు.

వెన్నంటి తోడుగా నిలిచి, ఎల్లవేళలా ప్రోత్సహించే అమ్మానాన్న ఉంటే అమ్మాయిలు అద్భుత విజయాలు సాధించగలరు అనేదానికి నేనే నిదర్శనం.

2024 ఒలింపిక్స్‌ నా లక్ష్యం...

జూనియర్‌ ప్రపంచకప్‌లో ఇప్పటికే ఎన్నో పతకాలు సాధించా. గతేడాది ఆసియా జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణాలు, ప్రపంచ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలిచా. కానీ సీనియర్‌ ప్రపంచకప్‌లో పతకమే లక్ష్యంగా పెట్టుకున్నా. బరిలో దిగిన తొలి సీనియర్‌ ప్రపంచకప్‌లోనే రెండు స్వర్ణాలు, ఓ రజతం సాధించడం ఆనందంగా ఉంది. ఇటీవల కైరోలో ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ సీనియర్‌ షూటింగ్‌ ప్రపంచకప్‌లో 10మీ, 25మీ.ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ విభాగాల్లో బంగారు పతకాలు, 10మీ.వ్యక్తిగత విభాగంలో రజతం గెలిచా. ఆ ఘనత సాధించిన తొలి తెలంగాణ షూటర్‌గా నిలవడం ఆనందంగా ఉంది. దేశానికి మరిన్ని పతకాలు అందించడమే నా ధ్యేయం. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంపైనే నా దృష్టి. అందుకు నిలకడగా రాణించాల్సిన అవసరం ఉంది. దాని కోసమే కృషి చేస్తున్నా.

ఆ ఫొటో చూశాక...

శిక్షణ కోసం తొలిసారి పుణెలోని షూటర్‌ గగన్‌ నారంగ్‌ నడుపుతున్న గన్‌ ఫర్‌ గ్లోరీ అకాడమీకి వెళ్లా. అక్కడి గోడలపై 2012 ఒలింపిక్స్‌లో సాధించిన కాంస్య పతకంతో ఆయన ఫొటోలు ఉన్నాయి. ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తే నా ఫొటోలు కూడా అలా పెద్ద పెద్ద బ్యానర్లుగా ఏర్పాటు చేస్తారని అప్పుడే అనుకున్నా. ఆ రోజు నిజం కావాలంటే శక్తివంచన లేకుండా కష్టడాల్సిందేనని నాకు తెలుసు.

ఇప్పుడు మా ఇంట్లో రేసర్‌గా నాన్న  గెలిచిన వాటి కంటే నేను సాధించిన పతకాలే ఎక్కువ. అవి చూసి నాన్న గర్వపడుతుంటారు.

అల్లు అర్జున్‌ సినిమాలంటే ఇష్టం...

పదకొండో తరగతి చదువుతున్నా. షూటింగ్‌ కారణంగా విద్యార్థి జీవితాన్ని ఆస్వాదించడం లేదనే బాధ పెద్దగా లేదు. నా ధ్యాసంతా ఆట మీదే. ఉదయం ఆరింటికే లేచి వ్యాయామాలు చేసి సాధన మొదలెడతా. మధ్యాహ్నం కాస్త విరామం, మళ్లీ ప్రాక్టీస్‌. పరీక్షలు ఉన్నప్పుడు సాయంత్రాలు చదువుకుంటా. ఎప్పుడైనా తీరిక దొరికితే సినిమాలు చూస్తా, బొమ్మలు గీస్తా. తెలుగులో అల్లు అర్జున్‌ సినిమాలు ఇష్టం. ప్రపంచంలో నాకు నచ్చిన ప్రదేశం రియో. పిజ్జా తినడం ఇష్టం. కానీ ఆ తర్వాత కెలోరీలు కరిగించడానికి కష్టపడాల్సిందే. లాక్‌డౌన్‌ సమయంలో బిస్కెట్లు, కేకులు చేయడం నేర్చుకున్నా.

తోటి అమ్మాయిలకు నేను చెప్పేది ఇదే.... లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని అందుకునేందుకు శ్రమించాలి. అందు కోసం త్యాగాలకు సిద్ధపడాలి.

- శనిగారపు చందు, హైదరాబాదు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్