Updated : 28/03/2022 04:00 IST

పడవ నడుపుతూ.. పతకాలు సాధిస్తూ!

నాన్న మత్స్యకారుడు. తండ్రికి సాయంగా తెడ్డు పట్టి పడవ నడిపిన అమ్మాయి... నేడు అంతర్జాతీయస్థాయిలో వాటర్‌ స్పోర్ట్స్‌ కెనూయింగ్‌లో సత్తా చాటుతోంది. జాతీయ స్థాయిలో 19 పసిడి పతకాలు సాధించి భారత్‌లో ఈ క్రీడకు కొత్త కళను తీసుకువచ్చింది. తాజాగా థాయ్‌లాండ్‌లో జరిగిన ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకుంది. ఆమే మధ్యప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల యువ కెరటం కావేరీ ఢిమర్‌...

భోపాల్‌కు 40 కి.మీ. దూరంలోని సెహోర్‌ జిల్లా, మండీ గ్రామంలో కావేరి కుటుంబం నివసిస్తోంది. ఆమె తండ్రి రణ్‌ఛోండ్‌ ఢిమర్‌ చేపలు పట్టి కుటుంబాన్ని పోషించేవాడు. తొమ్మిది మంది సంతానం. ఏడుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. ఈమె అయిదో అమ్మాయి. వారి వలలో చేపలు పడితే కానీ ఆ కుటుంబం వేళ్లు నోట్లోకి వెళ్లేవి కాదు. 

జీవితాన్ని మార్చిన అకాడమీ...

తండ్రి చేపలు పడుతుంటే తనూ సాయంగా ఉండేది. ఈ సమయంలోనే నర్మదా నదిలో పడవ నడపడమూ నేర్చుకుంది. పడవ నడుపుతున్నప్పుడు స్థానిక అధికారులు ఆమెను చూశారు. అలా ఆమెను 2017లో భోపాల్‌లోని ఎంపీ వాటర్‌ స్పోర్ట్స్‌ అకాడమీలో చేర్చారు. ఇక అక్కడి నుంచి ఆమె వెనక్కి చూసుకోలేదు. ఈతతోపాటు కెనూయింగ్‌లోనూ అత్యుత్తమ స్థానానికి చేరుకుంది ఈ యువ కెరటం. అయితే దీని వెనక ఎంతో కసరత్తు ఉంది. నిజానికి కావేరీ కుటుంబానికి ఈ క్రీడ గురించి తెలియదు,  అయినప్పటికీ ఆమె పట్టుదల, ఖాట్వాండ్‌ జిల్లా క్రీడల అధికారి జోసెఫ్‌ బక్స్లా చొరవ, కోచ్‌ చేతన్‌ కౌహర్‌ శిక్షణ ఆమెను ఓ అత్యుత్తమ క్రీడాకారిణిగా ప్రపంచానికి పరిచయం చేశాయి. ఆ గురువుల శ్రమను వృథా కానీయలేదామె. నిరంతరం కష్టపడి అనుకున్నది సాధించింది. ‘అకాడమీలో చేరకముందు నాన్నకు రూ.45 వేలు అప్పుండేది. నేను, అక్కలంతా దాన్ని తీర్చేయాలనుకున్నాం. వారితో కలిసి చేపలు పట్టడానికి వెళ్లేదాన్ని. ఆ సమయంలో పడవ నడిపేదాన్ని. ఎట్టకేలకు ఆ అప్పు తీర్చేశాం. చిన్నప్పటి నుంచి నీళ్లన్నా, నీళ్లతో ఆడే ఆటలన్నా నాకెంతో ఇష్టం’ అంటోందీ యువ తరంగం.

ముఖ్యమంత్రి ప్రశంసలు...

అకాడమీలో చేరిన తర్వాత లక్ష్యం కోసం నిరంతరం కష్టపడుతూ వరుసగా మూడుసార్లు జాతీయ స్థాయిలో ఛాంపియన్‌గా నిలిచి ఏషియన్‌ గేమ్స్‌ ఆడటానికి అర్హత సాధించింది. 31వ జాతీయ సీనియర్‌ కెనూ స్ప్రింట్‌ కయాకింగ్‌ - కెనూయింగ్‌ ఛాంపియన్‌షిప్‌ - 2021లో కావేరీ మొత్తం 7 పతకాలు గెలుచుకుంది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఇలాస్‌పూర్‌లో అక్టోబరు 24 నుంచి 27 వరకు ఈ ఛాంపియన్‌షిప్‌ జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... వాటర్‌ స్పోర్ట్స్‌ అకాడమీలో ఆమె కెనూయింగ్‌ సామర్థ్యాలను చూసి ఎంపిక చేసుకోలేదు. ఈతలో తనకున్న నైపుణ్యాలను చూసి ఖాండ్వా జిల్లా క్రీడల అధికారి జోసెఫ్‌ బాక్స్లా ఆమెను ఎంపిక చేశారు.

ఆమె ప్రతిభను కొనియాడుతూ మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ రూ.11 లక్షల చెక్‌ను అందించారు. ‘ఆడుతూనే ఉండూ, అలాగే గెలుపు సాధిస్తూనే ఉండు. నీ వెంట మేం ఉంటాం.’ అంటూ ఆ యువ కెరటాన్ని ప్రశంసించారాయన. ‘సంకల్పం ఉన్న చోట మార్గం ఉంటుందని కావేరి నిరూపించింది. ఆమె అనేక సందర్భాల్లో రాష్ట్రం గర్వించేలా చేసింది. ఇలాంటి ప్రతిభావని మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది.’ అని పొగడ్తల్లో ముంచెత్తారు ఆ రాష్ట్ర క్రీడల మంత్రి యశోధరా రాజే సింధియా. ‘మంత్రి సింధియా మార్గదర్శకాలు, సాయం వల్లే నేనీస్థాయికి చేరుకున్నా. ఎంపీ వాటర్‌స్పోర్ట్స్‌ అకాడమీలో చేరకపోతే ఇవన్నీ సాధ్యమయ్యేవి కావు’ అని చెబుతోంది ఈ ప్రతిభాశాలి. జాతీయస్థాయి ఛాంపియన్‌షిప్‌లో చక్కటి ప్రదర్శన చూపిన కావేరి తాజాగా థాయ్‌లాండ్‌లో మార్చి 24 నుంచి 27 వరకు జరిగిన ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ సీ-4 ఉమెన్‌ కేటగిరిలో కాంస్యం సాధించింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని