ఆ విజయం.. రెండు తరాలు... దశాబ్దాల కల

ఒకటీ రెండూ కాదు... నేషనల్‌ ఛాంపియన్‌ కావాలని పదేళ్లుగా కలలు కంటోందామె. జూనియర్‌, యూత్‌, సీనియర్‌... వివిధ స్థాయుల్లో దండయాత్ర చేస్తూ వచ్చింది. ఎట్టకేలకు ఆ కల నిజం చేసుకుంది 24 ఏళ్ల ఆకుల శ్రీజ. షిల్లాంగ్‌లో జరిగిన

Published : 27 Apr 2022 04:29 IST

ఒకటీ రెండూ కాదు... నేషనల్‌ ఛాంపియన్‌ కావాలని పదేళ్లుగా కలలు కంటోందామె. జూనియర్‌, యూత్‌, సీనియర్‌... వివిధ స్థాయుల్లో దండయాత్ర చేస్తూ వచ్చింది. ఎట్టకేలకు ఆ కల నిజం చేసుకుంది 24 ఏళ్ల ఆకుల శ్రీజ. షిల్లాంగ్‌లో జరిగిన నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌ టేబుల్‌ టెన్నిస్‌ మహిళల సింగిల్స్‌ విజేతగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఘనత సాధించిన తొలి యువతిగా రికార్డుకెక్కింది. ఈ పతకం కోసం తన కుటుంబం నుంచి ప్రయత్నించిన మూడో వ్యక్తి శ్రీజ. ఆ కథ తన మాటల్లోనే...

మా ఇంట్లో టేబుల్‌ టెన్నిస్‌ మొదట ఆడింది.. నాన్న ప్రవీణ్‌ కుమార్‌. రాష్ట్రస్థాయి వరకూ వెళ్లినా ఆర్థిక కారణాలతో ఆటలో కొనసాగలేదు. జనరల్‌ ఇన్సూరెన్స్‌లో ఉద్యోగిగా స్థిరపడ్డారు. నేషనల్‌ ఛాంపియన్‌ అవ్వాలన్న తన కలని అక్క రవళి ద్వారా నిజం చేయాలని టీటీలో శిక్షణ ఇప్పించారు. తను నేషనల్స్‌ కూడా ఆడింది. చదువుమీద ఆసక్తితో ఇంజినీరింగ్‌లో చేరి ఆటను పక్కన పెట్టేసింది కానీ, అక్క ఏ పోటీకి వెళ్లినా పతకంతో తిరిగొచ్చేది. ఆమె స్ఫూర్తితో నేనూ తొమ్మిదేళ్లపుడు రాకెట్‌ పట్టుకున్నా. నా ఆసక్తిని గమనించి శిక్షణ ఇప్పించారు నాన్న. 12 ఏళ్లపుడు హైదరాబాద్‌లోని సోమనాథ్‌ ఘోష్‌ అకాడమీలో చేరా.

ఆట ప్రారంభించిన మూడేళ్లకే 2011 నుంచీ క్యాడెట్‌, సబ్‌ జూనియర్‌, జూనియర్‌, యూత్‌, సీనియర్‌ విభాగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వందల సంఖ్యలో పతకాలు సాధించా. డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగాల్లో నేషనల్‌ ఛాంపియన్‌షిప్స్‌ గెలిచా. నేషనల్‌ సింగిల్స్‌ మాత్రం ఊరిస్తూ వచ్చింది. సీనియర్స్‌ విభాగంలో  అంతర్జాతీయస్థాయిలో ఆడిన మనికా బత్రా, మౌమా దాస్‌ లాంటి దిగ్గజాలు ఉండటంతో ఈ పోటీల్లో మిగతావాళ్లు విజేతగా నిలవడం కష్టం. గతేడాది సెమీస్‌ వరకూ వెళ్లగలిగా. ఈసారి మరింత పట్టుదలతో బరిలో దిగా. కోచ్‌ సోమ్‌నాథ్‌ సర్‌తో కలిసి పన్నిన వ్యూహాలు ఫలించాయి. ఫైనల్లో నేను ఓడించిన మౌమా దాస్‌(అయిదుసార్లు నేషనల్‌ ఛాంపియన్‌) లాంగ్‌ పుష్‌లకు ముందే సిద్ధమయ్యా. దాంతో దాటిగా ఎదుర్కోగలిగా. టోర్నీకి ముందు మెన్స్‌ నేషనల్‌ ఛాంపియన్‌ శరత్‌ కమల్‌ బృందంతో కలిసి చెన్నైలో వారం రోజుల ప్రాక్టీసూ పనికొచ్చింది. మునపటికంటే శారీరకంగా, మానసికంగా ఎంతో మెరుగయ్యాను. ఫిట్‌నెస్‌ కోచ్‌ హిరాజ్‌ సాయంతో స్టామినా మెరుగుపర్చుకున్నా. ఒత్తిడిని ఎదుర్కోవడానికి ముందే సిద్ధమయ్యా. దాంతో ఈసారి సింగిల్స్‌, డబుల్స్‌ విభాగాల్లో ఛాంపియన్‌గా నిలవడంతో రెండు తరాల కల నెరవేంది.

ఆర్‌బీఐలో అసిస్టెంట్‌ మేనేజర్‌...

ఆటలో పడి చదువుని నిర్లక్ష్యం చేయలేదు. దూరవిద్యలో బీకామ్‌ చేశా. 2017లో ఆర్‌బీఐ ఉద్యోగినయ్యా. ఈ సంస్థ నుంచే టోర్నీలకు ఆర్థిక సాయం అందుతోంది. ప్రస్తుతం అసిస్టెంట్‌ మేనేజర్‌ హోదాలో ఉన్నా. టోర్నీల సమయంలో,  ముందు ప్రాక్టీసుకీ సెలవు తీసుకుంటా. పని విషయంలో సీనియర్లు సాయం చేస్తారు.  ఆఫీసు, టీటీ తప్ప సినిమాలూ షికార్లూ ఉండవు. ‘రోజూ టీటీ ఆడుతుంటే బోర్‌ కొట్టదా’ అని అడుగుతారు కొందరు. నాకు ఆటే ప్రపంచం, ఆడుతున్నకొద్దీ మజా పెరుగుతుంది. కొత్త ప్రదేశాలకు వెళ్లినపుడు మాత్రం అక్కడి పర్యాటక ప్రదేశాలు చూసొస్తా. ఖాళీ దొరికితే పుస్తకాలు చదువుతా. సుధామూర్తి రచనలు ఇష్టం. క్రీడాకారుల జీవిత చరిత్రల్నీ చదువుతూ స్ఫూర్తి పొందుతా. ప్రస్తుతం గోపీచంద్‌ ఆత్మకథ ‘షట్లర్స్‌ ఫ్లిక్‌’ చదువుతున్నా. ఆటలైనా, ఏ పోటీలైనా, జీవితమైనా అమ్మాయిలకి నా సలహా ఒకటే... గెలిస్తే అత్యుత్సాహం చూపొద్దు. ఓడితే కుంగిపోవద్దు.గెలుపోటముల్ని సమానంగా తీసుకుని లక్ష్యంపైనే దృష్టి పెట్టాలి.

తొమ్మిది గంటల ప్రాక్టీసు..

రోజూ ఉదయం ఏడింటికే అకాడమీకి చేరుకుంటా. గంటసేపు ఫిట్‌నెస్‌ ప్రాక్టీస్‌ అయ్యాక.. 9-12 మధ్య టీటీ సాధన. సాయంత్రం నాలుగింటి నుంచి అయిదింటి వరకూ ప్రత్యేకంగా సర్వీస్‌ ప్రాక్టీసు లేదా ఫిట్‌నెస్‌ ప్రాక్టీసు. తర్వాత ఎనిమిదింటివరకూ టీటీ ఆడతాను. కొవిడ్‌ కారణంగా 2020, ’21లలో ప్రయాణాలు తగ్గడంతో విశ్రాంతి దొరికింది. కానీ ప్రాక్టీసుని మాత్రం ఆపలేదు. ఆన్‌లైన్‌లోనే శిక్షణ తీసుకునేదాన్ని. అక్క, నాన్న సాయంతో ఇంట్లోనూ ప్రాక్టీసు కొనసాగించా. ఆ సమయంలో అమ్మ (సాయిసుధ- ఎల్‌ఐసీ ఉద్యోగి) చెప్పే భగవద్గీత పాఠాలు మానసికంగా నన్ను దృఢ పరిచాయి. అంతర్జాతీయంగా నా ర్యాంకు 107. దాన్ని యాభైలోపు తేవడంతోపాటు కామన్వెల్త్‌, ఆసియా క్రీడల్లో పతకాలు సాధించడమే నా ప్రస్తుత లక్ష్యం.

టాపర్లకీ షాక్‌...

శ్రీజ అభిమాన టీటీ ప్లేయర్‌ జపనీస్‌ క్రీడాకారిణి మిమా ఎల్టో. వివిధ అంతర్జాతీయ టోర్నీల్లో తనకంటే మెరుగైన ర్యాంకర్లు ఆడ్రినా డియాజ్‌(ర్యాంకు-9), హ్యోవూన్‌(ర్యాంకు-20), దినా మెహ్రెష్‌(38), బర్బోరా(ర్యాంకు-42), లిండా బెర్గ్‌స్ట్రామ్‌(ర్యాంకు 59)లను తన అటాకింగ్‌ ఆటతో ఓడించింది శ్రీజ.

చందు శనిగారపు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్