మాటలతో కోట్లు సంపాదిస్తోంది

ఆడపిల్లలు గలగల మాట్లాడుతుంటే అడ్డు చెప్పకండి. వీలైతే ఆ నైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవడం గురించి సలహా ఇవ్వండి. ఎందుకంటే ఆమె మాటలు కోట్లు కురిపించొచ్చు. నమ్మకం కుదరడంలేదా? అయితే మీరు కావ్య చావలి గురించి తెలుసుకోవాల్సిందే. 

Published : 30 Apr 2022 06:05 IST

కావ్య


ఆడపిల్లలు గలగల మాట్లాడుతుంటే అడ్డు చెప్పకండి. వీలైతే ఆ నైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవడం గురించి సలహా ఇవ్వండి. ఎందుకంటే ఆమె మాటలు కోట్లు కురిపించొచ్చు. నమ్మకం కుదరడంలేదా? అయితే మీరు కావ్య చావలి గురించి తెలుసుకోవాల్సిందే. ఈ తెలుగమ్మాయి తన మాటలతో అలరిస్తూ యాంకర్‌గా, ‘ఎంసీ’గా జాతీయ స్థాయిలో రాణిస్తోంది. సొంత సంస్థను స్థాపించి ఏడంకెల సంపాదనతో ఇన్‌స్టా తరానికి స్ఫూర్తిగా నిలుస్తోన్న కావ్య తన ప్రయాణాన్ని  వసుంధరతో పంచుకుంది....

బెంగళూరులో ఒక ఆంగ్ల టీవీ ఛానెల్లో న్యూస్‌ రీడర్‌గా పనిచేస్తున్నా.. ‘మా సదస్సుకి వ్యాఖ్యాతగా ఉంటారా’ అంటూ ఓ టెక్నాలజీ సంస్థ నుంచి ఫోన్‌! అంతకుముందు లైవ్‌ షోలకు వ్యాఖ్యాతగా చేయలేదు. మూడు రోజులకే నెల జీతమంత పారితోషికం అనేసరికి... ప్రయత్నిద్దామనుకున్నా. ఆ అవకాశం రావడానికి నా ఇంజినీరింగ్‌ నేపథ్యమూ ఓ కారణమని తర్వాత తెలిసింది. నా చదువు గురించి చెప్పలేదు కదూ!

నాన్న రాజేశ్వరరావు నావికాదళంలో అధికారిగా చేశారు. అమ్మ లత. నాకో కవల సోదరి.. రమ్య. మాది అనంతపురం. నాన్న ఉద్యోగరీత్యా ముంబయి, పుణె, కొచ్చి, విజయవాడ, కాకినాడ... ఇలా చాలా చోట్లకు మారాం. 7-9 తరగతులు విజయవాడలో.. పది, ఇంటర్‌ కాకినాడలో చదివా. చదువులో చురుగ్గా ఉంటూనే సాంస్కృతిక కార్యక్రమాలూ, క్రీడలూ, వక్తృత్వ పోటీలు, డిబేట్లలో పాల్గొనేదాన్ని. కూచిపూడి నాట్యంలో డిప్లొమా చేశా. మొదట జర్నలిజం వైపు వెళ్లాలనుకున్నా. అప్పట్లో ఆ రంగంపైన పెద్దగా అవగాహన లేదు. స్నేహితులంతా ఇంజినీరింగ్‌ అంటుంటే చెల్లీ నేనూ అదే ఎంచుకున్నాం. నాకు వరంగల్‌ ‘నిట్‌’లో సీటొచ్చింది. నిట్‌ (2001-2005)లో ఎక్కువగా సాంస్కృతిక కార్యక్రమాల దగ్గరే ఉండేదాన్ని. ఇంజినీరింగయ్యాక రమ్య, నేనూ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌లో (బెంగళూరు) చేరాం. అందులో కొన్నాళ్లు ‘బిహేవియరల్‌ కోచ్‌’గా కూడా పని చేశా. ఆ సమయంలోనే న్యూస్‌ రీడర్‌ కావాలన్న ప్రకటన చూసి ఇంటర్వ్యూకి వెళ్తే ఎంపికయ్యా. అక్కడ రెండేళ్లు పనిచేశా.

ఎంసీ (మాస్టర్‌ ఆఫ్‌ సెరిమనీ)గా వక్తల్ని, అతిథుల్ని పరిచయం చేయడం. వాళ్లని ఇంటర్వ్యూలు చేయడం... ఇలా సదస్సు మొదట్నుంచీ చివరివరకూ అన్నీ సజావుగా జరిగేలా చూడటం నా బాధ్యత. మొదటి సదస్సు తర్వాతా మరికొన్ని అవకాశాలొచ్చాయి. సంతృప్తినివ్వడంతో దీన్నే వృత్తిగా మలుచుకోవాలనుకున్నా. అందుకోసం 2009లో ముంబయిలో అడుగుపెట్టా. మొదట్నుంచీ జీతంలో 30 శాతం మదుపు, పొదుపు చేయడంతో ఏడాదికి సరిపడా డబ్బు పెట్టుకుని ప్రయత్నాలు మొదలుపెట్టా. అవకాశాలు వచ్చినట్టే వచ్చి చివర్లో రద్దయ్యేవి. బాధని పంచుకుందామని స్నేహితురాలికి ఫోన్‌ చేస్తే ‘ముంబయిలో నిలదొక్కుకోవాలంటే అర్హత ఉండాలి’ అంది. దాంతో నాలో కసి పెరిగింది. పెద్ద సదస్సులకు ఎంసీగానే కాదు, చిన్న కార్యక్రమాలకి యాంకర్‌గానూ వెళ్తూ ఏ అవకాశాన్నీ వదల్లేదు.

నెలలో 23 సదస్సులు...
హైదరాబాద్‌లో జరిగిన 2012 ఫెమినా మిస్‌ ఇండియా- సౌత్‌ పోటీలకు వ్యాఖ్యాతగా చేయడంతో దశ తిరిగింది. ఫెమినా పత్రికలో నా ఫొటో ప్రముఖంగా రావడంతో ఆ తర్వాత నెలలో 23 షోలు చేసేంత బిజీ అయిపోయా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బెస్ట్‌ యాంకర్‌ అవార్డుని 2013లో అందుకున్నా. సినిమా వేడుకలూ, వాణిజ్యం, సాంకేతిక సదస్సులూ, పురస్కార ప్రదానాలూ.. ఇలా ఈ పన్నెండేళ్లలోనే 1400కుపైగా కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా చేశా. విదేశాలకూ వెళ్తుంటా. అమితాబ్‌, సచిన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి, బిల్‌గేట్స్‌, సత్య నాదెళ్ల ... ఇలా ఎందరినో ఇంటర్వ్యూ చేశా. అమెజాన్‌, ఆడి, ఐబీఎమ్‌, హెచ్‌డీఎఫ్‌సీ వంటి... వందల అంతర్జాతీయ బ్రాండ్‌లకు పనిచేశా. ముంబయిలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రచార కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఇంగ్లిష్‌, హిందీతోపాటు తెలుగులోనూ మాట్లాడే అవకాశం రావడం మర్చిపోలేని అనుభవం. కొవిడ్‌ తర్వాత ఇంటినుంచి వర్చువల్‌ సదస్సులకూ పనిచేస్తున్నా. రెండేళ్ల క్రితం ‘స్టేజ్‌ టు సక్సెస్‌’ అకాడమీని స్థాపించి పబ్లిక్‌ స్పీకింగ్‌, యాంకరింగ్‌లలో ఆన్‌లైన్‌ శిక్షణ ఇస్తున్నా. ఇన్‌స్టాలోనూ అనుభవాలను పంచుకుంటా. నా అనుభవాలను పుస్తకంగా రాస్తున్నా. ఇది కేవలం అందంతో నెగ్గుకొచ్చే రంగం కాదు. తెలివీ, సామాజిక అవగాహన కూడా ముఖ్యం. వేడుక ఉద్దేశం, వక్తల వివరాలు తెలుసుకుని నా వ్యాఖ్యానం ఆ కార్యక్రమానికి అదనపు విలువను ఇచ్చేలా చూస్తా. కొన్ని వేడుకల్లోనైతే పాటలు పాడతా, డ్యాన్స్‌ చేస్తా. ఏంటీ ‘ఎంసీ’ లేదా యాంకర్‌ అవ్వాలనిపిస్తోందా... మీరో ఆల్‌రౌండర్‌ అయితే కచ్చితంగా అవ్వొచ్చు!

నేతన్నలకు ఆసరా...
అమ్మానాన్నా కాకినాడలోనే స్థిరపడ్డారు. బంధువులెవరైనా చీరలు కావాలంటే ఉప్పాడ నేత కార్మికుల దగ్గరకే తీసుకువెళ్తుంది అమ్మ. ఏడాదికో వంద చీరలైనా కొనిపిస్తుంది. రమ్యకూ, నాకూ వాటిపైన ఇష్టం పెరిగింది. తనుండేదీ ముంబయిలోనే. రిలయన్స్‌లో మేనేజర్‌. ముగ్గురం కలిసి ‘కళానికా’ సంస్థని ప్రారంభించి ఉప్పాడ చీరలని ఆన్‌లైన్‌లో మార్కెట్‌ చేస్తున్నాం. అలా 70 చేనేత కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నాం. మా వారు అర్జున్‌.. విజయవాడలో నా క్లాస్‌మేట్‌. ముంబయిలోనే కార్పొరేట్‌ రంగంలో పనిచేస్తారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్