చందమామ మట్టిలో మొలకెత్తించారు!...

చల్లని వెన్నెలనందించే తెల్లని చందమామ మనిషికెప్పుడూ ఒక అద్భుతమే. అవకాశం వస్తే అక్కడే తిష్టవేయాలన్నది ప్రయత్నం. మరి అలా చేయాలంటే... ఆహారం? ఎన్నాళ్లని భూమి మీద నుంచి తెచ్చుకుని తింటాం? దీనికి పరిష్కారం...

Updated : 24 May 2022 06:25 IST

చల్లని వెన్నెలనందించే తెల్లని చందమామ మనిషికెప్పుడూ ఒక అద్భుతమే. అవకాశం వస్తే అక్కడే తిష్టవేయాలన్నది ప్రయత్నం. మరి అలా చేయాలంటే... ఆహారం? ఎన్నాళ్లని భూమి మీద నుంచి తెచ్చుకుని తింటాం? దీనికి పరిష్కారం... అక్కడ పంటలు పండించడం. దానికి తొలి దశగా... చంద్రుడి మట్టిలోనూ మొక్కలను మొలకెత్తించి చరిత్ర సృష్టించారు అంతరిక్ష జీవశాస్త్రవేత్త డాక్టర్‌ అన్నా లిసా పాల్‌.

బాల్యం నుంచి మొక్కలన్నా, పర్యావరణమన్నా అన్నాలిసాకు అమితాసక్తి. దాంతో సౌత్‌ ఫ్లోరిడా యూనివర్శిటీలో వృక్ష శాస్త్రంలో డిగ్రీ, ఆ తర్వాత ప్లాంట్‌ ఫిజిక్స్‌లో ఎమ్మెస్‌, మాలిక్యులర్‌ జెనెటిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు. అక్కడే హార్టీకల్చరల్‌ సైన్సెస్‌లో అసిస్టెంట్‌గా కెరియర్‌ మొదలుపెట్టి, అసోసియేట్‌ సైంటిస్ట్‌గా, రీసెర్చి అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా, ఫ్యాకల్టీగా అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం రీసెర్చి ప్రొఫెసర్‌గా పలు ప్రతిష్ఠాత్మక పరిశోధనలు చేపడుతున్నారు. ఈమె ప్రతిభకుగాను నాసా ఎక్సెప్షనల్‌ సైంటిఫిక్‌ అఛీవ్‌మెంట్‌ మెడల్‌, ఏఎస్‌జీఎస్సార్‌ ఫౌండర్స్‌ అవార్డు వంటి పురస్కారాలెన్నో వరించాయి. ప్రస్తుతం ఫ్లోరిడా విశ్వవిద్యాలయం హార్టీకల్చరల్‌ సైన్సెస్‌ డిపార్ట్‌మెంట్‌లో రీసెర్చి ప్రొఫెసర్‌గానూ ఉంటూ.. చంద్రుడిపై నుంచి తెచ్చిన మట్టిలో మొక్కల పెంపకంపై పరిశోధన చేపట్టారీమె.

ఇది ప్రాథమిక విజయం..

1969-72 మధ్యకాలంలో చంద్రుడిపైకి వెళ్లివచ్చిన అపోలో మిషన్స్‌  అక్కడి నుంచి తెచ్చిన మట్టిలో ఆకుకూర విత్తనాలు నాటారు అన్నా. రెండు మూడు రోజుల్లోనే మొలకలు రావడం గుర్తించాం అంటారీమె. ‘ఈ ప్రయోగాన్ని ఛాలెంజ్‌గా భావించాం. సెల్‌కల్చర్‌ పరీక్షకు వినియోగించే 12 మిల్లీమీటర్ల ట్యూబ్‌లో గ్రాముల్లెక్కన మట్టి వేసి విత్తనాలు నాటాం. వీటికి పోషకాల నీటిని అందించాం. రెండు రోజుల్లోనే వాటి నుంచి మొలకలు రావడం గుర్తించాం. ఇది కొంతవరకు విజయవంతమైందని భావిస్తున్నాం. ఈ పరిశోధనతో చంద్రమండలంపై మొక్కలను పెంచొచ్చని తేలింది. మేం వేసిన విత్తనాలన్నింటి నుంచి మొలకలు రావడం మాకు ఒక అద్భుతంగా అనిపించింది. ఆరో రోజు వరకు మొలకల్లో బాగానే ఎదుగుదల ఉంది. తర్వాత ఒత్తిడికి లోనవుతున్నట్లుగా కనిపించాయి. పెరుగుదల్లో కాస్త వేగం తగ్గి కురచగా అయ్యాయి. 20 రోజుల తర్వాత అత్యంత జాగ్రత్తగా అక్కడి నుంచి తీసి విడిగా నాటి, ఆర్‌ఎన్‌ఏపై అధ్యయనం చేపడుతున్నాం. ఈ పరిశోధన ప్రాథమికంగా కీలక విజయమనుకుంటున్నాం’ అని చెబుతోన్న అన్నా పరమాణు జీవ, జన్యు శాస్త్రవేత్తగా మరెన్నో పరిశోధనలూ చేస్తున్నారు. ఆవిడ ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో ‘ఇంటర్‌ డిసిప్లినరీ సెంటర్‌ ఫర్‌ బయో టెక్నాలజీ రీసెర్చి’కు డైరెక్టర్‌ కూడా. నాసా నిధులు సమకూర్చగా చేపట్టిన ఈ ప్రయోగ ఫలితం తాజాగా కమ్యూనికేషన్స్‌ బయాలజీ జర్నల్‌లో ప్రచురణైంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్