ఆమె నగ... దేశదేశాలా ధగధగ

మీ కెరియర్‌ ఏదంటే ఏం చెబుతారు? ఇదేం ప్రశ్న! చదివిన చదువునో లేదూ.. చేస్తున్న ఉద్యోగాన్నో చెబుతాం, అవునా? సరోజ ఎర్రమిల్లి విషయంలో మాత్రం అలా చెప్పలేం. ఆవిడ చదువుకూ, చేసిన ఉద్యోగాలకూ సంబంధమే లేదు. ఆ పద్ధతే తాను వ్యాపారవేత్తగా ఎదగడంలో సాయపడిందనే సరోజ..  నగల వ్యాపారంలో ఓ కొత్త ఒరవడినే సృష్టించారు. 

Published : 04 Jul 2022 00:52 IST

మీ కెరియర్‌ ఏదంటే ఏం చెబుతారు? ఇదేం ప్రశ్న! చదివిన చదువునో లేదూ.. చేస్తున్న ఉద్యోగాన్నో చెబుతాం, అవునా? సరోజ ఎర్రమిల్లి విషయంలో మాత్రం అలా చెప్పలేం. ఆవిడ చదువుకూ, చేసిన ఉద్యోగాలకూ సంబంధమే లేదు. ఆ పద్ధతే తాను వ్యాపారవేత్తగా ఎదగడంలో సాయపడిందనే సరోజ..  నగల వ్యాపారంలో ఓ కొత్త ఒరవడినే సృష్టించారు.  ఈ రంగంలో ఆన్‌లైన్‌ సేవలకు తెరతీశారు. అంతర్జాతీయ గుర్తింపు సాధించారు. ఇదంతా ఆరేళ్లలోనే! ఎలా సాధ్యమైందో.. చదివేయండి.

‘ఓరోజు నగల దుకాణానికి వెళ్లినప్పుడు అనుకోకుండా ఓ 20 ఏళ్ల అమ్మాయి, వాళ్లమ్మ సంభాషణ విన్నా. ‘ఇంత భారీ నగలు చీరల మీదకేగా నప్పేది. రోజూ వేసుకునే వీలుంటుందా ఏమైనా’ అంటోందాఅమ్మాయి. అరె.. నిజమే కదా! మన నగలంటే భారీగా, మందంగా చేయించుకునేవే. ఆధునిక అమ్మాయిల రోజువారీ వస్త్రధారణకు ఇవెక్కడ నప్పుతాయి అనిపించింది. పాశ్చాత్య వస్త్రాలైతే ఆలోచించే అవకాశమే లేదు. ఈ దిశగా ఎందుకు ప్రయత్నించకూడదు అన్న నా ఆలోచనే ‘మెలోరా’’ అని వివరించారు సరోజ.

వీళ్లది బెంగళూరులో స్థిరపడ్డ కుటుంబం. సంబల్‌పుర్‌ విశ్వవిద్యాలయం నుంచి బీఎస్‌సీ (ఫిజిక్స్‌), జేవియర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి మార్కెటింగ్‌, ఫైనాన్స్‌ల్లో పీజీ డిప్లొమా చేశారు. అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా కెరియర్‌ మొదలుపెట్టి, తనిష్క్‌కి సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ హెడ్‌, టైటన్‌ ఇండస్ట్రీస్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ హెడ్‌, కయా స్కిన్‌ క్లినిక్స్‌లో ఆపరేషన్స్‌ విభాగాధిపతి, డెల్‌లో రిటైల్‌ డైరెక్టర్‌.. ఇలా భిన్న సంస్థల్లో, భిన్న విభాగాల్లో పనిచేశారు. తనిష్క్‌లో చేస్తున్నప్పుడు ఆ వ్యాపారాన్ని అమెరికాకు విస్తరించడంలోనూ కీలకపాత్ర పోషించారు. ఉద్యోగినులు రోజు వారీ ధరించడానికి ప్రత్యేక నగలు ఆమె హయాంలోనే సిద్ధమయ్యాయంటారు. ఆవిడకు మొదట్నుంచీ వ్యాపారంపై ఆసక్తి. వివిధ విభాగాల్లో రెండు దశాబ్దాలు అనుభవం సంపాదించాక 2016లో బెంగళూరు వేదికగా నగల వ్యాపారం వైపు అడుగులు వేశారు.

‘నగలంటే కొని లాకర్లలోకి చేర్చడం, వేడుకలప్పుడు తీసి ధరించి, తిరిగి లోపల పెట్టేలా ఉండకూడదు. రోజువారీ వేసుకునేలా డ్రెస్సింగ్‌ టేబుల్‌ మీదకి చేరాలన్నది నా ఉద్దేశం. అందుకోసం సృజనాత్మకత, కాంటెంపరరీ, ఫ్యాషన్‌ మూడు అంశాలకు చోటిచ్చా’ అని చెబుతారు సరోజ. ఆవిడ ఓ నియమాన్నీ పెట్టుకున్నారు. ప్రతి శుక్రవారం 75 రకాల కొత్త డిజైన్లను మార్కెట్‌లోకి ప్రవేశపెడతారు. తన నగలన్నీ తక్కువ బరువుతో ప్రపంచ వ్యాప్తంగా ఎప్పటికప్పుడు మారుతున్న ఫ్యాషన్‌ ధోరణులకు తగ్గట్టుగా ఉంటాయి. దీనికోసం ప్రత్యేక బృందాన్నీ ఏర్పాటు చేసుకున్నారావిడ. వాళ్లు దేశ విదేశాల్లో ఫ్యాషన్‌ వీక్‌లకు వెళ్లి అక్కడంతా పరిశీలిస్తుంటారు. దేన్నైనా ఆన్‌లైన్‌లో కొనడం ఇప్పుడు సహజమే కానీ.. బంగారం విషయంలో ఈ పద్ధతిని ప్రవేశ పెట్టిందీ సరోజే. నగరాలకే పరిమితమైన ఆన్‌లైన్‌ వ్యాపార సేవల్ని పల్లెలకీ విస్తరించారు. అలా ఈవిడ నగలు దేశంలో నలు మూలలకీ సరఫరా అయ్యాయి. ఇప్పటివరకూ 3000కుపైగా ఊళ్లు, పట్టణాలకు బంగారు నగలను పంపిణీ చేశారు. కొనుగోళ్లు పెరిగాకే దేశవ్యాప్తంగా అవుట్‌లెట్‌లకు ప్రాధాన్యమిచ్చారు.

ఈ సంస్థకు సీఈఓ, ప్రమోటర్‌ సరోజనే. బంగారం కొనేప్పుడు నాణ్యతను తెలిపే బీఐఎస్‌ మార్క్‌ను చెక్‌ చేసుకోవడాన్ని ప్రచారం చేశారు. ఆవిడ తయారు చేసే నగ 25 నాణ్యతా పరీక్షల తర్వాతే వినియోగదారుడికి చేరుతుంది. అంతేకాదు.. రెండు వారాల్లోగా వినియోగదారుడికి చేర్చడం, రిటర్న్‌ పాలసీనీ ప్రవేశపెట్టారు. రూ.33 కోట్లతో ప్రారంభమైన ఈ సంస్థ వ్యాపారం ఇప్పుడు రూ.361 కోట్లకు పైమాటే! ఆరేళ్లలో ఎన్నో ప్రముఖ సంస్థలు మెలొరాలో పెట్టుబడులు పెట్టాయి. తాజాగా 9 సంస్థలు రూ.400 కోట్లకుపైగా పెట్టుబడి పెట్టాయి. ఒక స్టార్టప్‌గా అత్యధిక క్రౌడ్‌ ఫండింగ్‌ సాధించిన సంస్థగానూ మెలోరా రికార్డుకెక్కింది. యూఎస్‌, యూకే, సింగపూర్‌, యూఏఈ సహా ఎన్నో దేశాలకు సేవలు విస్తరించింది.


‘వ్యాపారానికి తగిన వయసంటూ ఏమీ ఉండదు. ఎప్పుడైనా ప్రయత్నించొచ్చు. అయితే వివిధ విభాగాల గురించి తెలుసుకోవాలి. మొహమాటం, ఎవరైనా ఏమైనా అనుకుంటారని నెట్‌వర్కింగ్‌కు దూరంగా ఉంటాం. కానీ ప్రపంచాన్ని తెలుసుకోవాలన్నా, ముందుకు సాగాలన్నా అది ముఖ్యం. ధైర్యంగా మాట కలపండి. అమ్మాయి అంటే ఒదిగి ఉండాలన్న నియమాన్నీ పక్కన పెట్టండి. కలల్ని సాకారం చేసుకోవడానికి ఆడామగా అన్న తేడా  లేదు. పట్టుదలే ప్రధానం. అదుంటే ధైర్యంగా ఆలోచనల్ని ఆచరణలో పెట్టేయండి’

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని