ఆహార సేవకులు

ద వరల్డ్స్‌ 50 బెస్ట్‌.. ప్రపంచవ్యాప్త రుచికరమైన ఆహారపదార్థాలు, ఉత్తమ రెస్టరెంట్లు, చెఫ్‌లను పరిచయం చేసే సంస్థ. ఇంగ్లాండ్‌కు చెందిన ఈ సంస్థ రెండు దశాబ్దాలుగా ఉత్తమ చెఫ్‌లు, రెస్టరెంట్లను ఎంపిక చేసి అవార్డులనూ అందజేస్తుంది. ఈ ఏడాది ‘50 నెక్స్ట్‌: క్లాస్‌ ఆఫ్‌ 2022’ పేరుతో గ్యాస్ట్రానమీ (ఆహార అధ్యయన శాస్త్రం)లో వ్యవసాయం, టెక్నాలజీ, సామాజిక సేవ, సృజనాత్మకత..

Updated : 04 Jul 2022 07:39 IST

ద వరల్డ్స్‌ 50 బెస్ట్‌.. ప్రపంచవ్యాప్త రుచికరమైన ఆహారపదార్థాలు, ఉత్తమ రెస్టరెంట్లు, చెఫ్‌లను పరిచయం చేసే సంస్థ. ఇంగ్లాండ్‌కు చెందిన ఈ సంస్థ రెండు దశాబ్దాలుగా ఉత్తమ చెఫ్‌లు, రెస్టరెంట్లను ఎంపిక చేసి అవార్డులనూ అందజేస్తుంది. ఈ ఏడాది ‘50 నెక్స్ట్‌: క్లాస్‌ ఆఫ్‌ 2022’ పేరుతో గ్యాస్ట్రానమీ (ఆహార అధ్యయన శాస్త్రం)లో వ్యవసాయం, టెక్నాలజీ, సామాజిక సేవ, సృజనాత్మకత.. ఇలా ఆహారపరంగా పలు విభాగాల్లో సేవలందిస్తున్న వారిని ఎంపిక చేసింది. మనదేశం నుంచి అయిదుగురు ఎంపికకాగా నలుగురు అమ్మాయిలే! వారెవరో తెలుసుకుందామా!


 తొక్కలతో శుభ్రమైన నీరు: రిషా

ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నీటి కాలుష్యం కూడా ఒకటి. దీనికి సహజ మార్గంలో పరిష్కారం చూపాలనుకుంది డాక్టర్‌ రిషా జాస్మిన్‌ నాతన్‌. ఈమెది దిల్లీ. న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ ఒటాగోలో టాక్సికాలజీ నుంచి పీహెచ్‌డీ చేసింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నీటి నుంచి రసాయనాలు, మలినాలను తొలగించడం పెద్ద సమస్యగా ఉండటం గమనించింది. దీనికి తక్కువ ఖర్చుతో పరిష్కారం చూపడంపై పరిశోధన మొదలుపెట్టింది. దేశానికి తిరిగొచ్చాక ఉత్తర్‌ప్రదేశ్‌లోని గల్గోతియా యూనివర్సిటీలో ఫోరెన్సిక్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌గా చేరింది. ఆ సమయంలో వ్యవసాయ వ్యర్థాల సాయంతో మురికి నీటి నుంచి మెటల్స్‌ను తొలగించే పద్ధతిని గమనించింది. దాని స్ఫూర్తితో పండ్లు, కూరగాయల తొక్కలను ‘గ్రీన్‌ ఫిల్టర్‌’గా ఉపయోగించి స్వచ్ఛంగా మార్చింది. దీని ద్వారా ఎన్నో లక్షల మందికి స్వచ్ఛమైన తాగునీరు అందుతుండటమే కాకుండా.. రోజూ వృథాగా పారేసే ఈ తొక్కల ద్వారా ఏర్పడే కాలుష్యానికీ సమాధానం దొరికినట్లైంది. ఇదే ఈమెకు ఈ జాబితాలో చోటు దక్కించుకునేలా చేసింది. ‘నా పరిజ్ఞానంతో స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ప్రపంచం ఏర్పడేలా సాయపడాలన్నదే నా కోరిక’ అంటుంది 34 ఏళ్ల రిషా.


 ఆహార భద్రత: నిధి

వైపు వృథా అవుతున్న ఆహారం.. మరోవైపు తిండిలేక అల్లాడుతున్న ప్రజలు. వీరికి సాయమందించాలనుకుంది నిధి పంత్‌. పుట్టింది హిమాలయాల్లోని రైతు కుటుంబంలో. పెరిగింది ముంబయిలో. అమ్మానాన్న సైంటిస్టులు. చిన్నతనం నుంచీ సమాజసేవపై ఆసక్తి. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన వారికి తోచిన సాయం చేస్తుంది. ఓసారి ఈ క్రమంలో వరద బాధితుల పల్లెల్లో పర్యటిస్తున్నప్పుడు ఆకలి కోసం అలమటిస్తున్న వారినీ, పట్టణంలో వృథా అవుతున్న ఆహారాన్నీ చూసింది. రెంటికీ పరిష్కారంగా ఎస్‌4ఎస్‌ (సైన్స్‌ ఫర్‌ సొసైటీ) టెక్నాలజీస్‌ను ప్రారంభించింది. ఈమె కెమికల్‌ టెక్నాలజీ గ్రాడ్యుయేట్‌. తన పరిజ్ఞానంతో సోలార్‌తో నడిచే ఫుడ్‌ డీహైడ్రేటర్‌ను రూపొందించింది. ఇది పంట, ఆహారం పదార్థాల్లోని తేమను తొలగించి, రసాయనాల అవసరం లేకుండానే ఏడాదిపాటు నిల్వ ఉండేలా చేస్తుంది. వీటిని సొంత భూముల్లేని మహిళా రైతులకు అందిస్తోంది. వాళ్లకి మార్కెటింగ్‌, ఫైనాన్స్‌ పరంగా శిక్షణనీ ఇస్తోంది. దీనికిగానూ జాతీయస్థాయిలో పలు అవార్డులనూ అందుకుంది. ప్రస్తుతం ఈమె 1200 మందికి రైతులతో, 800 మంది స్వయం ఉపాధి మహిళలతో కలిసి పనిచేస్తోంది. తన సంస్థ ద్వారా వాళ్ల ఉత్పత్తులను నెస్లే, యూనీలివర్‌ వంటి సంస్థలకు సరఫరా చేస్తోంది. ‘ఆకలితో అలమటిస్తున్న వాళ్లు ఉన్నప్పుడు ఆహారం అందుబాటులో ఉండీ, వాళ్లకి అందించలేకపోగా వృథా అవుతోంటే మనసు తట్టుకోలేదు. దాన్ని అరికట్టడానికి నేను చేసిన ప్రయత్నం వేలమందికి ఉపాధిగా మారడం సంతోషం’ అంటుందీ 29 ఏళ్ల అమ్మాయి.


 చర్చావేదిక: అనూష, ఎలిజబెత్‌

‘చిన్నప్పుడు మేం వాటిని తినేవాళ్లం’ ఇంట్లో బామ్మలు, తాతల నుంచి ఈ మాట ఎన్నిసార్లు వినుంటాం. ఇప్పుడవి తినడం లేదేం? మన శరీరానికి తగిన పోషకాలు అందుతున్నాయా? ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు.. కనుమరుగవుతున్న కొన్ని పదార్థాలు, కొత్తగా వస్తున్న పాలసీలు.. ఆహారపరంగా వస్తున్న మార్పులన్నింటినీ ఒక వేదికగా అందిస్తున్నారు 30 ఏళ్ల అనూష మూర్తి, 29 ఏళ్ల ఎలిజబెత్‌ యోర్కే. వృత్తిపరంగా అనూష ఇంజినీర్‌, ఆరోగ్య ఆహారాన్ని సిద్ధం చేసిచ్చే రోబోని రూపొందిస్తోంది. ఎలిజబెత్‌ చెఫ్‌. బెంగళూరుకు చెందిన ఈ ఇద్దరూ ఆహారప్రియులు. 2018లో ఇటలీలో ఓ ఫుడ్‌ ఇన్నవేషన్‌ ప్రోగ్రామ్‌లో కలిశారు. బోలెడు విషయాలు వాళ్లిద్దరి మధ్యా చర్చకు వచ్చేవి. ప్రతిదీ ఆహారం చుట్టూనే తిరిగేది. దీంతో ఏదైనా చేయాలనుకుని ‘ఎడిబుల్‌ ఇష్యూస్‌’ను ప్రారంభించారు. ఇదో ఆన్‌లైన్‌ వేదిక. ప్రపంచవ్యాప్తంగా ఆహారానికి సంబంధించిన సమాచారమంతా ఇక్కడ క్రోడీకరించి పెడతారు. వారం, నెలకోసారి వీటిపై చర్చ కూడా నిర్వహిస్తుంటారు. విద్యార్థులు, రాజకీయ నాయకులు, రెస్టరెంట్‌ యజమానులు.. ప్రతి ఒక్కరూ దీనిలో పాల్గొంటారు. సమస్యలపై చర్చిస్తుంటారు. అనారోగ్యాన్ని కలిగించే వాటిపై అవగాహననీ కలిగిస్తుంటారు. ‘అందరినీ ఒక్కచోట చేర్చడం వెనక ఉద్దేశం మన, తర్వాతి తరాల భవిష్యత్‌ను గుర్తుచేయడం. మరచిపోతున్న ఆహార మూలాలు, భారతీయ ఆహార వ్యవస్థపై అవగాహన కల్పించడమే’ అని చెబుతున్నారీ స్నేహితులు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని