వనానికి కూలీ పేరు...

ఒడిశా బోనై అటవీ ప్రాంతంలో కొంత భాగానికి ‘సరోజిని వన’ అని పేరు పెట్టారు. అది చూసి చాలామంది స్వాతంత్య్ర సమరయోధురాలు సరోజినీ నాయుడు మీది ఆరాధన కాబోలనుకున్నారు... కానీ కాదు, దానికో కథుంది.. ఇది 42 ఏళ్ల సరోజినీ మొహంతా పేరు. ఎవరామె, ఏం చేసిందంటారా..

Updated : 09 Jul 2022 05:23 IST

ఒడిశా బోనై అటవీ ప్రాంతంలో కొంత భాగానికి ‘సరోజిని వన’ అని పేరు పెట్టారు. అది చూసి చాలామంది స్వాతంత్య్ర సమరయోధురాలు సరోజినీ నాయుడు మీది ఆరాధన కాబోలనుకున్నారు... కానీ కాదు, దానికో కథుంది.. ఇది 42 ఏళ్ల సరోజినీ మొహంతా పేరు. ఎవరామె, ఏం చేసిందంటారా..

బోనై గనులతో నిండిన ప్రాంతం. అక్కడ అడవిని వృద్ధి చేస్తే వాతావరణ కాలుష్యం తగ్గి, పర్యావరణం సురక్షితంగా ఉంటుందనుకుంది ప్రభుత్వం. దాంతో అటవీ శాఖ కొంత సొమ్మును విడుదల చేసి కొద్ది భూమిలో చెట్లు నాటే కార్యక్రమాన్ని ఆరంభించింది. రూ.315 రోజు కూలీతో దానికి కాపలాదారుగా చేరింది సరోజిని. కాపలా మాత్రమే తన పని అనుకోలేదు. నాలుగెకరాల ఆ రాతినేలను చిగుళ్లు తొడిగించింది. ఒక్క మొక్క లేని స్థలాన్ని రెండేళ్లలో సిసలైన అడవిగా మార్చింది. సరోజిని కొడుకు, కోడలు, భర్తతో కలిసి ఆ దగ్గర్లో ఉన్న ఉల్సురే గ్రామంలో ఉంటుంది. ‘ఇది రాతినేల. సాగుకు అనుకూలం కాదు. అయినా వానపాముల ఎరువును వాడి, మట్టిని వీలైనంత గుల్లచేస్తూ, వాటికి నీళ్లు పోస్తూ కన్నపిల్లల్లా పెంచాను. చుట్టుపక్క 6 ఊళ్ల పశువులు ఇటుగా వెళ్తాయి. అవి తిరిగి చావిళ్లకు వెళ్లే దాకా ఈ వనంలో ప్రవేశించకుండా కాపు కాస్తాను. ఒక్క మొక్కా లేని ఈ ప్రాంతం అడవిగా ఎదిగితే చాలా సంతోషంగా ఉంది’ అంటుందామె.

అటవీ శాఖ ప్రధాన సంరక్షణాధికారి శిశిర్‌ రాథోర్‌ బోనైని తనిఖీ చేసేందుకు వెళ్లినప్పుడు ఎడారి లాంటి భూమిని సరోజిని హరితవనంగా మార్చడం చూసి ఆశ్చర్యపోయారు. ఆ కృషిని ప్రశంసించడంతో ఆగలేకపోయారు. ఏకంగా ఆ వనానికి ఆమె పేరు పెట్టేశారు. ‘ఒక కూలీలో ఇంత నిబద్ధత, అంకిత భావం ఉండటం మామూలు విషయం కాదు. తన పనిలో ఏ ఇబ్బంది వచ్చినా మరెవరికోసమూ చూడక తనే చక్కబెట్టుకుంటుంది. వేళ గాని వేళలోనూ పని చేస్తూనే ఉంటుంది. ఏ మొక్కకీ నీటి కొరత రానివ్వదు. పురుగూ పుట్రా పశువుల్లాంటి అడ్డంకులన్నీ అధిగమిస్తుంది. ఇందులో 3000 రకాల పండ్లు, ఇతర జాతులూ ఉన్నాయి. ఈ వనానికి ఆమె పేరు పెట్టడం గొప్ప సంగతేం కాదు. కానీ, అడవుల్ని సంరక్షించే వారికి, తోటల కార్యక్రమాలు చేపట్టేవారికి చిన్న గుర్తింపు ఇవ్వడం. పర్యావరణాన్ని ప్రేమించాలనే సందేశం. ఇది మరెందరికో ప్రేరణ ఇస్తుందనేది నా నమ్మకం’ అని ఆ అధికారి ఆమెని అభినందనలతో ముంచెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని