Updated : 11/07/2022 09:29 IST

ప్రతి రూపాయీ దాస్తా.. ప్రపంచాన్ని చుట్టొస్తా!

ఆమెకు కొత్త ప్రదేశాలు చూడటమంటే ఇష్టం... కానీ పేదరికం కారణంగా చిన్నప్పుడు పిక్నిక్‌కి వెళ్లిందీ లేదు. అలాగని ఆమె తన కోరికను వాయిదా వేసుకుంది కానీ, మర్చిపోలేదు. ఎలాగైనా పర్యటనలు చేయాల్సిందేనని నడుం బిగించింది. రూపాయి రూపాయి కూడబెట్టి అయిదు పదుల వయసులో మొదటి పర్యటనకు వెళ్లింది. పదేళ్లలో 11 దేశాలు తిరిగొచ్చింది. ప్రపంచాన్ని చుట్టిరావడమే తన లక్ష్యమంటోన్న మొళిజాయ్‌ కథ ఎందరికో స్ఫూర్తి.

డబ్బున్నాకూడా కొందరు విదేశీ ప్రయాణమంటే వెనుకడుగు వేస్తారు. ఎటువంటి అవకాశాలు లేకపోయినా, ఆంగ్లం తెలియకపోయినా మొళిజాయ్‌కు విదేశాలు చూడాలని కోరిక.  పాఠశాల స్థాయిలో తోటి విద్యార్థులతో కలిసి కనీసం పిక్నిక్‌కు కూడా వెళ్లే అవకాశం దక్కలేదు మొళికి. చదివించడానికే కష్టపడే తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండేది కాదీమెకు. కేరళలోని ఎర్నాకుళం జిల్లా చిత్రపుళం ప్రాంతానికి చెందిన మొళికి చిన్నప్పటి నుంచే ఎప్పటికైనా ప్రపంచమంతా చుట్టి రావాలనిపించేది. జాయ్‌తో పెళ్లైన తర్వాత, కిరాణా దుకాణాన్ని నడపడంలో భర్తకు సాయం చేసేది. ఆదాయం కుటుంబ అవసరాలకు సరిపోకపోవడంతో జాయ్‌ కూలీగా మారాడు. దాంతో దుకాణాన్ని తానే తీసుకుంది. పెళ్లైన పదేళ్లకే అనారోగ్యంతో భర్త చనిపోతే కుటుంబ బాధ్యతలనూ భుజాన వేసుకుంది. పిల్లలిద్దరినీ చదివించింది. కొడుకు ఉద్యోగరీత్యా విదేశానికి వెళ్లితే, కూతురికి పెళ్లి చేసి బాధ్యత తీర్చుకుంది.

తొలిసారిగా..

పిల్లలు స్థిరపడేసరికి మొళికి 50 ఏళ్లొచ్చాయి. అప్పటివరకు సొంత గ్రామాన్ని దాటి వెళ్లని ఈమె, తెలిసినవారితో కలిసి కేరళ టూర్‌కెెళ్లింది. ‘కేరళతో మొదలైన నా పర్యాటక ఆసక్తి ఇప్పటికీ కొనసాగుతోంది. ఇందుకోసం కిరాణా దుకాణాన్ని నడపగా వచ్చే ఆదాయాన్ని పొదుపు చేయడం ప్రారంభించా. 51వ ఏట స్నేహితులతో కలిసి పళని, మదురై, ఊటీ, కొడైక్కెనాల్‌, మైసూరు, కోవళం వెళ్లొచ్చా. తర్వాత ఏడాది నా స్నేహితురాలు మేరీ విదేశీ పర్యటనకు వెళుతున్నానని, ఆసక్తి ఉంటే రమ్మని చెప్పింది. వెంటనే ఓకే చెప్పేశా. అలా 10 రోజుల ఐరోపా పర్యటనకు వెళ్లా. జీవితంలో మొదటిసారిగా విమానమెక్కడం మరవలేని అనుభవం. ఈ పర్యటనలో ఎదురైన అనుభవాలు, వ్యక్తుల కారణంగా ప్రపంచమెంత పెద్దదో అర్థమైంది. అలాగే దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌ మొత్తం చూశా. ఇక ఏటా ఏదో ఒక దేశం వెళ్లాలనే నియమంతో దానికి తగినట్లుగా పొదుపు చేస్తుంటా. ట్రావెల్‌ ఏజెన్సీల ద్వారా ప్రయాణించడం సౌకర్యంగా ఉంటుంది. కొన్నిసార్లు ఆదాయం సరిపోదు. దాంతో నా నగలను బ్యాంకులో ఉంచి అప్పు తీసుకుంటా. ఏడాది పూర్తయ్యేసరికి ఎలాగో ఆ రుణాన్ని తీర్చేస్తుంటా. అలా ఫ్రాన్స్‌, ఇటలీ, స్విట్లర్లాండ్‌ తదితర 11 దేశాలు చూశా. గతేడాది అమెరికా వెళ్లొచ్చా. నయాగరా జలపాతాన్ని చూసిన అనుభవం మర్చిపోలేను. ఏయే దేశాలు పర్యటించొచ్చు అనేది తెలుసుకోవడానికి ట్రావెల్‌ మ్యాగజైన్స్‌ చదువుతుంటా. విదేశాల్లో అందరూ షాపింగ్‌ చేస్తుంటారు. నేను మాత్రం చాక్లెట్లు మాత్రమే కొంటా. పొదుపుగా ప్రయాణిస్తేనే కదా, మరో దేశాన్ని చూసే అవకాశం దొరికేది’ అంటుంది మొళి.    పండగలు, ప్రత్యేక దినాలంటూ సెలవు తీసుకోకుండా రోజూ దుకాణం తెరుస్తూనే ఉంటుంది. పర్యటనలపై తన ఆసక్తిని పిల్లలూ ప్రోత్సహిస్తున్నారఅనే 61 ఏళ్ల మొళికి మరిన్ని దేశాలు తిరగాలనే ఆసక్తి రోజురోజుకీ పెరుగుతుండటం ఆశ్చర్యం.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని