ఎగతాళి దాటి.. రూ.అయిదు వందల కోట్లకు చేర్చి..

అమ్మానాన్నా ఉద్యోగులు. ఆమె కూడా వాళ్లలా మంచి ఉద్యోగంలో స్థిరపడాలనుకుంది. కష్టపడి చదివి, సాధించింది కూడా! ఇంకా ఏదో సాధించాలి అన్న తపన వ్యాపారం వైపు నడిపింది. అనుభవం లేదు, నడిపించేవారు లేరు.. అయినా ఒక్కో అనుభవాన్నీ పాఠం చేసుకుంటూ ముందుకు నడిచింది డాలీ కుమార్‌. ఇప్పుడామె వ్యాపారం రూ.500 కోట్లు పైమాటే! ఈ స్థాయికి ఆమె ఎలా చేరిందో చదివేయండి.

Updated : 12 Jul 2022 08:29 IST

అమ్మానాన్నా ఉద్యోగులు. ఆమె కూడా వాళ్లలా మంచి ఉద్యోగంలో స్థిరపడాలనుకుంది. కష్టపడి చదివి, సాధించింది కూడా! ఇంకా ఏదో సాధించాలి అన్న తపన వ్యాపారం వైపు నడిపింది. అనుభవం లేదు, నడిపించేవారు లేరు.. అయినా ఒక్కో అనుభవాన్నీ పాఠం చేసుకుంటూ ముందుకు నడిచింది డాలీ కుమార్‌. ఇప్పుడామె వ్యాపారం రూ.500 కోట్లు పైమాటే! ఈ స్థాయికి ఆమె ఎలా చేరిందో చదివేయండి.

‘ప్రతిదాన్నీ తెలుసుకోవాలన్న తపనే.. బోలెడు విషయాలను నేర్పిస్తుంది’ అంటుంది డాలీ. పుట్టింది దిల్లీ. అమ్మ ఉపాధ్యాయురాలు. నాన్న కోల్‌ ఇండియాలో ఇంజినీర్‌. ఆయన ఉద్యోగరీత్యా దేశంలోని పలు ప్రాంతాల్లో నివసించింది. చాలా మధ్యతరగతి కుటుంబాల్లాగే భవిష్యత్‌ బాగుండాలంటే ఇంజినీరింగ్‌, లేదా మెడిసిన్‌ తీసుకోవాలన్న ఆలోచన వాళ్లింట్లోనూ ఉండేదట. దానికి తగ్గట్టుగానే తను ఇంజినీరింగ్‌ వైపు వెళ్లింది. అయితే భిన్నమైన బ్రాంచిని ఎంచుకుంది. నాగ్‌పుర్‌ విశ్వవిద్యాలయం నుంచి కాస్మొటిక్‌ ఇంజినీరింగ్‌ చేసింది. చదువు పూర్తవుతుండగానే సౌందర్య ఉత్పత్తుల సంస్థలో ఉద్యోగం వచ్చింది. క్వాలిటీ అస్యూరెన్స్‌, ప్రొడక్షన్‌ విభాగాల నుంచి సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ వరకూ వివిధ విభాగాల్లో పనిచేసింది. దీంతో ఉత్పత్తుల నాణ్యత, మార్కెటింగ్‌ మెలకువలు వంటి ఎన్నో అంశాలపై మంచి అవగాహన వచ్చింది. వివిధ సంస్థల్లో చేసిన అనుభవం వీటిపై పట్టునిచ్చింది.

‘దేని గురించైనా పూర్తిగా తెలిసింది అనిపించాక ‘సొంతంగా ప్రయత్నిస్తే?’ అన్న ఆలోచన మొదలవుతుంది. పైగా నేను బ్రాండ్‌లను నిర్మించడం, వాటిని మార్కెట్‌లోకి విడుదల చేయడం.. వీటిపైనే ఎక్కువగా పని చేశా. దీంతో సొంత సంస్థ ఏర్పాటు చేయాలన్న కోరిక మొగ్గతొడిగింది. అది నన్ను నిలవనీయలేదు’ అంటుంది డాలీ. అలా 2007లో ‘కాస్మిక్‌ న్యూట్రాకోస్‌’ ప్రారంభించింది. ఇదో థర్డ్‌ పార్టీ లేబుల్‌ మాన్యుఫాక్చరింగ్‌ సంస్థ. అంటే తన ఉత్పత్తులను ఒప్పందం చేసుకున్న వేరే సంస్థల పేరు కింద అమ్మడమన్న మాట. డాబర్‌, లాక్మే, మమా ఎర్త్‌, పర్పుల్‌, షుగర్‌ వంటి ఎన్నో ప్రఖ్యాత సంస్థలతో పనిచేసింది.

మార్పుతోనే వృద్ధి

కాలానికి, ప్రజల అవసరాలకూ తగినట్టుగా వ్యాపారమూ మారాలన్నది ఈమె ఆలోచన. ‘అది 2009.. చాలా మంది ఆరోగ్యాన్నిచ్చే ఆహారం ముఖ్యంగా సేంద్రియ పదార్థాలపై దృష్టిపెడుతుండటం గమనించా. ఈ క్రమంలోనే ఓసారి ఒక పెద్దావిడ కలిసింది. డబ్బు పెట్టినా ఆరోగ్యకర జీవనశైలి కొనసాగించ లేకపోతున్నా అని వాపోయింది. అప్పుడే దానికోసం ఏదైనా చేస్తే బాగుంటుందనుకున్నా. ఫలితమే ‘గయా’. దీన్ని హిమాచల్‌ ప్రదేశ్‌లోని బడ్డీలో ప్రారంభించా. సేంద్రియ పదార్థాలతో చేసిన హెల్త్‌ మిక్స్‌లు, టీ, ఆహార పదార్థాలు, స్నాక్స్‌ ఇలా 80 రకాలు మార్కెట్‌లోకి తెచ్చా. సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. కానీ నేను చదివిన కాస్మొటాలజీపై ఏమీ చేయలేకపోతున్నానన్న బాధ వెంటాడేది. ఓసారి ‘అమ్మల క్రీమ్‌నే మేమూ వాడాలా’ అని ఓ టీనేజీ అమ్మాయి అనడం విన్నా. నిజమే.. టీనేజర్లకు ప్రత్యేక క్రీములు ఏమీ లేవు. ఏ వయసు వారికైనా ఒకేరకమైన సౌందర్య ఉత్పత్తులు. వారి కోసమే మూడేళ్లు పరిశోధన చేసి, 2017లో ‘స్కినెల్లా’ ప్రారంభించా. ఇవన్నీ పెటా సర్టిఫికేషన్‌ పొందినవీ, వీగన్‌వీ’ అని గుర్తు చేసుకుంది డాలీ.

ఇప్పుడు ఆమె సంస్థలో 1500 మందికిపైగా పని చేస్తున్నారు. ఉత్పత్తులు సింగపూర్‌, యూఏఈ, ఇలా మరెన్నో దేశాలకూ ఎగుమతవుతున్నాయి. 40 వేల రిటైల్‌ అవుట్‌ లెట్లతోపాటు ఈకామర్స్‌ సంస్థల్లో దొరుకుతున్నాయి. వ్యాపారం రూ. 500 కోట్లకు పైమాటే!


‘15 ఏళ్లలో రూ.500 కోట్ల వ్యాపారం వినడానికి ఎంత బాగుంటుంది! ఇక్కడి వరకూ చేరడానికి ఎన్నో సవాళ్లను దాటిన తర్వాతే సాధ్యమైందిది. కొత్త సంస్థ, ఏమాత్రం అనుభవం లేదు. నిపుణులను ఎక్కడి నుంచి ఎలా ఎంచుకోవాలో తెలియదు. దీనికితోడు అమ్మాయి ఏం చేయగలుగుతుందన్న అపనమ్మకం. నా విషయానికొస్తే.. ఉన్నదల్లా చేయగలనన్న నమ్మకం, కష్టపడే తత్వం. ఉత్పత్తులకు ఆదరణ ఎలా ఉందో తెలుసుకోవడానికి దుకాణాలకు వెళితే ‘గయా.. (వెళ్లిపోవడం) పేరుకు తగ్గట్టే ఇలాంటి ఉత్పత్తులు రోజుకోటి వస్తాయి, మరుసటి రోజు కనుమరుగవుతాయి’ అంటూ ఎగతాళి చేసేవారు. ఓపికతో మా ఉత్పత్తుల గురించి వివరించేదాన్ని. నెమ్మదిగా ఆదరణ పెరిగింది. తర్వాత రిటైలర్ల ధోరణీ మారింది. ఎన్ని సవాళ్లు ఎదురైనా ఓపికతో నెట్టుకుంటూ వచ్చా. నా కుటుంబమూ నాకు తోడుగా నిలిచింది. అందుకే అవేమీ నన్ను ఆపలేకపోయాయి. అలాగని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేదు. రెంటికీ సమాన ప్రాధాన్యమిచ్చా. మన ధైర్యానికి కుటుంబ ప్రోత్సాహం తోడైతే అద్భుతాలు సృష్టించొచ్చు. 50 ఏళ్ల వయసులోనూ యువతరంతో పోటీ పడుతున్నానంటే అదే కారణం. వ్యాపారంలో ఏటా 30 శాతం వృద్ధి ఉంటోంది. దాన్ని మరింత పెంచడం నా లక్ష్యం’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని