ఆమె జీవితం.. సాధించడానికే!

ఒకే ఒక జీవితం.. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి!’ ఈ సూత్రాన్నే నమ్ముతుంది రీనా షా. అందుకే నలభైల్లో అడుగుపెడుతున్నా తనకు నచ్చిన, ఎంతో కష్టమైన పోలో ఆట నేర్చుకుంది. చేయలేవు, సమయం వృథా.. వంటి మాటలు, అవమానాలు దాటి డిజైనింగ్‌లో లాగే దీనిలోనూ తనకు తిరుగు లేదని నిరూపించుకుంది.

Updated : 19 Jul 2022 03:14 IST

ఒకే ఒక జీవితం.. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి!’ ఈ సూత్రాన్నే నమ్ముతుంది రీనా షా. అందుకే నలభైల్లో అడుగుపెడుతున్నా తనకు నచ్చిన, ఎంతో కష్టమైన పోలో ఆట నేర్చుకుంది. చేయలేవు, సమయం వృథా.. వంటి మాటలు, అవమానాలు దాటి డిజైనింగ్‌లో లాగే దీనిలోనూ తనకు తిరుగులేదని నిరూపించుకుంది. తొలి భారతీయ ప్రొఫెషనల్‌ పోలో క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇదంతా ఎందుకో చదవండి...

2009.. సరదాగా స్నేహితురాలితో పోలో ఆట చూడటానికి వెళ్లా. ఇదీ హాకీ లాగే. కాకపోతే నేల మీద కాక గుర్రాల మీద స్వారీ చేస్తూ ఆడతారు. గుర్రాలను అలా ఠీవిగా నడపడం నన్ను బాగా ఆకర్షించింది. నేర్చేసుకోవాలని నిర్ణయించుకున్నా. వెంటనే చేరిపోయా. ఏడాది పట్టింది గుర్రపు స్వారీ నేర్చుకోవడానికి. ఆట కోసం ముంబయిలోని మహాలక్ష్మి రేస్‌కోర్సులో చేరా. అమెరికా, అర్జెంటీనాల్లోనూ శిక్షణ తీసుకున్నా. 2015 నుంచి పోటీల్లో పాల్గొంటున్నా. తొలి పోటీ జోధ్‌పుర్‌లో. నెల రోజులు పోలో ఫామ్‌లోనే ఉన్నా... పగలు, రాత్రీ సాధనే. శ్రమ ఫలించి గెలిచా. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.

ఇక్కడివరకూ చేరుకోవడానికి ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా. ఇంట్లో నా నిర్ణయం చెప్పగానే వద్దన్నారు. మాది సంప్రదాయ గుజరాతీ కుటుంబం. చిన్నప్పటి నుంచీ ఏ ఆటలూ ఆడింది లేదు. 21 ఏళ్లకే పెళ్లి. కానీ ఆ తర్వాతే నా జీవితంపై నాకు పట్టు చిక్కింది. స్క్వాష్‌, ఈత వంటివెన్నో ప్రయత్నించా. నేను పాదరక్షల డిజైనర్‌ని. ఫైనాన్స్‌లో డిగ్రీ, హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ పూర్తిచేశా. న్యూయార్క్‌లోని ఫ్యాషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి డిజైనింగ్‌ కోర్సు చేశా. మనదేశంలోనే తొలి ఫుట్‌వేర్‌ డిజైనర్‌ని నేనే. నా బ్రాండ్‌ ‘రినాల్డి’కి ఎందరో వ్యాపార దిగ్గజాలు, బాలీవుడ్‌ తారలు ఖాతాదారులు. 5000 మంది పెళ్లికూతుళ్లకు ప్రత్యేకంగా డిజైన్‌ చేసి దేశవిదేశాల్లో గుర్తింపు సాధించా. అలాంటి స్థితిలో 39 ఏళ్ల వయసులో గుర్రాలాటంటూ తిరుగుతుంటే ఎవరైనా పిచ్చి అనే అనుకుంటారు. కొందరు మొహాన్నే అన్నారు కూడా. మరి నా ఉద్దేశం? ఓపిక, క్రమశిక్షణ, అంతకుమించి కొత్త నైపుణ్యాన్ని నేర్చుకునే అవకాశం. అందుకే ముందుకే సాగా.
దీనిలోనూ పురుషాధిక్యతే! మగవాళ్లు నాతో కలసి సాధనకి అంగీకరించేవారు కాదు. పైగా హేళన. విదేశాల్లో సాధనప్పుడూ తోటి మహిళలూ ఇలానే చేసేవారు. వారికి నా ఆటతోనే సమాధానమిచ్చేదాన్ని. ఇప్పుడు వాళ్లలో చాలామంది నా స్నేహితులే. ఈ ఏడేళ్లలో ఎన్నో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నా. 2015లో ‘రినాల్డి పోలో’ ప్రారంభించి కొన్ని పోటీల్ని నేనే నిర్వహించా కూడా. కొన్ని సార్లు గుర్రం మీద నుంచి కింద పడుతుంటాం. ఒకసారైతే చేతి వేలు విరిగింది. అయినా గెలవాలన్న కసితో నొప్పిని భరిస్తూ మళ్లీ గుర్రమెక్కి కొనసాగిస్తుంటా. ఒక టోర్నీలో అయితే 49 మంది మగవాళ్లలో నేనొక్కదాన్నే మహిళని. ఇన్నేళ్లలో ఇలాంటివెన్నో అనుభవాలు.

నాకు సంగీతమన్నా ప్రాణం. 2018లో డ్రమ్స్‌, 2019లో ఆమ్‌స్టర్‌డామ్‌లో డీజే నేర్చుకున్నా. ప్రోగ్రామ్‌లూ నిర్వహించా. దేశంలో పదిమంది ఉత్తమ డీజేల్లో ఒకరిగా నిలిచా. మున్ముందు ఇంకా సాధిస్తా కూడా. ఇవన్నీ అవసరమా అన్న నా కుటుంబం ఇప్పుడు నన్ను చూసి గర్వపడుతోంది. ఎంతోమంది నన్ను స్ఫూర్తిగా తీసుకుంటున్నారు.


నేను నాకు నచ్చింది చేసుకుంటూ వెళతా. ఎవరో ఏదో అనుకుంటారన్నది పట్టించుకోను. నేను వంద శాతం ఇచ్చానా లేదా అన్నదానిపైనే దృష్టి. గెలిచానా సరే. ఓడానా.. కనీసం ప్రయత్నించానన్న సంతృప్తి ఉంటుంది. ఉన్నది ఒక్కటే జీవితం మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని