వారిలో నా కూతుర్ని చూసుకుంటా

చిన్నవయసులోనే పెద్ద మనసుతో ఆలోచించింది తనీస. క్యాన్సర్‌ బాధితులకు అండగా నిలబడాలనుకుంది... ఆ ఆశయ సాధనలో ఉండగానే మృత్యువు ఆమెను ఓడించింది. కూతురు సగంలో  వదిలి వెళ్లిన బాధ్యతని మీనాక్షి చేపట్టారు. చెట్టంత కూతురు లేని దుఃఖాన్ని దిగమింగుకుని ఆ అమ్మ చేస్తున్న ప్రయాణాన్ని చదవండి...

Updated : 20 Jul 2022 07:14 IST

చిన్నవయసులోనే పెద్ద మనసుతో ఆలోచించింది తనీస. క్యాన్సర్‌ బాధితులకు అండగా నిలబడాలనుకుంది... ఆ ఆశయ సాధనలో ఉండగానే మృత్యువు ఆమెను ఓడించింది. కూతురు సగంలో  వదిలి వెళ్లిన బాధ్యతని మీనాక్షి చేపట్టారు. చెట్టంత కూతురు లేని దుఃఖాన్ని దిగమింగుకుని ఆ అమ్మ చేస్తున్న ప్రయాణాన్ని చదవండి...

న దేశంలో క్యాన్సర్‌ వైద్యం అంటే.. పరీక్షలు, కీమోలు, మాత్రలు. అవే వ్యాధిపట్ల సగం భయాన్ని పెంచుతాయనుకుంటే, బంధువులు, స్నేహితుల మాటలు దాన్ని రెట్టింపు చేస్తాయి. చికిత్స తీసుకుంటూ.. తిరిగి సాధారణ జీవితంలోకి ఎలా రావాలి? మునుపటి ఆత్మవిశ్వాసాన్ని ఎలా పొందాలి? అనేవి ఎవరూ చెప్పరు. కోలుకొనే సమయంలో పోషకాహారం కావాలి. వీటిన్నింటికీ బోలెడు డబ్బు అవసరమవుతుంది. అవన్నీ బాధితులకు అందివ్వాలనుకుంది నాకూతురు. ఆ దారిలో కొన్ని అడుగులు విజయవంతంగానే వేసింది. కానీ సగంలోనే ఆ బాధ్యతని నాకప్పగించి ఏడునెలల క్రితమే ఈ లోకం నుంచి వెళ్లిపోయింది తను. కారణం... అండాశయ క్యాన్సర్‌. తన స్ఫూర్తితోనే రెండున్నర వేల మంది క్యాన్సర్‌ పేషెంట్లకి కావాల్సిన ఆర్థిక సాయంతో పాటు ఎన్నో రకాలుగా ధైర్యం అందించాను.. ఇంకా ఎంతోమందికి అందించాలనుకుంటున్నా.

తనీస ఆలోచన అది...

చనిపోయే నాటికి తనీసకు 23 ఏళ్లు. అప్పుడే గూగుల్‌లో ఉద్యోగం సంపాదించి కెరియర్‌ని నిర్మించుకుంటూ అందరు అమ్మాయిల్లా ఎన్నో కలలు కంటూ, సంతోషంగా గడుపుతోంది. అంతవరకూ గట్టిగా తలనొప్పి అంటే ఏంటో కూడా తెలియని తనీస ఒకరోజు కడుపునొప్పితో బాగా బాధపడింది. ముందు మామూలు మాత్రలే ఇచ్చారు డాక్టర్లు. నయం కాకపోయేటప్పటికి పరీక్షలు చేశారు. చివరికి ఒవేరియన్‌ క్యాన్సర్‌ అని తేల్చారు. నమ్మలేకపోయా. ‘ఇంత చిన్నవయసులో అండాశయ క్యాన్సర్‌ రాదు. కానీ వచ్చింది’ అని డాక్టర్‌ చెప్పినప్పుడు ఆయన  చెప్పింది తప్పేమో అని చాలా మంది డాక్టర్లని అడిగాను. అందరి సమాధానం అదే. ‘క్యాన్సర్‌’తో మా చిన్న ప్రపంచం తలకిందులైంది. ఇక బంధువుల మాటలు వినాలంటే భయం వేసేది. ఇవన్నీ కాదని, తనని తీసుకుని చికిత్స కోసం వాళ్లకు దూరంగా... అమెరికా వెళ్లిపోయాను. అక్కడ వైద్యంతో కొంత ఉపశమనం వచ్చింది. చికిత్సలో భాగంగా ఇచ్చే కీమోథెరపీల తర్వాత... ఆ బాధ నుంచి బయటపడటానికి మంచి ఆహారం, వస్త్రధారణ, ప్రయాణాలపై దృష్టిపెట్టేది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొనేది. నాలుగేళ్ల చికిత్సలో ఇలాంటి విషయాలు చాలా నేర్చుకుంది. అమెరికా నుంచి తిరిగొచ్చాక ‘అమ్మా.. మనకిక్కడ వైద్యం అంటే చికిత్స ఒక్కటే. కానీ అమెరికాలో చికిత్సతోపాటు.. పాత జీవితాన్ని పొందడం ఎలానో కూడా చెబుతారు. కీమోలు ఇచ్చేటప్పుడు మనకి ధైర్యం పంచేందుకు ప్రత్యేకంగా వాలంటీర్లు తోడ్పడతారు. వాళ్లిచ్చే మానసిక ధైర్యం ఈ వ్యాధిని జయించడంలో ఎంతో సాయపడుతుంది. ఇక్కడా అటువంటి సదుపాయం ఉంటే చాలామంది ఈ జబ్బుని జయిస్తారమ్మా. అంతేకాదు అవసరమైన వారికి డబ్బు సాయమూ చేయాలనుకుంటున్నా’ అంది. సరే అన్నా. అలా తనీస ఫౌండేషన్‌ ప్రారంభమైంది.

ఆ సేవలు ఇక్కడా...

తనీసతోపాటు నేను కూడా ఇండియన్‌ క్యాన్సర్‌ సొసైటీలో వాలంటీర్‌గా చేరా. కాన్సర్‌ ఆసుపత్రుల్లో తిరుగుతూ క్యాన్సర్‌తో పోరాడుతున్న వారికీ, వారికి సేవలు అందిస్తున్న కుటుంబసభ్యులకు కూడా మానసికంగా స్థైర్యాన్ని ఇచ్చేవాళ్లం. వాళ్లందరినీ ఒక చోటికి ఆహ్వానించి... వాళ్లు ఆ కష్టం మరిచిపోయేలా తనీస స్టాండప్‌ కామెడీ షోలు నిర్వహించేది. కీమోల వల్ల జుట్టు కోల్పోతారు. వాళ్లని మేకప్‌ ఆర్టిస్టుల సాయంతో పూర్వంలా అలంకరించి ఫొటోషూట్‌లు చేసేది. హెయిర్‌ డొనేషన్‌ క్యాంపులు నిర్వహించేది. అక్కడ సేకరించిన జుట్టును విగ్గులుగా మార్పించి, అవసరం అయిన వారికి ఇచ్చేది. చికిత్స తర్వాత బలహీనంగా ఉన్నవారికి ఖరీదైన పోషకాహారాన్ని అందించేది. చికిత్సకి డబ్బులేని వారికి... ఆర్థిక సాయం చేసేది. గుడ్‌గావ్‌లో అనేక కాలనీలు, అపార్ట్‌మెంట్లకు వెళ్లి అక్కడి వాళ్లందరికీ ఉచితంగా క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించింది. వెయ్యిమంది క్యాన్సర్‌ బాధితులకు ఎన్నో రకాలుగా సాయం చేసింది. ఇవన్నీ చేస్తూనే... సింగపూర్‌, మలేషియా, యూఎస్‌ఏ, హాంకాంగ్‌లలో స్ఫూర్తి ప్రసంగాలు ఇస్తూ ఎంతోమందిలో ఈ వ్యాధిని జయించడానికి కావాల్సిన స్ఫూర్తిని రగిలించింది. గూగుల్‌ ఉద్యోగిగా... సుందర్‌పిచాయ్‌ ఎదుట మాట్లాడాల్సి ఉంది. ఇంతలోనే వ్యాధి తిరగబెట్టి గత ఏడాది డిసెంబరులో తను మమ్మల్ని వదిలి వెళ్లిపోయింది. తన బాధ్యతని నేను తీసుకున్నాను. మరో పదిహేను వందల మంది క్యాన్సర్‌ బాధితులకు సేవలందించాను. తనీస ఇచ్చిన స్ఫూర్తితో నా చివరి నిమిషం వరకూ వీలైనంత మందికి సేవలు అందిస్తాను. ఆ బాధితుల మొహాల్లో విరిసే చిరునవ్వుల్లో నా కూతుర్ని చూసుకుంటాను.’

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని