చిన్నారులకు శక్తినిస్తోంది

పండంటి తన పాపాయి ఎదుగుతున్నప్పుడు ఎలాంటి ఆహారం అందించాలి అని ఆలోచించింది. ఇంట్లో పెద్దవాళ్లనడిగి మరీ పోషకవిలువలున్న ఆహారంపై అవగాహన పెంచుకుంది. ఆ విషయాలను తనలాంటి అమ్మలతో పంచుకొనేది. ఇదే ఆమెకు

Published : 20 Jul 2022 01:40 IST

పండంటి తన పాపాయి ఎదుగుతున్నప్పుడు ఎలాంటి ఆహారం అందించాలి అని ఆలోచించింది. ఇంట్లో పెద్దవాళ్లనడిగి మరీ పోషకవిలువలున్న ఆహారంపై అవగాహన పెంచుకుంది. ఆ విషయాలను తనలాంటి అమ్మలతో పంచుకొనేది. ఇదే ఆమెకు ఓ కొత్త ఆలోచననిచ్చింది. చిన్నారులకు శక్తినందించే ఆహార ఉత్పత్తుల తయారీ మొదలుపెట్టి, కోట్ల రూపాయల ఆదాయాన్ని అందుకుంటోంది. అంతేకాదు, పేద పిల్లలెందరికో ఉచితంగా హృద్రోగ చికిత్సనందిస్త్తోన్న డాక్టర్‌ హేమప్రియ స్ఫూర్తి కథనమిది.

హేమప్రియ నటేశన్‌ది తమిళనాడులోని మధురై. ఎంబీబీఎస్‌ అయ్యాక గోపి నల్లయన్‌తో వివాహం కావడంతో రాయ్‌పుర్‌ వెళ్లింది. అక్కడే ప్రాక్టీస్‌ చేసేది. 2014లో ఈ దంపతులకు పాప పుట్టింది. ప్రసవించిన నెల రోజుల తర్వాత తన చిన్నారి విశేషాలను పొందుపరచడానికి ‘మై లిటిల్‌ మోపెట్‌’ బ్లాగును మొదలుపెట్టింది. పాప పెరుగుతున్న కొద్దీ తనలాంటివాళ్ల గురించి తెలుసుకోవడానికి ఫేస్‌బుక్‌లో ‘పేరెంటింగ్‌ అండ్‌ మామ్‌ గ్రూప్స్‌’లో చేరింది. ఓవైపు బ్లాగులో అనుభవాలు రాస్తూనే, ఈ గ్రూపులో తన సందేహాలను అడుగుతుండేది. అప్పుడే అమ్మ, అత్తగారు చిన్నప్పుడు ఏ తరహా ఆహారం పిల్లలకు అందించేవారో తెలుసుకుంటుండేది.  వారు చెప్పినట్లుగా రకరకాల గింజలతో పోషక విలువలున్న పొడులు తయారుచేసి తన పాపాయికి అందించేది. ఈ విషయాలనూ బ్లాగులో పొందుపరిచేది. అలా వీటి గురించి చాలా మంది ఆమెను అడిగేవారు. తమ పిల్లలకూ అందించడానికి ఉత్సాహం చూపించేవారు.

200 రకాల్లో..

హేమప్రియ తయారుచేసే పొడుల గురించి తెలుసుకొన్నా తయారీ చాలా సుదీర్ఘంగా, సంక్లిష్టంగా ఉండటంతో అందరూ సొంతంగా చేసుకోలేక పోయేవారు. దాంతో నువ్వే చేసి విక్రయించొచ్చు కదా అని అడిగేవారు. ‘ఈ ఆలోచన నాకు నచ్చింది. వెంటనే రాయపుర్‌ నుంచి మావారితో కలిసి మదురై వచ్చేశా. అమ్మ సాయంతో రకరకాల గింజలతో చేసే హెల్త్‌ డ్రింక్‌ పౌడర్‌ (సత్తుమావు)ను ‘మై లిటిల్‌ మోపెట్‌’ పేరుతోనే ప్రారంభించా. నా బ్లాగులో పాఠకులంతా దీనికి వినియోగదారులుగా మారారు. నెలలోపే ఆర్డర్లు మొదలైపోయాయి. ప్యాకెట్లు కొరియర్‌లో పంపేదాన్ని. నెమ్మదిగా ఉత్పత్తుల సంఖ్యను పెంచుకుంటూ... రాగి మొలకలు, చిరుధాన్యాలు, ఎండు ఖర్జూరం పొడులు, కుకీస్‌, క్రేకర్స్‌, ఎనర్జీ బార్స్‌, గంజిపొడి, మిల్లెట్‌ న్యూడిల్స్‌, దోసెలు ఇలా ఇప్పుడు 200 రకాలను చేస్తున్నాం. మొలకల పొడిలో 19 రకాల గింజలుంటాయి. నెలల పిల్లలకు గంజి రూపంలో ఇవ్వొచ్చు. అన్ని వయసుల పిల్లలకూ పోషకవిలువలున్న పొడులున్నాయి. ప్రస్తుతం రోజుకి 200 ఆర్డర్లను అందిస్తున్నాం. ఈ ఏడేళ్లలో మా ఉత్పత్తులు దేశవ్యాప్తంగా లక్షలాదిమంది తల్లులకు చేరాయి. ఇప్పుడు 50మందికిపైగా మహిళలకు ఉపాధినిస్తున్నాను. ఇదీ నాకు చాలా సంతోషాన్నిస్తుంది. మధురైలో ఒక యూనిట్‌ను ప్రారంభించాం. గతేడాది మా వార్షికాదాయం రూ.3 కోట్లు’ అని ఉత్సాహంగా చెప్పుకొచ్చింది హేమప్రియ.

ఉచితవైద్యం...

తన బ్లాగులో ఇప్పటికీ పిల్లలకు శక్తినిచ్చే వంటకాలు, వీడియోలు వంటివి పెడుతోంది. తను. వారి మానసికారోగ్యాన్ని పెంపొందించే ఆటలు, ఎదుగుదలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగిస్తోంది. భర్తతో కలిసి ‘లిటిల్‌ మోపెట్‌ హార్ట్‌ ఫౌండేషన్‌’ ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా వైద్యశిబిరాలు నిర్వహించి హృద్రోగ బాధిత చిన్నారులకు ఉచిత చికిత్సలు అందిస్తోంది. ‘సౌందర్య’ పేరుతో శిరోజాలు, చర్మ ఆరోగ్య సంబంధిత ఉత్పత్తులనూ తయారుచేసి విక్రయిస్తోంది. ‘మనసులో ఏదైనా చేయాలని గట్టిగా అనుకుంటే చాలు, లక్ష్యాన్ని చేరుకోవచ్చు’ అని చెబుతున్న డాక్టర్‌ హేమప్రియ ప్రస్థానం స్ఫూర్తిదాయకం కదూ...

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని