సంప్రదాయ కళ.. సముద్రాలు దాటింది

అక్కడ చీరలపై వేసే డిజైన్లు ఆ అమ్మాయికి ఎంత నచ్చాయంటే... వాటి కోసం ఉద్యోగాన్నే వదిలి పెట్టింది. ఆ కళలో శిక్షణ పొందడమే కాకుండా, దాన్నే కెరియర్‌గా ఎంచుకుంది. పైగా వందల మంది మహిళలకూ శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తోంది

Published : 22 Jul 2022 01:45 IST

అక్కడ చీరలపై వేసే డిజైన్లు ఆ అమ్మాయికి ఎంత నచ్చాయంటే... వాటి కోసం ఉద్యోగాన్నే వదిలి పెట్టింది. ఆ కళలో శిక్షణ పొందడమే కాకుండా, దాన్నే కెరియర్‌గా ఎంచుకుంది. పైగా వందల మంది మహిళలకూ శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తోంది. చేనేత కార్మికులకూ పని కల్పిస్తోంది. ఆ సంప్రదాయ కళను విదేశీయులకూ పరిచయం చేస్తోంది. దాన్నే వ్యాపారంగా మలుచుకుని కోట్లు సంపాదిస్తోన్న షిపా స్ఫూర్తి కథనమిది.

షిపాది గుజరాత్‌. పైచదువుల తర్వాత తాను పుట్టిన పట్టణానికి దగ్గర్లో ఉన్న దీసా  గ్రామాన్ని చూడటానికి వెళ్లిందోసారి. అక్కడి వారంతా చీరలపై హ్యాండ్‌ బ్లాక్‌ ఆర్ట్‌ ప్రింటింగ్‌ చేస్తుంటారు. ఆ డిజైన్లు, ఆ కళ తనకు పిచ్చిగా నచ్చేశాయి. చిన్నప్పటి నుంచి సృజనాత్మకత అంటే షిపాకు ఆసక్తే. 

చేనేత కార్మికులకు...

మనసుకు నచ్చిన ఈ కళనే కెరియర్‌గా మార్చుకోవాలనుకున్న షిపా 2013లో భర్త హార్దిక్‌ పటేల్త్‌ో కలిసి ‘ఛపా’ను ప్రారంభించింది. చెక్కలను డైలో ముంచి చీరలపై వేసే ఈ ప్రింటింగ్‌లో తనూ శిక్షణ తీసుకుంది. ఇంతటి అద్భుతమైన సృజనాత్మకత ఈ మారుమూల గ్రామానికి పరిమితమవకుండా, దేశవ్యాప్తంగా పరిచయం చేయాలనుకున్నా అంది షిపా. ‘ఈ కళను ఏళ్ల నుంచి కాపాడుతూ వస్తున్న కళాకారులకు ఉపాధి కలిగేలా కూడా చేయాలనిపించింది. ‘ఛపా’లో మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తున్నా. ఈ పని తెలియని వారికి శిక్షణనిప్పించి ఉపాధి కల్పిస్తున్నా. ఈ ప్రింటింగ్‌కు వినియోగించే కాటన్‌, ఖాదీ వస్త్రాలను నేసే పని స్థానిక చేనేత కుటుంబాలకు అప్పగిస్తున్నా. వీటిపై వేసే రంగులన్నీ సహజ పదార్థాల నుంచే చేస్తాం. సంప్రదాయ డిజైన్లతోపాటు మోటిఫ్‌లు, ఏనుగులు, గ్రహాలు, పక్షులు... ఇలా ఎన్నో రకాల డిజైన్లు ఇక్కడ ప్రింట్‌ అవుతాయి. ఆధునికత ఉట్టిపడేలా, ఆకర్షించేలా డిజైన్లు వేయడంలో ఇక్కడి వారు సిద్ధహస్తులు. ఇటువంటివి మార్కెట్‌లో కనిపించవు. మావద్ద వృథా అనే మాటే ఉండదు. నేయించిన వస్త్రంపై ప్రింట్‌ వేయగా మిగిలిన దాంతో కెమెరా బెల్ట్‌లు, పౌచ్‌లు, ఐప్యాడ్‌ స్లీవ్స్‌, బ్యాగులు వంటివి చేస్తాం. వాటి తయారీలో మరికొందరు ఉపాధి పొందుతున్నారు’ అని చెప్పుకొస్తుంది షిపా.

కళకు కొత్త కళ..

ఛపాలో తయారీ, మార్కెటింగ్‌, చేనేత కార్మికులు దాదాపు 200 మందికిపైగా ఉన్నారు. వీరందరికీ ఏటా ఉచిత వైద్యపరీక్షలు చేయిస్తుంది షిపా. సంస్థ వెబ్‌సైట్‌లో, సోషల్‌ మీడియాలో ఆయా దుస్తుల ప్రింటింగ్‌ గురించి, వాటి వెనుక ఉన్న కళాకారుల గురించి వివరాలు పొందుపరుస్తుంది. ‘ఈ కళ వెనుక కళాకారుల కష్టం, వారు ప్రదర్శించే సృజనాత్మకతపై అందరికీ అవగాహన ఉండాలన్నది నా ఉద్దేశం. గతంలో ఇక్కడి వారు చాలామంది ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలను వెతుక్కుంటూ వెళ్లేవారు. ఇక్కడి వారికి నేను కల్పిస్తున్న అవగాహన, ఉపాధితో యువత ఈ కళపై ఆసక్తి చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగానే కాదు... ఇప్పుడు సింగపూర్‌, అమెరికా, యుఏఈ వంటి దేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. వార్షికాదాయం రూ.1.5 కోట్లకు చేరింది. అహ్మదాబాద్‌లో రిటైల్‌ స్టోర్‌ కూడా నిర్వహిస్తున్నాం’ అని అంటోంది షిపా. ఓ సంప్రదాయ కళకు కొత్త ఊపిరులూదుతూ తనూ వ్యాపారవేత్తగా ఎదగడం గొప్ప విషయం కదూ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని