‘అమ్మ’ పాటకి పురస్కారం!

ఇన్నాళ్లూ ఆమె పాడిన పాటలు వింటూ మురిసిపోయిన ఆ పల్లెగట్లు... పచ్చని చెట్లు, గోవులు, మేకలు... ఆమె గురించి ప్రపంచానికి తెలియాలని మనసారా కోరుకున్నట్టున్నాయి! అందుకే ఓ మారుమూల గ్రామానికి చెందిన 62 ఏళ్ల నాంజియమ్మ

Updated : 24 Jul 2022 07:41 IST

ఇన్నాళ్లూ ఆమె పాడిన పాటలు వింటూ మురిసిపోయిన ఆ పల్లెగట్లు... పచ్చని చెట్లు, గోవులు, మేకలు... ఆమె గురించి ప్రపంచానికి తెలియాలని మనసారా కోరుకున్నట్టున్నాయి! అందుకే ఓ మారుమూల గ్రామానికి చెందిన 62 ఏళ్ల నాంజియమ్మ ఈసారి జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ గాయనిగా పురస్కారాన్ని అందుకుంది...

క్కుపాటి... కేరళలోని అత్తపాడి సమీపంలోని ఓ మారుమూల గ్రామం. కేరళలోనే చాలామందికి తెలియని ఆ ఊర్లో ఓ పేద గిరిజన కుటుంబంలో పుట్టింది నాంజియమ్మ. చిన్నప్పట్నుంచీ మేకలు కాయడం... తీరిగ్గా ఉన్నప్పుడు అమ్మపాడే జానపదాలు వినడం ఇవే ఆమెకు ఇష్టమైన వ్యాపకాలు. అలా అమ్మపాడిన పాటలతో తన మాతృభాషైన ఇరులాని ప్రేమించింది. కొన్నాళ్లకు సొంతంగా పాటలల్లి పాడేది. తన పాటంటే ప్రాణం పెట్టే స్థానికులని అలరించడం కోసం... ఊర్లోని ఆజాద్‌ కళాసమితిలో పాడుతూ ఉండేది. ఆమె పాట గురించి తెలుసుకున్న సంగీత దర్శకుడు జేక్స్‌ బిజాయ్‌ ‘అయ్యప్పనుం కోషియుం’ అనే మలయాళచిత్రం కోసం పాడించాడు. ఆ చిత్రం విడుదల కాకముందే యూట్యూబ్‌లో కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకుంది నాంజియమ్మ పాట. ‘చిన్నతనం నుంచీ అమ్మ దగ్గర విన్న పాటలే ఇవి. అవి నాకు కొత్త కాదు. కానీ ఈ జాతీయ పురస్కారాల గురించే నాకు తెలియదు. మా అబ్బాయి ఫోన్‌ చేసి చెబితే సంతోషంగా అనిపించింది. మా అమ్మ ఇచ్చిన వరం అనిపించింది. ఊర్లో మేకలు మేపుతూ, వ్యవసాయం చేస్తుంటా. ఓసారి ‘అగ్గేడు నాయక’ అనే డాక్యుమెంటరీలో పాడే అవకాశం వచ్చింది. ఆ తర్వాత కేరళ ప్రభుత్వానికి చెందిన ఒక కార్యక్రమం కోసం మా మాతృభాషలో ఒక పాట పాడా. ఆపై కొన్ని టెలివిజన్‌ కార్యక్రమాల్లోనూ పాడా. అవన్నీ విని సంగీత దర్శకుడు బిజాయ్‌ నాకు సినిమాలో అవకాశం ఇచ్చారు. పాటే కాదు నటింపజేశారు కూడా. ఈ సినిమా కోసం నేనే సొంతంగా మూడు పాటలు రాశా. పారై, డవిల్‌, కోకల్‌, జాల్త్రా వంటి వాద్యాలను వినియోగిస్తూ పాడా. ఓరకంగా ఆ పాటల్లో నా జీవితమే కనిపిస్తుంది’ అని చెబుతున్న నాంజియమ్మకు కేరళ రాష్ట్రప్రభుత్వం ఏటా కళాకారులకు ఇచ్చే ‘ప్రత్యేక జ్యూరీ అవార్డు-2020’తో సత్కరించింది. నాంజియమ్మ కుమారుడు శ్యామ్‌ ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీస్‌లో ఉద్యోగి. ఓ కూతురు కూడా ఉంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని