ఆమె పుస్తకం శాస్త్రవేత్తను చేసింది

రెండేళ్ల క్రితం మాట... ఓవైపు లాక్‌డౌన్‌... ఔషధాల కోసం విదేశాలపై ఆధారపడే పరిస్థితి లేదు. అందుకే ప్రాణాధార మందులకోసం శాస్త్రవేత్తలు పగలూ, రాత్రీ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అప్పుడే కొవాగ్జిన్‌ రూపకల్పనలో కీలకమైన అడ్జువెంట్‌ తయారీ బృందంలో సభ్యురాలిగా శెభాష్‌ అనిపించుకున్నారు ఐఐసీటీ సీనియర్‌ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ ప్రథమ. ఔషధ పరిశోధనల్లో ఆ కృషికే తాజాగా ‘నేషనల్‌ టెక్‌ ఎక్సలెన్స్‌’ పురస్కారాన్ని అందుకున్నారామె. ఆమెతో వసుంధర

Updated : 28 Jul 2022 23:18 IST

రెండేళ్ల క్రితం మాట... ఓవైపు లాక్‌డౌన్‌... ఔషధాల కోసం విదేశాలపై ఆధారపడే పరిస్థితి లేదు. అందుకే ప్రాణాధార మందులకోసం శాస్త్రవేత్తలు పగలూ, రాత్రీ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అప్పుడే కొవాగ్జిన్‌ రూపకల్పనలో కీలకమైన అడ్జువెంట్‌ తయారీ బృందంలో సభ్యురాలిగా శెభాష్‌ అనిపించుకున్నారు ఐఐసీటీ సీనియర్‌ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ ప్రథమ. ఔషధ పరిశోధనల్లో ఆ కృషికే తాజాగా ‘నేషనల్‌ టెక్‌ ఎక్సలెన్స్‌’ పురస్కారాన్ని అందుకున్నారామె. ఆమెతో వసుంధర ముఖాముఖీ ఇదీ...

మీ పేరు కొత్తగా ఉంది...

మా ఇంట్లో చదువుకు ప్రాధాన్యమిచ్చేవారు. నాన్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులు. తాతయ్య డాక్టర్‌. అమ్మ కూడా పీజీ చేశారు. నేను మొదటి సంతానం కావడం, ఉగాది రోజు పుట్టడంతో ‘ప్రథమ’ అని పెట్టారు. గణేశుని పేరు అయిన ప్రథమేష్‌ నుంచి వచ్చింది.

పరిశోధనల పట్ల ఆసక్తి ఎలా మొదలయ్యింది?

ఎనిమిదో తరగతిలో ఉండగా నాన్న ఓ పుస్తకాన్ని బహూకరించారు. చదివాక నాకూ పరిశోధనలు చేయాలనే ప్రేరణ కలిగింది. మేడమ్‌ మేరీ క్యూరీ జీవితచరిత్ర అది. పై చదువులయ్యే సరికి పరిశోధనలపై ఆసక్తి ఇంకా పెరిగింది.

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీలో (ఐఐసీటీ) తొలి జ్ఞాపకాలు?

రీసెర్చ్‌ స్కాలర్‌గా ప్రవేశించాను. అక్కడి పరిశోధనశాలలు, గ్రంథాలయం గొప్పదనం ఎంత చెప్పినా తక్కువే. ఎక్కువ సేపు అక్కడే గడిపేదాన్ని. 18వ శతాబ్దపు చివరి నుంచి ప్రచురితమైన ఎన్నో పరిశోధనా పత్రికలు ఉండేవక్కడ. నేను చేరే నాటికి అక్కడ మహిళా శాస్త్రవేత్తలు బాగానే ఉండేవారు. లింగ సమానత్వమూ ఎక్కువే.

మీ పరిశోధనా ప్రస్థానం ఎలా సాగింది..

పీహెచ్‌డీ కాగానే ఓ ఔషధ సంస్థలో చేరా. అప్పట్లో ల్యాబుల్లో మహిళలు అరుదు. నేను మాత్రం ప్రయోగశాల నుంచి ఉత్పత్తి వరకు వివిధ దశల్లో పాలు పంచుకునే దాన్ని. గంటల తరబడి ప్లాంట్‌లో నిలబడే ఉండేదాన్ని. చాలా సార్లు రాత్రిళ్లూ ఉండిపోవాల్సిన పరిస్థితి. మొత్తం యూనిట్లో చాలాసార్లు మహిళని నేనొక్కదాన్నే ఉండేదాన్ని. క్లయింట్లతో సమావేశాలు, శిక్షణ కార్యక్రమాల్లోనూ మహిళలు పెద్దగా ఉండే వారు కాదు. ఔషధ రసాయన శాస్త్రం, ఆవిష్కరణల్లోనూ పాలు పంచుకున్నా. క్లినికల్‌ ట్రయల్స్‌ వరకూ వెళ్లిన ఒక మాలిక్యుల్‌ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తల్లో నేనొకర్ని. ఈ అనుభవాలు నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాయి. పరిశోధనలపై పూర్తిగా దృష్టిపెట్టేలా చేశాయి. తర్వాత ఐఐసీటీలో చేరాను. నా పారిశ్రామిక అనుభవంతో ఐఐసీటీలోని క్రియాశీల మూలకాలను ఔషధ ఆవిష్కరణల్లో ముందుకు తీసుకెళ్లాలనేది లక్ష్యం. మొదట్లో టీబీ, తర్వాత క్యాన్సర్‌, ఇప్పుడు పల్మనరీ ఫైబ్రోసిస్‌పై పని చేస్తున్నాం. ఔషధాల తయారీకి అవసరమైన ‘ఏపీఐ(యాక్టివ్‌ ఫార్మాస్యుటికల్‌ ఇన్‌గ్రేడియంట్‌)’ల తయారీలో పనిచేసిన తొలి మహిళా శాస్త్రవేత్తనూ నేనే.

లాక్‌డౌన్‌ వేళ ఎదుర్కొన్న సవాళ్లు...

కొవిడ్‌ ప్రారంభమైన మొదట్లో ఇన్‌ఫెక్షన్‌ను నయం చేసే మాలిక్యుల్‌ను రూపొందించడం అత్యవసరం. కానీ లాక్‌డౌన్‌ వల్ల దిగుమతులు నిల్చిపోయాయి. దీన్నొక సవాల్‌గా తీసుకున్నాం. మా బృందం యాంటీవైరల్‌ మాలిక్యుల్స్‌ గుర్తింపు, అభివృద్ధి ప్రక్రియలపై దృష్టి పెట్టింది. ఫావిపిరావిర్‌, రెమ్‌డెసివిర్‌, ఉమిఫెనోవిర్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌, డెక్సామెథాసోన్‌పై దృష్టి సారించాం. స్థానికంగా దొరికే రసాయనాలతో ప్రక్రియలను అభివృద్ధి చేశాం. పరిశ్రమల సహకారమూ తీసుకున్నాం. రాత్రీ పగలూ కష్టపడ్డాం. తర్వాత సాంకేతికతను పరిశ్రమలకు బదలాయించాం. కొవాగ్జిన్‌ తయారీలో అత్యంత కీలకమైన అడ్జువెంట్‌ ప్రక్రియను అభివృద్ధి చేశాం. అత్యవసరం కాబట్టి ఏకకాలంలో వివిధ అంశాలపై పని చేయాల్సి వచ్చింది.

మహిళా శాస్త్రవేత్తలు కెరియర్‌ను తిరిగి ప్రారంభించాలనుకుంటే?

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఉమెన్‌ సైంటిస్ట్‌ స్కీం (డబ్ల్యూఓఎస్‌-ఏ)లు మంచి అవకాశం కల్పిస్తున్నాయి. నేను ఐఐసీటీలో చేరడానికి ఇదే దారి చూపింది. మహిళలకు ఎలాంటి పరిమితులూ లేవు. ఆసక్తి, శ్రమించే తత్వం ఉంటే ఈ రంగంలో బోలెడు అవకాశాలు సిద్ధంగా ఉన్నాయి.


జనరిక్‌ ఔషధాల తయారీలో పనిచేసిన తొలి మహిళా శాస్త్రవేత్తల్లో ప్రథమ ఒకరు. లాక్‌డౌన్‌ వేళ రసాయనాల దిగుమతి నిల్చిపోతే దేశీయంగానే కరోనా ఔషధాల ఉత్పత్తికి అవసరమైన ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మాస్యుటికల్‌ ఇన్‌గ్రేడియంట్‌) రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆర్గానిక్‌ సింథసిస్‌ ఖీ ప్రాసెస్‌ కెమిస్ట్రీ విభాగాధిపతి. ఔషధాల తయారీలో 30 పేటెంట్లని సొంతం చేసుకున్నారు.

- మల్లేపల్లి రమేశ్‌రెడ్డి, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్