అమ్మమ్మలూ అవ్వొచ్చు... అందమైన మోడల్స్
యుక్తవయసులోనే అందం.. అనుకుంటే పొరపాటే. వీరిని చూస్తే.. ఆ అభిప్రాయం మార్చుకోవాల్సిందే. అందానికి వయసు ప్రధానం కాదంటారు వీరు కూడా. తాము అడుగుపెట్టిన రంగానికి.. తమ వయసుకు సంబంధం లేదంటారు.
యుక్తవయసులోనే అందం.. అనుకుంటే పొరపాటే. వీరిని చూస్తే.. ఆ అభిప్రాయం మార్చుకోవాల్సిందే. అందానికి వయసు ప్రధానం కాదంటారు వీరు కూడా. తాము అడుగుపెట్టిన రంగానికి.. తమ వయసుకు సంబంధం లేదంటారు. అయిదుపదులు దాటాక, మోడలింగ్ రంగంలో అనుకోకుండా అడుగుపెట్టి ప్రముఖ సంస్థల తరఫున మెరిసిపోతున్నారు.
అటు వైద్యం... ఇటు ఫొటోషూట్లు...
మనసుకు నచ్చింది చేయడానికి వయసు అడ్డంకి కాదని నిరూపించారు డాక్టర్ గీతా ప్రకాష్. 57వ ఏట మోడల్‌గా మారి ప్రముఖ సంస్థలకు మోడలింగ్ చేసే స్థాయికి చేరుకున్నారు. అంజూ మోడి, తరుణ్ తహిల్యానీ, గౌరవ్ గుప్తా, తోరణి, నికోబార్, జైపుర్ వంటి అతిపెద్ద డిజైనర్ బ్రాండ్స్ దుస్తుల ప్రకటనల్లో మోడల్‌గా మెరుస్తున్నారీమె. జనరల్ ఫిజీషియన్‌గా కెరియర్ ప్రారంభించిన ఈమె మోడల్ అవుతానని కలలో కూడా అనుకోలేదట. ‘వైద్యవృత్తిని ఎంచుకున్నా. అందులోనే జీవితం గడిచిపోతోంది. మోడల్‌గా అవుతానని, అదీ 57 ఏళ్లు వచ్చాక... కలలో కూడా అనుకోలేదు. ఓసారి ఇటలీ ఫొటోగ్రఫర్ ఒకరు మా క్లినిక్‌కు చికిత్స కోసం వచ్చారు. ఆయన నన్ను మోడల్‌గా చేయమన్నాడు. నేను పట్టించుకోలేదు. కానీ రెండు నెలల తర్వాత నా ఫొటోలు పంపమని తన నుంచి ఉత్తరం. సరే చూద్దామని, కొన్ని పంపా. అవే నన్ను మోడల్‌గా మార్చాయి. అలా డిజైనర్ తరుణ్ తహిల్యానీతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. తర్వాత జయపుర్‌కు చెందిన ఓ బ్రాండ్ తమకు మోడల్‌గా చేయమంది. అది విజయవంతం కావడంతో ప్రముఖ సంస్థల పిలుపులు మొదలయ్యాయి. ఓవైపు వైద్యవృత్తి, మరోవైపు మోడలింగ్ రెండింటినీ సమన్వయం చేసుకుంటున్నా. ఈ షూటింగ్‌లను వారాంతాల్లో ఏర్పాటు చేసుకుంటా. అంతేకాదు, ఇంటి దగ్గర పేద రోగులకు ఉచితంగా చికిత్సనందిస్తుంటా. మహిళలకందరికీ చెప్పేదేంటంటే ప్రతి ఒక్కరికీ ఏదో ఒక కల ఉంటుంది. దాన్ని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించండి. వయసు గురించి ఆలోచించొద్దు. ప్రపంచంలో మీకు మీరే సాటి. మీ లక్ష్యం, అభిరుచి, కలలకు వయసు అడ్డంకి కాదు’ అని చెబుతారు డాక్టర్, మోడల్ గీత.
పదవీ విరమణ వయసులో...
ఓ ఫైటర్‌పైలట్‌తో వివాహమైన తర్వాత దిన, వార, మాసపత్రికలకు ఫ్రీలాన్సర్‌గా పని చేసేవారు ముక్తా సింగ్. చిత్రకళ, సంగీతమన్నా ఆసక్తి ఉండటంతో మనసుకు నచ్చిన పాటలకు గ్రాఫిక్ ఇమేజినేషన్ ఇచ్చి బొమ్మలూ వేసేవారు. తల్లైన తర్వాత పిల్లల పెంపకంలో సమయం తెలిసేది కాదు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తతో నిత్యం వ్యాయామాలతో ఫిట్‌గా ఉండేవారు. అలా దాదాపు 38 ఏళ్లు ఉద్యోగ, కుటుంబ బాధ్యతలతో సరిపోయింది. ఓసారి బంధువులింట్లో వివాహానికి వెళ్లినప్పుడు ఒక డిజైనర్ ముక్తాసింగ్‌ను చూసి తను డిజైన్ చేసిన దుస్తులకు మోడల్‌గా పనిచేయమని అడిగారు. అప్పటికి ఆమెకు 58 ఏళ్లు. మొదట్లో సంకోచించినా... అనుకోకుండా వచ్చిన ఈ మలుపును కాదనలేకపోయా అంటారీమె. ‘ఇంట్లో వాళ్లందరూ ప్రోత్సహించారు. అలా అందరూ పదవీవిరమణ చేసే వయసులో కొత్త కెరియర్‌లో అడుగుపెట్టడం గర్వంగా భావిస్తున్నా. మేకప్, రకరకాల దుస్తులు.. నా చుట్టూ వాతావరణం అంతా కొత్తదే అయినా.. ఎంజాయ్ చేస్తున్నా’ అంటున్నారు ముక్తాసింగ్.
లోదుస్తుల ప్రకటనల్లో...
ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ, 50 ఏళ్ల వారికి జరిగిన అందాల పోటీలో పాల్గొన్నారు జె.గీత. ఆ పోటీలో రన్నరప్‌గా నిలిచారు. అయితే మోడల్ అయ్యే అవకాశం అనుకోకుండా వెతుక్కుంటూ వచ్చింది. అది లోదుస్తుల ప్రకటనల కోసమని తెలిసినా, ఆమె వెనుకడుగు వేయలేదు. ఛాలెంజ్‌గా తీసుకున్నారు. తన మనసు ఓకే చెప్పడంతో మోడల్‌గా 50వ ఏట కెరియర్‌ను ప్రారంభించారీమె. ‘అయ్యో ఇదేంటి పెద్దామె, లోదుస్తుల ప్రకటనల్లో కనబడుతోంది అని చాలా మంది విమర్శిస్తారని తెలుసు. ఏ కెరియర్ అయినా హుందాగానే ఉంటుంది. అన్నింటికీ హద్దులు గీసుకుంటే ఎలా. మోడల్ కావాలనే నా కల తీరిందనుకున్నా. నా అభిప్రాయం చెప్పగానే నా కుటుంబం ప్రోత్సహించింది. మహిళలు భర్త, పిల్లల బాధ్యతలను తీర్చడానికి కృషి చేస్తూ, వారి కలలను నెరవేర్చుకోవడంలో సాయపడతారు. పైగా మతాలు, సంప్రదాయాల పేరుతో నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ కూడా మన సమాజంలో ఉండదు. తమకంటూ ఒక జీవితం ఉందని, దానికి కూడా న్యాయం చేయాలని అనుకోరు. ఎప్పుడూ తమ ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వరు. కానీ మహిళలు తమ గురించి కూడా ఆలోచించుకోవాలని కోరుకుంటున్నా. మనసుకు నచ్చింది చేయడానికి ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉంది’ అంటారు గీత. ‘లోదుస్తుల మోడల్‌గా కనిపించడానికి 50 ఏళ్ల మహిళలు పనికి రారా’ అంటూ ‘ఏజ్ నాట్ కేజ్’, ‘లింగరీ హేజ్ నో ఏజ్’ శీర్షికలతో ‘ఛేంజ్.ఆర్గ్’లో ఆన్‌లైన్ పిటిషన్ ఫైల్ చేశారీమె. ఇందులో 11వేల మంది తమ సంతకాలతో ఈ పిటీషన్‌కు మద్దతు తెలపడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.