ఎన్డీఆర్‌ఎఫ్‌లో మహిళా శక్తి!

ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలకు ఊళ్లకు ఊళ్లే మునిగిపోతున్నాయి. కొన్నిచోట్ల రాత్రికిరాత్రే రాదారి గోదారవుతోంది. అలాంటప్పుడు ప్రజల్ని కాపాడే విషయంలో అందరికీ గుర్తొచ్చేది ఎన్డీఆర్‌ఎఫ్‌ (నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌) బృందాలే. తమ ప్రాణాలను లెక్కచేయకుండా బాధితుల్ని కాపాడటం, సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో వీరికి వీరే సాటి..

Published : 30 Jul 2022 00:43 IST

డతెరిపిలేకుండా కురుస్తున్న వానలకు ఊళ్లకు ఊళ్లే మునిగిపోతున్నాయి. కొన్నిచోట్ల రాత్రికిరాత్రే రాదారి గోదారవుతోంది. అలాంటప్పుడు ప్రజల్ని కాపాడే విషయంలో అందరికీ గుర్తొచ్చేది ఎన్డీఆర్‌ఎఫ్‌ (నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌) బృందాలే. తమ ప్రాణాలను లెక్కచేయకుండా బాధితుల్ని కాపాడటం, సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో వీరికి వీరే సాటి. ఎంతో కీలకమైన ఈ ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాల్లో మహిళలూ ఉంటే మేలని భావించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర సర్వీసుల్లోని రక్షణ, రిజర్వ్‌ ఫోర్స్‌లలో పనిచేస్తున్న మహిళల్ని వీటిలో చేరమని గతేడాది పిలుపునిచ్చింది. దాంతో వంద మందికిపైనే దీన్లో చేరారు. వీరిలో సీఆర్‌పీఎఫ్‌ నుంచి వచ్చిన వాళ్లే ఎక్కువ. మొన్న అమర్‌నాథ్‌ యాత్రికులు వరదల్లో చిక్కుకున్న సమయంలో, అసోం వరదల్లో ఈ మహిళా బృందాలు రంగంలోకి దిగి సేవలందించాయి. తాజాగా గుజరాత్‌ ఎన్డీఆర్‌ఎఫ్‌ విభాగంలో ఎనిమిది మంది మహిళలు చేరారు. వారిలో ముగ్గురు ఇటీవల నర్మదా జిల్లాలో వరదల్లో క్షేత్రస్థాయిలో పనిచేశారు. పురుషులతో సమానంగా నాలుగు నెలలపాటు కఠిన శిక్షణ తీసుకుంటున్నారీ మహిళా సభ్యులు. ప్రకృతి వైపరీత్యాలతోపాటు రసాయనాలు వెలువడటం, బాంబు దాడుల సమయంలో రక్షణకు సంబంధించిన అంశాల్లో శిక్షణ పొందారు. వీరికి బోటు నడపడం, తాళ్లను ఉపయోగించి సురక్షితంగా కాపాడటం... ఇవన్నీ నేర్పారు. అంతేకాదు, అత్యవసర పరిస్థితుల్లో సురక్షితంగా కాన్పులు చేయడంలోనూ మహిళా బృందాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఆపదలో, వైద్యసేవలు అందాల్సిన సమయంలో సాటి మహిళలు సంరక్షకులుగా ఉంటే బాధితులకీ ధైర్యంగా ఉంటుంది. దేశంలోని ప్రతి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందంలో కనీసం పది శాతం మహిళల్ని తీసుకోవాలన్నది లక్ష్యం. ఆ లెక్కన వచ్చే రెండేళ్లలో కనీసం వెయ్యిమంది ఈ బృందాల్లో చేరనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని