నలభై ఏళ్ల వయసులో.. నలభై కోట్ల వ్యాపారం!

గృహిణి అంటే చాలా మందిలో తెలియని చిన్నచూపు ఉంటుంది. కానీ అవకాశం వచ్చి, వాళ్లు దృష్టి పెడితే.. వ్యాపార సామ్రాజ్యాన్నే సృష్టించవచ్చని నిరూపించింది శీతల్‌. 40ఏళ్ల వయసులో ఆమె మొదలుపెట్టిన ఎత్నిక్‌వేర్‌ వ్యాపారం, అది విదేశాల్లో విస్తరించిన తీరు తెలిస్తే మీరూ ఆశ్చర్యపోతారు...

Updated : 30 Aug 2022 12:01 IST

గృహిణి అంటే చాలా మందిలో తెలియని చిన్నచూపు ఉంటుంది. కానీ అవకాశం వచ్చి, వాళ్లు దృష్టి పెడితే.. వ్యాపార సామ్రాజ్యాన్నే సృష్టించవచ్చని నిరూపించింది శీతల్‌. 40ఏళ్ల వయసులో ఆమె మొదలుపెట్టిన ఎత్నిక్‌వేర్‌ వ్యాపారం, అది విదేశాల్లో విస్తరించిన తీరు తెలిస్తే మీరూ ఆశ్చర్యపోతారు...

లభై ఏళ్ల వయసు అంటే.. చాలామంది మనసులో రిటైర్మెంట్‌ ప్రణాళికలు కూడా మొదలయిపోతుంటాయి. కొత్త విషయాలు తెలుసుకోవడానికి మనసూ, శరీరం మొరాయిస్తాయి. కానీ శీతల్‌కపూర్‌ తన కెరియర్‌కి శ్రీకారం చుట్టిన వయసు ఇదే. ఆమెకి 20 ఏళ్లకే పెళ్లయ్యింది. ఆపై ఇరవైఏళ్లూ భర్త, పిల్లలను చూసుకోవడంతోనే సరిపోయింది. కుటుంబం కోసం చేసినన్ని రోజులు చేశా. ఇక నచ్చిన పని ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు ఆమె దృష్టి భర్త సందీప్‌ చేస్తున్న దుస్తుల వ్యాపారంపై పడింది. ఆయన రెడీమేడ్‌ దుస్తుల తయారీలో ఉన్నాడు. కానీ రెడీమేడ్‌ దుస్తుల్లో అమ్మాయిలు ఇష్టంగా ధరించే ఎత్నిక్‌వేర్‌ (సంప్రదాయ దుస్తులు)కు అంత ప్రాధాన్యత లేకపోవడం, మరోవైపు సంప్రదాయ దుస్తులు కుట్టే టైలర్లకి క్షణం తీరిక లేకపోవడం శీతల్‌ గమనించింది. నాణ్యమైన వస్త్రంతో అమ్మాయిల కోసం సల్వార్‌కమీజులు, చుడీదార్లు కుట్టి... వాటిని అమ్మడానికి దుకాణాలు చుట్టూ తిరిగింది. కానీ దీని వల్ల పెద్దగా ప్రయోజనం లేదని తక్కువ సమయంలోనే తెలుసుకుంది. అది 2009. అప్పుడప్పుడే మన దేశంలో ఈ-కామర్స్‌ విస్తరిస్తోంది. ఇది తెలుసుకున్న శీతల్‌ ‘ఓ ఈ-కామర్స్‌ పోర్టల్‌ని ఎందుకు పెట్టకూడదు?’ అనుకుంది.


సంపదని సృష్టించడం, విజయాన్ని సాధించడం అనే మాటలు మొదట మన మెదడులో ఉండాలి. తర్వాత క్రమంగా అవి కార్యరూపం దాలుస్తాయి. దానికి వయసు అడ్డంకి కాదు.

- శీతల్‌.


కానీ లాప్‌టాప్‌ని వాడటం కూడా తనకు తెలియదు. అయినా వెనుకంజ వేయలేదు. సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు పెంచుకుంటూనే నలభై ఏళ్లప్పుడు ‘శ్రీ’ పేరుతో ఈ-కామర్స్‌ దుకాణం తెరిచింది. ఆమె రూపొందించిన దుస్తులు మనదేశంలోనే కాదు.. అమెరికా, యూరోప్‌ దేశాల్లో ఉంటున్న మనవారికీ నచ్చడం మొదలుపెట్టాయి. ‘భారతీయ స్త్రీల శరీర నిర్మాణం భిన్నంగా ఉంటుంది. దాంతో రెడీమేడ్‌ దుస్తులు మన శరీరానికి తగినట్టుగా ఉండవు. ఇది గమనించాక.. అచ్చంగా మనవాళ్లకు సరిపోయేలా నేను, మావారు కలిసి డిజైన్‌ చేయడం మొదలుపెట్టాం. నెమ్మదిగా మేం రూపొందిస్తున్న దుస్తులకు ఆదరణ పెరిగింది. దుబాయ్‌ వంటి చోట్ల అమ్మకాలు పెరగడంతో దిల్లీకి చెందిన అల్ఫాక్యాపిటల్‌ నుంచి ఎనభైకోట్ల రూపాయల పెట్టుబడి అందింది. దాంతో దిల్లీలో 15 దుకాణాలు తెరిచాం. ఆన్‌లైన్‌ వ్యాపారంతోపాటు.. ఆఫ్‌లైన్‌ వ్యాపారమూ ఊపందుకుంది. మనదేశంతోపాటు ఇతర దేశాల్లోనూ 100పైగా అవుట్‌లెట్లని ప్రారంభించా’ అంటూ గర్వంగా చెబుతోన్న శీతల్‌కపూర్‌ నలభైకోట్ల రూపాయల వ్యాపారం చేస్తోంది. ఇప్పటికే మార్కెట్లో ఎత్నిక్‌ వేర్‌ రంగంలో ప్రత్యేకత సాధించుకున్న సంస్థలతో పోటీపడుతూ... భవిష్యత్తులో మరో 500 దుకాణాలు తెరవడానికి సన్నాహాలు చేసుకుంటోంది శీతల్‌.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్