ఈ బ్యాంకులో.. జీవముంది!

న్యాయవిద్య చదివిందామె. కానీ వర్షాధారప్రాంతాల్లో వేలమంది రైతులకు సేంద్రియపంటలెలా పండించాలో నేర్పిస్తోంది. వందల రకాల దేశీయ విత్తనాలను భద్రపరిచి, రైతులకు ఉచితంగా అందిస్తోంది. పెరటి తోటల పెంపకంలో శిక్షణనిచ్చి, గ్రామీణ పాఠశాల విద్యార్థులకు ఆరోగ్యకరమైన మధ్యాహ్న భోజనం అందేలా చేస్తోంది. స్వచ్ఛంద సంస్థ స్థాపించి వందల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది.

Published : 07 Aug 2022 00:36 IST

న్యాయవిద్య చదివిందామె. కానీ వర్షాధారప్రాంతాల్లో వేలమంది రైతులకు సేంద్రియపంటలెలా పండించాలో నేర్పిస్తోంది. వందల రకాల దేశీయ విత్తనాలను భద్రపరిచి, రైతులకు ఉచితంగా అందిస్తోంది. పెరటి తోటల పెంపకంలో శిక్షణనిచ్చి, గ్రామీణ పాఠశాల విద్యార్థులకు ఆరోగ్యకరమైన మధ్యాహ్న భోజనం అందేలా చేస్తోంది. స్వచ్ఛంద సంస్థ స్థాపించి వందల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. వ్యవసాయంలో అధిక దిగుబడులు, రసాయనరహిత ఆహారాన్ని అందరికీ చేర్చాలనే సమున్నత లక్ష్యంతో సాగుతోన్న వల్లియమ్మాళ్‌ రాజన్‌ స్ఫూర్తి కథనమిది.

ల్లి వాళ్లది బెంగళూరు. భర్తతో కలిసి అప్పుడప్పుడూ అత్తగారి ఊరు కర్ణాటకలోని ఛామరాజనగర్‌ జిల్లా నల్లూరుకు వెళుతుండేది. ఓ సారి ఆ దారిలో బీడుభూముల్ని చూసింది వల్లియమ్మాళ్‌. వాటి గురించి అడిగితే మిర్చి, చిరుధాన్యాలు వంటివి పండేవని, వ్యవసాయంలో నష్టాలతో రైతులు సేద్యానికి దూరమయ్యారని చెప్పాడామె భర్త. అప్పుడు తనకొచ్చిన ఓ ఆలోచన ఎందరో రైతుల జీవితాలను మార్చేసింది. చదువుతున్నప్పటి నుంచే సామాజిక సేవ చేయాలని ఉండేది వల్లికి. దానికి భర్త ప్రోత్సాహం తోడైంది. కాస్త స్థిరపడ్డాక వలస కూలీల పిల్లలకు చదువు చెప్పడం కోసం 1994లో బెంగళూరులో ‘అనీషా’ ఎన్జీవోను స్థాపించింది.

వేలమంది రైతులకు..

లా పూర్తయిన తర్వాత  బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కల్చరల్‌ రీసెర్చి అండ్‌ యాక్షన్‌ విభాగంలో చేరింది. వాతావరణానికి తగినట్లుగా వ్యవసాయ విధానాలను అభివృద్ధి చేసే విభాగంతో కలిసి పనిచేసేది. ఆ సమయంలోనే సేంద్రియ వ్యవసాయంపై అవగాహన పెంచుకుంది 58 ఏళ్ల వల్లియమ్మాళ్‌. తన మనసులో ఛామరాజనగర్‌ జిల్లా రైతులు మెదిలారు. అనీషా ఎన్జీవో ద్వారా వారికి సాయం చేయాలనుకుంది. ‘నేను రైతు కుటుంబం నుంచి రావడం, మా తాత చేసే వ్యవసాయాన్ని చూస్తూ పెరగడం నన్ను అటువైపు ఆలోచించేలా చేసింది. కర్ణాటకలో వర్షాధార ప్రాంతమైన ఛామరాజనగర్‌ జిల్లాలో వ్యవసాయ ఉత్పాదకత చాలా తక్కువ. ఆ జిల్లాలోని 22 గ్రామాల ప్రజలకు సేద్యంపై మావారు పళనియప్పన్‌తో కలిసి అవగాహన కల్పించాలనుకున్నా. ఆ గ్రామాల్లో పర్యటించి, అక్కడి వారు పాటించే వ్యవసాయ విధానాలను అధ్యయనం చేశా. రసాయన ఎరువులు, పురుగుమందుల సేద్యంతో నష్టాల్ని చవిచూసినట్లు చెప్పే వారు. కానీ నూతన పద్ధతులపై అక్కడి వారికి ఆసక్తి ఉండటాన్ని గుర్తించి, సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ ఇవ్వాలనుకున్నా. మావారు, నేనూ సమయం ఉన్నప్పుడల్లా బెంగళూరు నుంచి ఈ జిల్లాకు వచ్చి, ప్రతి గ్రామంలోనూ తిరిగే వాళ్లం. రసాయనాల వినియోగం ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం చూపెడుతుందో వివరించేవాళ్లం. సేంద్రియ ఎరువుల తయారీ, వినియోగాలను నేర్పించే వాళ్లం’ అని చెబుతుంది వల్లి. తను పదేళ్లకు పైగా అందించిన శిక్షణతో ఆ జిల్లా రైతులిప్పుడు చిరుధాన్యాలు, కూరగాయల సాగులో అధిక దిగుబడులు సాధిస్తూ లాభాలు అందుకుంటున్నారు.

విత్తనాల బ్యాంకు..

వీటితో పాటు నకిలీ విత్తనాలు మరో ప్రధాన సమస్య అన్నది అర్థం చేసుకుంది వల్లి. అందుకే దేశీయ విత్తనాలను సేకరించి మరతల్లి గ్రామంలోని సొంతభూమిలో వ్యవసాయం చేస్తున్నారు ఈ దంపతులు. పంట చేతికి వచ్చిన తర్వాత వాటిని విత్తనాలుగా తిరిగి రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ‘నకిలీ విత్తనాల సమస్యకు పరిష్కారంగా దేశీయ విత్తనాల బ్యాంకు ప్రారంభించాం. ఎవరైనా వీటిని ఉచితంగా తీసుకోవచ్చు. అయితే వాటితో పండించిన రైతు, తిరిగి ఈ బ్యాంకుకు కొన్ని విత్తనాలను అందించాలి. కూరగాయల రకాలను కూడా వృద్ధి చేస్తున్నాం. ప్రస్తుతం అనీషా సీడ్‌ బ్యాంకులో 300 రకాల చిరుధాన్యాలు, కూరగాయలు, పప్పు ధాన్యాల విత్తనాలను భద్రపరిచాం’ అని చెప్పుకొచ్చింది వల్లియమ్మాళ్‌.  

పెరటి తోటలు..

మహిళలను పెరటి తోట పెంపకంపై అనీషా ఎన్జీవో ప్రోత్సహిస్తోంది. దాంతో అక్కడి మహిళలంతా తమ కుటుంబం కోసం తామే కూరగాయలు పండించుకోవడం మొదలుపెట్టారు. అలాగే 23 పాఠశాలల్లో కిచెన్‌ గార్డెన్స్‌ పెంపకాన్ని ప్రారంభించేలా చేసిందీ ఎన్జీవో. అలా విద్యార్థుల సహకారంతో పండిస్తున్న కూరగాయలనే వారికి మధ్యాహ్నభోజనానికి వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మరో 30 పాఠశాలలతో ఈ ఎన్జీవో కలిసి పనిచేస్తోంది. వందల మంది రైతుల్ని నష్టాల బారి నుంచి బయట పడేయగలిగాం, వేల మంది సేంద్రియ ఆహారాన్ని పండించుకుని తినేలా చేయగలిగాం... ఈ స్ఫూర్తిని మరింత పెంచాలన్నది లక్ష్యం అంటోంది వల్లి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్