Updated : 08/08/2022 07:59 IST

ఈ యుద్ధంలో.. ఆమెదే గెలుపు!

చదరంగం అంటే ఓ రకంగా రణరంగమే. ప్రత్యర్థి వేసే ప్రతి అడుగునూ నిశితంగా పరిశీలిస్తూ ముందడుగు వేయాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఓడిపోవాల్సిందే. అయితే చూపు లేకపోయినా ఆ క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోంది 24 ఏళ్ల నటాషా మోరేల్స్‌. ఎన్నో ఆటంకాలను, అవమానాలనూ ఎదుర్కొంటూ ఈ స్థాయికి చేరిందామె.. చెస్‌ ఒలింపియాడ్‌లో పాల్గొనడానికి చెన్నై వచ్చిన ఆమె స్ఫూర్తి ప్రస్థానమిది...

టాషాకి ఎడమ కన్ను కనిపించదు. కుడికంటికి అస్పష్టంగా కనిపిస్తుంది. 12 ఏళ్ల వయసులో చదరంగంపై ప్రేమను పెంచుకుని, అదే తన ప్రపంచం అనుకుంది. ఇంట్లో ఎవరికీ ఈ ఆట రాకపోవడంతో స్నేహితులతో ఆడేది. కానీ కొద్దిగా కనిపించే ఆ కుడికన్నుతోనే బోర్డును తదేకంగా చూడటంతో విపరీతమైన తలనొప్పి, చికాకు వేధించేవి. అయినా చెస్‌ని మాత్రం వదలేదికాదు. ఆమె బాధని చూసిన అమ్మానాన్నలు.. బిడ్డ పరిస్థితిని తమ దేశమైన ప్యూర్టోరికో కరేబియన్‌ చెస్‌ సమాఖ్య సభ్యులకి వివరించారు. ఏదైనా పరిష్కారం చెప్పమని అడిగారు. నటాషా ఆసక్తి, ప్రతిభ చూసి వాళ్లూ ముచ్చటపడ్డారు. తనకోసం ప్రత్యేకంగా బ్రెయిలీ బోర్డును డిజైన్‌ చేస్తే శారీరక అసౌకర్యం తప్పుతుందని సలహా ఇచ్చారు. అలా బ్రెయిలీబోర్డు ఆమె జీవితాన్నీ, దేశ చెస్‌ రంగాన్నీ మలుపు తిప్పింది.

బ్రెయిలీ బోర్డులో ఆడేస్తూ...

మొదట్లో నటాషాకి కనిపించదనీ, అలాంటి అమ్మాయితో ఆడటం తమకి అవమానమనీ చాలా మంది ఆమెతో పోటీపడటానికే నిరాకరించేవారు. ప్రత్యేక బ్రెయిలీ చెస్‌ బోర్డును డిజైన్‌ చేయించుకున్న తర్వాతా కొందరు ఆటగాళ్లు ఇలానే అనే వారు. ఈ విషయాన్ని చెస్‌ సమాఖ్య తీవ్రంగా పరిగణించింది. చెస్‌ ఆడటం ఆమె హక్కు అంటూ ఆటగాళ్లను మందలించింది. నటాషా కూడా వెనక్కి తగ్గలేదు. ప్రత్యర్థుల్ని ఏ బోర్డులో అయినా ఆడనివ్వండి. నేను సిద్ధం అంటూ ఓ ప్రత్యేక ప్రణాళిక వేసుకుంది. ఎదుటివారు సాధారణ బోర్డులో ఆడుతుంటే... తను బ్రెయిలీ బోర్డులో ఆడేది. ఆ ఎత్తులను సాధారణ బోర్డులో చూపించేందుకు ఓ సహాయకుడిని పెట్టుకుంది. ఇదంతా జరగడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది కాబట్టి చాలా వేగంగా ఆడటం సాధన చేసింది. ఆమె వేగానికి మహామహా ఆటగాళ్లే తలవంచక తప్పలేదు. అతి తక్కువ కాలంలోనే తన అసాధారణ నైపుణ్యాలతో అంతర్జాతీయ టోర్నీల స్థాయికి చేరుకుంది. 2015లో మహిళా ఇంటర్నేషనల్‌ మాస్టర్‌గా ఎదిగింది. అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడె) నిర్ణయించిన స్టాండర్డ్‌, ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ ఫార్మాట్లలోనూ జోరును కొనసాగించింది. ఫిడె నిర్వహించిన టోర్నీల్లో 478 మ్యాచ్‌లు ఆడితే.. 222 మ్యాచ్‌ల్లో గెలిచింది. 108 మ్యాచ్‌ల్ని డ్రాగా ముగించింది. తన 3వ ఒలింపియాడ్‌ అయిన చెన్నై చెస్‌ ఒలింపియాడ్‌లోనూ ఇప్పటిదాకా ఒక మ్యాచ్‌లో గెలిచి, రెండు మ్యాచుల్ని డ్రాగా ముగించింది.

వివక్షపై గెలిచింది...

‘ఆటలో గెలుపు ఓటములు సహజం. కానీ ఆడకుండానే... మా ఓటమిని నిర్ణయించడం ఎంత వరకూ సమంజసం? ఇది కచ్చితంగా వివక్షే. ఈ వివక్షని నాలాంటి ఎంతోమంది ఎదుర్కొంటున్నారు. వారికి ఓ దారి చూపించాలనుకున్నా’ అనే నటాషా ప్యూర్టోరికోలో టాప్‌-2 క్రీడాకారిణిగా ఎదిగింది. తన లాంటి చెస్‌ క్రీడాకారులకు శిక్షకురాలిగా మారింది. 2018 నుంచి అంతర్జాతీయ చెస్‌ మ్యాచ్‌లు నిర్వహించే ‘చెస్‌ ఆర్బిటర్‌’ హోదానీ సొంతం చేసుకుని.. జాతీయస్థాయి చెస్‌టోర్నీల్ని నిర్వహిస్తోంది. మహిళల్ని ప్రోత్సహించేందుకు మహిళా వ్యవహారాల డైరెక్టర్‌గా పనిచేస్తోంది. ‘చెస్‌లో స్టార్‌ క్రీడాకారిణిగా ఎదిగేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఫిడె తోడ్పాటు ఇవ్వకుంటే ఈ స్థాయికి వచ్చేదాన్నే కాదు. పాఠశాల స్థాయి నుంచే చెస్‌ని భాగం చేస్తూ ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే ఎంతోమంది అమ్మాయిలు చెస్‌లోకి రావడానికీ, రాణించడానికీ అవకాశం ఉంది’ అంటోంది నటాషా. కొవిడ్‌ తర్వాత ఆన్‌లైన్‌లో ఆడుతూ... తనలా చూపు తక్కువున్న వారిని ఏకం చేసి ఓ కమ్యూనిటీని ఏర్పాటు చేసి ముందుకు    తీసుకెళ్తోంది.

- హిదాయతుల్లాహ్‌.బి, చెన్నై


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని