ఎర్రకోటపైనా మా జెండానే ఎగరాలని!

దేశంకోసం సర్వం త్యాగం చేసిన వాళ్ల గురించి విన్నప్పుడు పాతతరం వాళ్లు కాబట్టి చేశారు కానీ ఇప్పటి వాళ్లకి అసాధ్యం అనేస్తాం! కానీ మన జాతీయ జెండా కోసం చేస్తున్న ఉద్యోగాన్నీ, ఉన్న ఇంటినీ వదులుకున్నారామె. తెలంగాణాతోపాటు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో భారీ జెండాలను నిర్వహిస్తున్న బొజ్జ పద్మావతి స్ఫూర్తి కథనమిది... 

Updated : 09 Aug 2022 06:47 IST

దేశంకోసం సర్వం త్యాగం చేసిన వాళ్ల గురించి విన్నప్పుడు పాతతరం వాళ్లు కాబట్టి చేశారు కానీ ఇప్పటి వాళ్లకి అసాధ్యం అనేస్తాం! కానీ మన జాతీయ జెండా కోసం చేస్తున్న ఉద్యోగాన్నీ, ఉన్న ఇంటినీ వదులుకున్నారామె. తెలంగాణాతోపాటు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో భారీ జెండాలను నిర్వహిస్తున్న బొజ్జ పద్మావతి స్ఫూర్తి కథనమిది... 

గిరే మువ్వన్నెల జెండాని చూస్తేనే మనసులో దేశభక్తి ఉప్పొంగుతుంది. అందుకే జెండా సాయంతో ఆ జాతీయ భావాన్ని దేశమంతా విస్తరింపచేయాలన్నది పద్మావతి కల.  ఆమె స్వస్థలం ఖమ్మం. భర్త కంభంపాటి సంజీవరావు. ఇద్దరూ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ)లో పనిచేసేవారు. సంజీవరావు డీఆర్‌డీఏలో అదనపు ప్రాజెక్టు డైరక్టర్‌గా పనిచేస్తే.. ఆమెది సూపరింటెండెంట్‌ హోదా! ఇద్దరికీ జాతీయ జెండా అంటే ప్రాణం. జెండాపై పరిశోధనలకోసం దేశదేశాలు చుట్టొచ్చారు. అనేక దేశాల జెండాలను సొంతంగా తయారుచేశారు. కానీ వాటన్నింటినీ మించి పోయేలా మువ్వన్నెల జెండాని తయారుచేయాలన్న లక్ష్యం పెట్టుకున్నారు. అనుకున్నట్టుగానే ఏడేళ్లక్రితం తెలంగాణలో ట్యాంక్‌బండ్‌పై భారీ మువ్వన్నెల జాతీయ జెండాను రూపొందించి, తన కల నేరవేర్చుకున్నారు. ఇప్పటికీ విజయవంతంగా నిర్వహణ బాధ్యల్ని చూస్తూ శభాష్‌ అనిపించుకుంటున్నారు.

దిల్లీ, ముంబయి, కోల్‌కతాల్లో మాత్రమే జెండాల తయారీ సంస్థలుండగా.. దక్షిణాదిన ఫ్లాగ్స్‌ అండ్‌ పోల్స్‌ అనే సంస్థను స్థాపించి జెండాలను రూపొందిస్తున్నారు పద్మావతి. ఇందుకోసం ఉద్యోగాన్ని కూడా వదులుకున్నారామె. ‘జెండాని రూపొందించినంత సులువు కాదు.. దాన్ని నిర్వహించడం. దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో పెద్ద జెండాలను ఏర్పాటు చేసినా వాటిని నిర్వహించలేరు. కారణం.. వాటికి కొన్ని నిబంధనలు ఉంటాయి. సమయానికి ఎగరేయడం, దించడంతోపాటు... రాత్రి పూట కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయడానికి మనుషులు, నిధులు కావాలి. అందుకే చాలాచోట్ల సైజుని తగ్గిస్తుంటారు. కానీ మేం గత ఏడేళ్లుగా ఎలాంటి సమస్యా లేకుండా ట్యాంక్‌బండ్‌పై ఉన్న జెండాని నిర్వహిస్తున్నాం. మా నిర్వహణ సామర్థ్యం బాగుండటంతో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక ప్రభుత్వాలు కోరిక మేరకు ఆయా రాష్ట్రాల్లోని జాతీయ జెండాలను కూడా మేం నిర్వహిస్తున్నాం. ఖమ్మంలో మాకో  తయారీ కేంద్రం ఉంది. ఇక్కడ మహిళల ఆధ్వర్యంలో భారీ పతాకాలని రూపొందిస్తాం. మన రాష్ట్రంలోనూ గద్వాల్‌, సత్తుపల్లి, ఖమ్మం, సిద్దిపేట, నాగోలు, హబ్సీగూడ, తార్నాక, లింగంపల్లిలో 100 అడుగుల ఎత్తైన జెండాలని నిర్వహిస్తున్నాం. ఈ స్వతంత్య్ర దినోత్సవానికి షాద్‌నగర్‌లోని ఇస్రో కార్యాలయం, నల్గొండతో పాటు మంచిర్యాలల్లోనూ భారీ జెండాలను రూపొందిస్తున్నాం.’ అని వివరించారు పద్మావతి.

సొంతింటిని అమ్ముకొని..

త్రివర్ణ పతాకాల రూపకల్పనతోపాటు, ప్రపంచలోని 200 దేశాలకు చెందిన జెండాల విశిష్టతలను తెలుపుతూ తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో 500లకు పైగా అవగాహన సదస్సులు నిర్వహించారామె. ఈ క్రమంలో పద్మావతి దంపతులు ఖమ్మంలోని తమ సొంత ఇంటిని అమ్మేశారు. ఆ ఇంటికి సమీపంలోనే మరో ఇంటిని అద్దెకు తీసుకుని ప్రస్తుతం తయారీ కేంద్రాన్ని నడుపుతున్నారు. అక్కడ 12మంది మహిళలు పనిచేస్తారు. పని పెరిగితే మరింతమంది మహిళలకు ఉపాది కల్పించే అవకాశముందని అంటారు పద్మావతి. హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌లో ఓ అపార్టుమెంటులో అద్దెకుంటూ అక్కడినుంచే సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. తల్లి ఆశయాలు అర్థం చేసుకున్న కొడుకులు శ్రీకాంత్‌, గౌతమ్‌తోపాటు కోడలు స్నిగ్ధ కూడా తాము చేస్తున్న ఐటీ ఉద్యోగాలని వదులుకుని ఆమె బాధ్యతల్లో పాలుపంచుకుంటున్నారు. ‘భవిష్యత్తులో పార్లమెంటుతోపాటు, ఎర్రకోటపైనా మేం రూపొందించిన జెండానే ఎగరేయాలన్నది మా కల. త్రివర్ణ పతాకమంటే నేను గుర్తుకురావాలి’ అంటారు పద్మావతి.

- మేకల గణేష్‌, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్