ఆ రాకుమారి త్యాగం... మన ఆరోగ్యం... హక్కులు!
భారతదేశం నుంచి లండన్ వెళ్లి... ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకున్న రాకుమారామె! ఎక్కడా వెనక్కి తగ్గేదే లేదనే మనస్తత్వం. స్కూల్లో హెడ్‌గర్ల్. క్రికెట్ టీమ్‌కి కెప్టెన్. కానీ మనసంతా భారతీయం. అందుకే రాజభోగాలని కాదనుకుని.. భారతీయుల స్వేచ్ఛ కోసం, ఇక్కడి స్త్రీల హక్కుల కోసం పోరాడింది. దిల్లీ ఎయిమ్స్‌కి ప్రాణం పోసిన
భారతదేశం నుంచి లండన్ వెళ్లి... ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకున్న రాకుమారామె! ఎక్కడా వెనక్కి తగ్గేదే లేదనే మనస్తత్వం. స్కూల్లో హెడ్‌గర్ల్. క్రికెట్ టీమ్‌కి కెప్టెన్. కానీ మనసంతా భారతీయం. అందుకే రాజభోగాలని కాదనుకుని.. భారతీయుల స్వేచ్ఛ కోసం, ఇక్కడి స్త్రీల హక్కుల కోసం పోరాడింది. దిల్లీ ఎయిమ్స్‌కి ప్రాణం పోసిన ఆమె మరెవరో కాదు రాజకుమారి అమృత్‌కౌర్...
కపుర్తలా రాజవంశానికి చెందిన రాజా హర్నామ్‌సింగ్‌కి తొమ్మిదిమంది అబ్బాయిల తర్వాత పుట్టింది అమృత్‌కౌర్. గారాలపట్టి. ఆమె పుట్టడానికి ముందే హర్నామ్ క్రైస్తవాన్ని స్వీకరించాడు. ఆ ప్రభావంతోనే కూతుర్ని లండన్ పంపించి చదివించాడు. ఆమె చదువుతోపాటు.. ఆటపాటల్లోనూ ముందుండేది. స్కూల్ హెడ్‌గర్ల్. క్రికెట్, హాకీ టీమ్‌లకి కెప్టెన్‌గా, టెన్నిస్ క్రీడాకారిణిగా ఎంతో పేరు, ప్రఖ్యాతులు సంపాదించింది. డిగ్రీ ఆక్స్‌ఫర్డ్‌లో చేసింది. చిన్నతనం నుంచీ ఆంగ్లేయుల మధ్యే పెరిగినా.. మాతృదేశంపై ఆమె ప్రేమను బలపరిచిన సంఘటన... జలియన్ వాలాబాగ్ దుర్ఘటన. ఆ ఘటన తర్వాత దేశంకోసం సర్వం వదులుకోవడానికి సిద్ధపడ్డారామె. రాజభోగాలకన్నా గాంధీ విలువలే గొప్పవనుకున్నారు. కానీ ఆ మార్గంలో నడవడం తండ్రికి ఇష్టం లేదని కొన్నేళ్లు ఇంటికే పరిమితమయ్యారు. అలాగని ఖాళీగా ఉండలేదు. ఆ సమయంలో స్త్రీల హక్కుల కోసం ఉద్యమించారు. పరదా పద్ధతిని, దేవదాసీ విధానాలనీ, బాల్య వివాహాలనీ వ్యతిరేకిస్తూ... మహిళల్లో చైతన్యం తీసుకురావడం మొదలుపెట్టారు. తండ్రి చనిపోయిన తర్వాత రాజ ప్రాసాదాలని, ఆ సౌకర్యాలని పూర్తిగా వదిలేసి గాంధీజీకి సెక్రటరీగా మారి 17 సంవత్సరాలపాటు పనిచేశారు. క్విట్ ఇండియా, దండి ఉద్యమాల్లో పాల్గొని జైలు జీవితాన్ని గడిపారు. స్వతంత్ర భారతావనికి తొలి ఆరోగ్యశాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. క్రీడాశాఖనూ చూశారు. వైద్యవిద్యను చదువుకొనే పిల్లలు.. పైచదువులకోసం పరాయి దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదంటూ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)కి ప్రాణం పోశారు. ఎన్నో ప్రాణాలని పొట్టన పెట్టుకుంటున్న మలేరియా, టీబీలని నిలువరించడం కోసం పెద్దఎత్తున ఉద్యమించారు. సిమ్లాలోని తన రాజభవంతిని ఎయిమ్స్‌లో పనిచేసే నర్సుల కోసం ఇచ్చేశారు. రెడ్‌క్రాస్ సొసైటీకి ఛైర్‌పర్సన్‌గా పద్నాలుగేళ్లపాటు సేవలందించారు. వరల్డ్ హెల్త్ అసెంబ్లీకి ప్రెసిడెంట్‌గా పనిచేసిన తొలి ఆసియా మహిళ కూడా అమృత్‌కౌరే. అమ్మాయిల్లో క్రీడాస్ఫూర్తినీ పెంచిన ఈ రాజకుమారిని టైమ్ పత్రిక రెండేళ్ల క్రితం 100 ఉమెన్ ఆఫ్‌ది ఇయర్ సంచికపై ముఖచిత్రంగా ప్రచురించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.