వెదురు రాఖీలు.. విదేశాలకూ పంపిస్తోంది!

వెదురుతో చిన్నచిన్న బొమ్మలు చేసే ఆమె సృజనాత్మకతకు ఆధునికత జోడించి వ్యాపారంలో రాణించింది. దాంతో ‘నారీశక్తి’ పురస్కారానికి ఎంపికైంది. ఈమె రూపొందిస్తున్న వెదురు రాఖీలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.

Updated : 10 Aug 2022 09:03 IST

వెదురుతో చిన్నచిన్న బొమ్మలు చేసే ఆమె సృజనాత్మకతకు ఆధునికత జోడించి వ్యాపారంలో రాణించింది. దాంతో ‘నారీశక్తి’ పురస్కారానికి ఎంపికైంది. ఈమె రూపొందిస్తున్న వెదురు రాఖీలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ‘వెదురు మహిళ’గా నిలిచి, తోటి మహిళలకు సాధికారత కల్పిస్తున్న మీనాక్షి వాల్కే స్ఫూర్తి కథనమిది. 

ల్లిదండ్రులిద్దరూ కూలీలుగా పనిచేసి తెచ్చే ఆదాయమే ఆ కుటుంబాన్ని ఆకలి నుంచి తప్పించేది. అటువంటి నిరుపేద కుటుంబంలో పుట్టిన మహారాష్ట్రకు చెందిన మీనాక్షికి ఉన్నత చదువు చదవాలని కల. సివిల్‌ ఇంజినీర్‌ అవ్వాలనే లక్ష్యంతో ఇంటర్‌లో మంచి మార్కులు సాధించి ప్రభుత్వ కాలేజీలో సీటు సంపాదించింది కూడా. అయితే మిగిలిన ఖర్చులూ తమవల్ల కాదన్నారామె తల్లిదండ్రులు. అక్కడితో ఆమె కల ఆగిపోయింది. 22వ ఏట ముఖేష్‌ వాల్కేతో వివాహమై, ఏడాదికే ఓ బాబు పుట్టాడు. ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో వెదురుతో చిన్నచిన్న బొమ్మలు చేసేది మీనాక్షి. చుట్టుపక్కలవాళ్లు వాటిని కొనేవారు. రకరకాల వెదురు ఉత్పత్తుల తయారీ నేర్చుకుంటూ, భర్తకు ఆర్థికంగా చేయూతనందించేది.

కుంగుబాటు మర్చిపోవాలని..

పెళ్లైన మూడేళ్లకు పాప కడుపులో పడి, అంతా సంతోషంగా సాగిపోతున్న సమయంలో అనుకోని సంఘటనతో తీవ్ర కుంగుబాటుకు గురైంది. ‘నేను ఏడో నెల గర్భిణిగా ఉన్నప్పుడు అబార్షన్‌ అయ్యింది. కారణాలు తెలియలేదు. మానసికంగా తీవ్రవేదనకు గురైన నన్ను, అత్తామామలు మాటలతో బాధపెట్టేవారు. ఆ విమర్శలు తట్టుకోలేక పోయేదాన్ని. ఆ బాధలో వెదురుతో కళాకృతులు చేయడమూ మానేశా. నా పరిస్థితిని గమనించి తిరిగి ఆ ఉత్పత్తులను తయారుచేస్తే సమస్యలన్నీ మర్చిపోతావంటూ ప్రోత్సహించారు మావారు. అదే సమయంలో మేం ఉండే చంద్రాపుర్‌లోని ‘బ్యాంబూ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌(బీఆర్టీసీ)’లో వెదురు ఉత్పత్తుల తయారీపై శిక్షణాకార్యక్రమం మొదలైతే చేర్పించారు. ఆ శిక్షణ తర్వాత నాగ్‌పుర్‌లో ప్రత్యేకంగా మరికొన్ని నైపుణ్యాలను నేర్చుకున్నా. సాంకేతికతపై అవగాహన తెచ్చుకున్నా. అప్పటివరకు వెదురుతో పరిమితంగా ఉత్పత్తులు తయారుచేసిన నాకు ఈ శిక్షణ తర్వాత మరెన్నో అద్భుతాలు చేయాలనిపించింది. మా బాబు పేరుతో ఆన్‌లైన్‌లో 2018లో ‘అభిసార్‌ ఇన్నోవేటివ్స్‌’ను ప్రారంభించా. బ్యాంబూ ల్యాంప్స్‌, బాస్కెట్స్‌, ట్రేలు వంటి గృహోపకరణాలు, నగలు, రాఖీలు తయారుచేసేదాన్ని. ఈ విషయంలో మావారి నుంచి పూర్తి సహకారం ఉండేది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆర్డర్లు వచ్చేవి. మొదటిసారి దిల్లీ నుంచి రూ.2000 ఉత్పత్తులకు ఆర్డరు రావడం సంతోషాన్నిచ్చింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా మా ఉత్పత్తులకు ఆర్డర్లు పెరిగాయి’ అని చెబుతున్న మీనాక్షి నాగ్‌పుర్‌లో జరిగిన స్టార్టప్‌ల ప్రదర్శనలో పోటీ చేయగా, ‘అభిసార్‌ ఇన్నోవేటివ్స్‌’ టాప్‌-20లో ఒకటిగా నిలిచింది. 2018లో ‘నారీ శక్తి’ పురస్కారం అందుకుంది. 

వెదురు కిరీటాలు..

ఓ అందాలపోటీ నిర్వాహకులు పోటీదారులకు వెదురు కిరీటాలను అలంకరించాలనుకున్నారు. మీనాక్షి గురించి తెలుసుకున్నారు. ‘వెదురుతో మొత్తం 16 కిరీటాలను తయారుచేయించారు. అంతేకాదు, ఆ పోటీకి నన్ను పిలిచి గౌరవించడం మరిచిపోలేను. ఆ తర్వాత నాకు బాగా గుర్తింపు వచ్చింది. గృహోపకరణాలే కాకుండా క్యూఆర్‌ కోడ్‌ స్కానర్స్‌, క్యాలెండర్లు, ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్స్‌, రకరకాల రాఖీల తయారీ ప్రారంభించా. ఎకో ఫ్రెండ్లీ బ్యాంబూ రాఖీలకు క్రమేపీ మంచి గుర్తింపు సంపాదించగలిగా. మన దేశంలోనే కాకుండా జపాన్‌, ఇంగ్లాండ్‌ తదితర దేశాలకూ ఈ రాఖీలు ఎగుమతి చేస్తున్నాం. గతేడాది రాఖీ పండుగకు 10వేల రాఖీలు విక్రయించాం’ అని అంటున్న మీనాక్షి వందలమంది మహిళలకు సాధికారతను కల్పిస్తోంది. రూ.50 పెట్టుబడితో మొదలుపెట్టి, లక్షల రూపాయల ఆదాయాన్ని పొందుతున్న ఈమెను గతేడాది ఇండో-కెనడియన్‌ ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌ సొసైటీ ‘ది ఉమెన్‌ హీరో’ అవార్డుతో గౌరవించడం విశేషం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్