పట్టుపట్టారు... ఇలా సాధించారు!

మెడిసిన్‌, ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌... ఈతరం ఎక్కువగా ఇష్టపడే రంగాలు. వీరు మాత్రం వాటికి భిన్నంగా మహిళలు తక్కువగా కనిపించే న్యాయవ్యవస్థలో అడుగుపెట్టాలనుకున్నారు. క్లిష్టమైన చట్టాలూ, సెక్షన్లను ఇష్టంగా తెలుసుకున్నారు. ఆపైన న్యాయమూర్తిగా మారాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ జ్యుడీషియల్‌ పరీక్షలు (సివిల్‌ జడ్జ్‌) రాసి విజయం సాధించారు.

Updated : 11 Aug 2022 07:53 IST

మెడిసిన్‌, ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌... ఈతరం ఎక్కువగా ఇష్టపడే రంగాలు. వీరు మాత్రం వాటికి భిన్నంగా మహిళలు తక్కువగా కనిపించే న్యాయవ్యవస్థలో అడుగుపెట్టాలనుకున్నారు. క్లిష్టమైన చట్టాలూ, సెక్షన్లను ఇష్టంగా తెలుసుకున్నారు. ఆపైన న్యాయమూర్తిగా మారాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ జ్యుడీషియల్‌ పరీక్షలు (సివిల్‌ జడ్జ్‌) రాసి విజయం సాధించారు. ఈ పరీక్షల్లో మరో విశేషమూ ఉంది... విజేతల్లో అధిక సంఖ్యాకులు అమ్మాయిలే. పదవీ నియామక ఉత్తర్వులు అందుకున్న కొందరితో వసుంధర మాట్లాడినప్పుడు పంచుకున్న స్ఫూర్తిగాథలివీ...


వాళ్ల బాటలో నేనూ..

పిల్లలు చదువు మొదలుపెట్టాక తనూ కెరియర్‌ దిశగా అడుగులు వేశారు.. యువతతో పోటీ పడుతూ 16వ ర్యాంకు సాధించి 40 ఏళ్ల వయసులో న్యాయమూర్తిగా ఎంపికయ్యారు శ్రీదేవి. పుట్టింది ప్రకాశం జిల్లా. తండ్రి వృత్తిరీత్యా నల్గొండలో చాన్నాళ్లున్నారు. ఇంటర్‌ వరకూ అక్కడే చదివారు. తర్వాత పెళ్లి, ఇల్లు, పిల్లలు.. వీటితోనే సరిపోయింది. కానీ అన్నయ్య, చెల్లి, బంధువుల్లో తన తోటివాళ్లంతా బాగా చదువుకున్నారు. తనూ వాళ్ల బాటలో నడవాలనుకున్నారు. ‘పిల్లలు స్కూల్‌కి వెళ్లడం మొదలుపెట్టాక.. పదేళ్ల తర్వాత 2010లో దూరవిద్య ద్వారా బీఏలో చేరా. నాన్నని చూసి న్యాయవృత్తి ద్వారా ఎందరికి న్యాయం చేయొచ్చో అర్థమయ్యాక లా చదవాలనుకున్నా. అందుకే ఎల్‌ఎల్‌బీ చేసి కూకట్‌పల్లి కోర్టులో అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా చేరా. మొదట్నుంచీ నాకు న్యాయమూర్తి కావాలనే కోరిక. నా పదేళ్ల శ్రమ ఫలితంగా పెనుగొండలో జడ్జి పోస్టింగ్‌ వచ్చింది. మావారు విష్ణు మొలకల లక్ష్మీ శివప్రసాద్‌ (వ్యాపారి), కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఇది సాధించగలిగా. వాళ్లెప్పుడూ నాకు చెప్పిందొకటే.. ‘న్యాయం కోసం ఎవరి ముందూ తలొంచొద్దు’ అని. మా పిల్లల స్నేహితులు ఇంటికొచ్చినా ‘అమ్మ చదువుకుంటోంది’ అంటూ గోల చేయకుండా ఆడుకునేవారు. పట్టుదల, కుటుంబ ప్రోత్సాహం ఉంటే వయసు అడ్డంకి కాదు’ అంటున్నారు శ్రీదేవి.


నాకు నేనే.. ధైర్యం చెప్పుకొని...

సొంతూరు మహబూబ్‌నగర్‌. నాన్న ప్రభాకర్‌ మల్కాజ్‌గిరి మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌. అమ్మ నిర్మల గృహిణి. ఇంట్లో ఎప్పుడూ చట్టాలూ, కేసుల చర్చలే. అవి వింటూ న్యాయవ్యవస్థపైన ఆసక్తి పెంచుకుంది. హైదరాబాద్‌లోని సింబయోసిస్‌ యూనివర్సిటీ నుంచి డ్యూయల్‌ డిగ్రీ (బీబీఏ, ఎల్‌ఎల్‌బీ) చేసింది. ‘డిగ్రీ 2020లో పూర్తయింది. కొన్నాళ్లు ప్రాక్టీసు చేద్దామనుకున్నా. ఆ లోపు ఏపీలో నోటిఫికేషన్‌ వచ్చింది. దీని కోసం కోచింగ్‌ తీసుకున్నా. ఆ గైడెన్స్‌తోపాటు నాదైన పంథాని ఎంచుకుని కష్టపడ్డా. ఓవైపు కొవిడ్‌ వార్తలు ఎక్కువగా ఉన్నా, ఏకాగ్రత చెదరకుండా కష్టపడ్డా. పరీక్షలకి టెన్షన్‌ పడలేదు. అదీ విజయానికో కారణం. మొదటి ప్రయత్నంలోనే సర్వీసు రావాలన్న పట్టుదలతో చదివా. నాకు స్టేజ్‌ ఫియర్‌.. అయినా, నాకు నేనే ధైర్యం చెప్పుకొన్నా. ఇంటర్వ్యూ బాగా చేశా’ అంటోంది 23 ఏళ్ల అర్చన. తను త్వరలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌ఎమ్‌ కూడా పూర్తి చేయనుంది. ‘అవగాహన లేకపోవడంతో ఇటువైపు అమ్మాయిలు రావడంలేదు. నేను ఎంపికయ్యాక చాలామంది సంప్రదిస్తున్నారు. ఎదుగుదలకు ఈ రంగంలో మంచి అవకాశాలు ఉంటాయి. ఎవరైనా ధైర్యంగా రావొచ్చు’ అని సలహా ఇచ్చే అర్చన నంద్యాలలో బాధ్యతలు తీసుకోనుంది. 


ఆయన తెలుగు నేర్పించారు...

నిఖిత సెంగార్‌ అంతకుముందు ఉత్తర్‌ప్రదేశ్‌లో సివిల్‌ జడ్జి. అయితే తెలుగు నేర్చుకుని మరీ ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షలు రాసి తిరిగి జడ్జీగా ఎంపికవ్వడం వెనుక ఆసక్తికరమైన కథే ఉంది... నిఖిత పుణెలో ‘లా’ చేశారు. సివిల్‌ సర్వీసుల్లో చేరాలన్నది ఆమె కల. 2018లో.. జ్యుడీషియల్‌ సర్వీస్‌ పరీక్షలు రాస్తే సొంత రాష్ట్రం యూపీలో న్యాయమూర్తిగా ఉద్యోగం వచ్చింది. గతేడాదే తనకు పెళ్లి అయింది. భర్త తుహిన్‌ సిన్హా  ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌ ఐపీఎస్‌. దాంతో నిఖిత ఏపీకి రావాలనుకున్నారు. అందుకే తెలుగు నేర్చుకున్నారు. ‘రెండున్నరేళ్లు హర్దోయిలో జడ్జిగా పనిచేశా. పెళ్లయ్యాక ఏపీ వచ్చేయాలనుకున్నా. ప్రజలకు మేలు చేసే ఈ ఉద్యోగాన్ని వదులుకోవడం ఇష్టం లేదు. అందుకే ఇక్కడ పరీక్షలు రాశా. ఇందులో ఒక తెలుగు పేపర్‌ ఉంటుంది. యూట్యూబ్‌లో చూసీ, పుస్తకాల ద్వారా... మావారి సాయంతో తెలుగు నేర్చుకున్నా. నాలుగో ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది. వైజాగ్‌లో పోస్టింగ్‌ వచ్చింది’ అంటూ వివరించారు నిఖిత.


నాన్న కల నిజం చేశా!

‘ఇది నా కలే కాదు.. నాన్న కల కూడా’ అంటోంది రెండో ర్యాంకు సాధించిన వేముగంటి తరణి. ఆమె తండ్రి రఘురామారావు ఉస్మానియా యూనివర్సిటీలో సూపరింటెండెంట్‌. ‘ప్రజలకు సేవ చేసే పబ్లిక్‌ సర్వీసులోకి వెళ్లాలని నాన్నకు, తాతయ్యకు కూడా కోరిక. అక్క ఇంజినీర్‌. నేను లా ఎంచుకున్నా. పుట్టి, పెరిగింది.. హైదరాబాద్‌లోనే. ఉస్మానియాలో బీఏ ఎల్‌ఎల్‌బీ చేశా. ఇష్టంతో మొదలుపెట్టినా.. తర్వాత్తర్వాత అభిమానం పెరుగుతూ వచ్చింది. ఐదేళ్ల ఈ కోర్సులో టాపర్‌ని కూడా. బంగారు పతకానికి అర్హత సాధించినా కొవిడ్‌ వల్ల హాజరు కాలేకపోయాను. తర్వాత నల్సార్‌ విశ్వవిద్యాలయంలో పబ్లిక్‌ లా అండ్‌ లీగల్‌ థియరీలో పీజీ చేశాను. ఆర్మీలోకి లేదా పబ్లిక్‌ సర్వీసులు రాసేందుకు ఉపయోగపడుతుందని అనుకున్నాను. ఈలోపు ఏపీ జ్యుడీషియల్‌ సర్వీస్‌ పరీక్షలు రాశాను. కర్నూలు జిల్లా ఆలూరులో పోస్టింగ్‌. నా విజయానికి నాకంటే ఎక్కువగా నాన్న, అమ్మ శ్రీజాత, ఉస్మానియాలో నా జూనియర్లూ ఎక్కువగా సంబరాలు చేసుకుంటున్నారు. నా జూనియర్లకి స్ఫూర్తిగా ఉండటం సంతోషంగా అనిపిస్తోంది.


మహిళలదే హవా..

ఏపీ ప్రభుత్వం నిర్వహించిన ఈ పరీక్షలో 52 మంది ఎంపికైతే వారిలో 32 మంది అమ్మాయిలే. టాప్‌-10లో ఏడుగురు మహిళలే. మొత్తంమీద పాతికేళ్లకే ఏడుగురు ఈ ఘనత సాధించగా... 30-40 మధ్య వయసు వారు 15 మంది. వీరంతా ఓవైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే లక్ష్యాన్ని చేధించారు!

సహకారం: రాజోలి శ్యాంబాబు, అమరావతి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్