రాణీ చెన్నమ్మ... కిత్తూరు లక్ష్మీబాయి!

ఒకవైపు వేల సంఖ్యలో బ్రిటిష్‌ సైన్యం.. మరోవైపు వందల్లో కిత్తూరు సైనికులు. ఆ పోరుపై నాడు దేశమంతటా ఆసక్తికర చర్చ. గంటల వ్యవధిలోనే నలిపేస్తామని ప్రగల్భాలు పలికిన ఆంగ్లేయులు... ఘోరంగా ఓడిపోయారు. ఈ యుద్ధంలో కిత్తూరు సైన్యానికి నాయకత్వం వహించారు రాణి చెన్నమ్మ.

Published : 11 Aug 2022 00:48 IST

ఒకవైపు వేల సంఖ్యలో బ్రిటిష్‌ సైన్యం.. మరోవైపు వందల్లో కిత్తూరు సైనికులు. ఆ పోరుపై నాడు దేశమంతటా ఆసక్తికర చర్చ. గంటల వ్యవధిలోనే నలిపేస్తామని ప్రగల్భాలు పలికిన ఆంగ్లేయులు... ఘోరంగా ఓడిపోయారు. ఈ యుద్ధంలో కిత్తూరు సైన్యానికి నాయకత్వం వహించారు రాణి చెన్నమ్మ.

ర్ణాటకలోని బెలగావి జిల్లా కిత్తూరు సంస్థానాన్ని 17, 18 శతాబ్దాల్లో లింగాయత్‌ దేశాయ్‌ వంశస్థులు పాలించారు. సంస్థానాధీశుడు మల్ల సర్జా భూపతి కాలంలో మరాఠా రాజ్యంతో సత్సంబంధాలు ఉండేవి. దాంతో టిప్పుసుల్తాన్‌ ఆయన్ని 1785లో బందీగా పట్టుకెళ్లగా ఆయన భార్య రుద్రమ్మ మంత్రాంగం నెరపి విడుదల చేయించింది. అనంతరం ఆయన బ్రిటిషర్లతో స్నేహాన్ని కొనసాగించాడు. మరాఠా పీష్వాలతో వైరం పెరగడంతో సమీప కాకతి సంస్థానాధీశుడితో మైత్రికి ప్రయత్నించి ఆయన కూతురు 15 ఏళ్ల చెన్నమ్మను రెండో పెళ్లి చేసుకున్నాడు. 1778లో పుట్టిన చెన్నమ్మ చిన్నవయసులోనే కత్తి సాము, గుర్రపు స్వారీ నేర్చుకుంది. మల్ల సర్జా, రుద్రమ్మలకు శివలింగ పుట్టాడు. చెన్నమ్మకూ కుమారుడు పుట్టాడు. తన ఆంతరంగీకుల మోసంతో మల్ల సర్జా 1816లో పీష్వాల చేతిలో హతమయ్యాడు. ఆ విషాదంతో రుద్రమ్మ కూడా మృతి చెందింది.

శివలింగకు పట్టాభిషేకం చేసి పాలనలో చేదోడుగా ఉండేది చెన్నమ్మ. అనూహ్యంగా 1824లో శివలింగ, చెన్నమ్మ కొడుకు రోజుల వ్యవధిలోనే అనారోగ్యంతో కన్ను మూశారు. తన మరణానికి ముందే ఓ బాలుణ్ని శివలింగ దత్తత తీసుకున్నా.. అది చెల్లదని ధార్వాడ్‌లో బ్రిటిషర్ల రాజకీయ సలహాదారు జాన్‌ థాకరే స్పష్టం చేశాడు. సంస్థానంలోని రూ.16 లక్షల నగదు, భారీగా ఉన్న నగలను అప్పగించాలని హుకుం జారీ చేశాడు. తమ సంస్థానాన్ని కబళించడం సరికాదని చెన్నమ్మ విన్నవించినా ఆంగ్లేయులు వినలేదు. దాంతో... ‘అసలు మా రాజ్యాలకు వారసులను నిర్ణయించడానికి మీరెవర’ంటూ చెన్నమ్మ ఎదురు తిరిగింది. ఫలితంగా థాకరే 1824 అక్టోబరులో సైన్యంతో దాడి చేశాడు. కిత్తూరు సైనికులు చెన్నమ్మ సారథ్యంలో తెల్లవారిని ఊచకోత కోశారు. థాకరే సైతం వీరి కత్తి వేటుకు హతమయ్యాడు. ఇద్దరు బ్రిటిష్‌ అధికారులు బందీలుగా చిక్కారు. కలెక్టర్‌ చాప్లిన్‌... రాయబారంతో వారిని చెన్నమ్మ విడిచిపెట్టారు. ఈ యుద్ధంతో బ్రిటిషర్లనూ ఓడించవచ్చని మిగిలిన సంస్థానాలకు అర్థమైంది.

గన్‌పౌడర్‌లో బూడిద...

అవమాన భారంతో కుంగిపోతున్న చాప్లిన్‌ 20 వేల సైన్యంతో మళ్లీ కిత్తూరుపైకి వచ్చాడు. యుద్ధం వద్దని మద్రాసు గవర్నర్‌కు చెన్నమ్మ లేఖలు రాసినా, రాయబారులను పంపినా అతను స్పందించలేదు. ఇక యుద్ధం అనివార్యమైంది. రాణికి అండగా సైన్యంతోపాటు పౌరులు కూడా నిలిచారు. ఆమె కత్తి పట్టి యుద్ధంలోకి దిగింది. ఆ పోరాటం 12 రోజులు సాగింది. ఈసారి షోలాపుర్‌ సబ్‌ కలెక్టర్‌ మన్రో ప్రాణాలు కోల్పాయాడు. ఇలా లాభం లేదని ఆంగ్లేయులు కుటిల తంత్రం పన్నారు. చెన్నమ్మ సైన్యంలోని ముఖ్యుడైన మల్లప్ప శెట్టిని లొంగదీసుకుని, గన్‌పౌడర్‌లో బూడిదను కలిపించారు. దీంతో వారి తుపాకులు, ఫిరంగులు పేలలేదు. ఈ ద్రోహంతో చెన్నమ్మ ఓడిపోయి, బ్రిటిషర్లకు బందీగా చిక్కింది. విచారణ కోసం ఆమెను ధార్వాడ్‌ కలెక్టరేట్‌లో కొన్నిరోజులు ఉంచారు. తర్వాత జీవితఖైదు విధించారు. బైల్‌హొంగల్‌ కోటలో శిక్ష అనుభవిస్తూ 1829లో కన్నుమూసినా... దేశస్వతంత్ర పోరాట చరిత్రలో ధ్రువతారగా నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్