పిల్లలతోపాటు 30 దేశాలు తిరిగా...

చెన్నైలో జరిగిన చెస్‌ ఒలింపియాడ్‌లో భారత మహిళల, పురుషుల జట్లు కాంస్యాలు సాధించాయి. ఈ విజయాల్లో చెన్నైకి చెందిన అక్కాతమ్ముళ్లు వైశాలీ, ప్రజ్ఞానందలది కీలక పాత్ర. వ్యక్తిగత విభాగాల్లోనూ కాంస్యాలు అందుకున్నారు. వాళ్లు గ్రాండ్‌ మాస్టర్లుగా ఎదిగే క్రమంలో ప్రతి

Published : 11 Aug 2022 00:48 IST

చెన్నైలో జరిగిన చెస్‌ ఒలింపియాడ్‌లో భారత మహిళల, పురుషుల జట్లు కాంస్యాలు సాధించాయి. ఈ విజయాల్లో చెన్నైకి చెందిన అక్కాతమ్ముళ్లు వైశాలీ, ప్రజ్ఞానందలది కీలక పాత్ర. వ్యక్తిగత విభాగాల్లోనూ కాంస్యాలు అందుకున్నారు. వాళ్లు గ్రాండ్‌ మాస్టర్లుగా ఎదిగే క్రమంలో ప్రతి అడుగులోనూ తోడుగా నిలిచింది తల్లి నాగలక్ష్మి. ఆ ప్రయాణం గురించి ఆమె వసుంధరతో పంచుకున్నారిలా...


మావారు రమేష్‌బాబు బ్యాంకు ఉద్యోగి. నేను గృహిణి. అయిదేళ్లప్పుడు స్కూల్‌ నుంచి రాగానే టీవీ ముందు కూర్చొని కదిలేది కాదు వైశాలి. దాంతో చెస్‌, డ్రాయింగ్‌లలో శిక్షణలో చేర్పించాం. పాప చెస్‌ బాగా ఆడుతోందని టీచర్‌ చెప్పడంతో అప్పట్నుంచీ చెస్‌పైన దృష్టి పెట్టాం. ఏడాదికే జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతగా నిలిచేది. వైశాలికన్నా ప్రజ్ఞానంద నాలుగేళ్లు చిన్న. మూడేళ్లకే చెస్‌ మీద ఆసక్తి చూపడంతో శిక్షణ ఇప్పించాం. ఏడేళ్లకే ఆసియా, ప్రపంచస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్లేవారు. టోర్నీలు పెరిగేకొద్దీ సమయం ఉండేది కాదు. దాంతో వార్షిక పరీక్షలు మాత్రమే రాసేవారు. బాబు ఇంటర్‌ చదువుతున్నాడు, పాప బీకాం పూర్తిచేసింది.


అక్కడికెళ్లి వంట చేస్తా..

మొదటిసారి విదేశీ టోర్నీలకు వెళ్లినప్పుడు బాబుకి ఏడేళ్లు, పాపకు 11 ఏళ్లు. వారికి తోడుగా నేనే వెళ్లా. డిగ్రీ చదివా. నాకు ఆంగ్లం అర్థమవుతుంది, కానీ మాట్లాడలేను. నాకూ బెరుగ్గా ఉన్నా పైకి మాత్రం ధైర్యంగా కనిపించే దాన్ని. ఎక్కడికి వెళ్లినా మాతో ఇండక్షన్‌ స్టవ్‌ పట్టుకువెళ్లి పిల్లలకు ఇడ్లీ, దోశ, పొంగలి, సాంబారు, కూరలు, రసం చేస్తా. కొన్ని హోటళ్లలో చిన్న వంటగది మాత్రమే ఉంటుంది. అక్కడే రహస్యంగా వండుతా. ఎందుకంటే మనం వంట చేసుకోవడానికి అనుమతి ఉండదు. అయినా పిల్లల కోసం అలా చేయాల్సి వస్తుంది. లేదంటే అక్కడి ఆహారానికి వారి ఆరోగ్యం దెబ్బ తింటే అంతదూరం కష్టపడి వెళ్లి వృథా కదా. మొదట్లో టిఫిన్‌, లంచ్‌, డిన్నర్‌ నేను చేసింది మాత్రమే తినేవారు. ఇప్పుడిప్పుడే ఆయా దేశాల వంటకాలకు అలవాటు పడుతున్నారు.

మొదటిసారి విదేశీ టోర్నమెంటు ఆడటానికి వెళ్లినప్పుడు అక్కడకెళ్లిన తర్వాత విశ్రాంతికి సమయం లేక పోటీ మధ్యలోనే పాప, బాబు  నిద్రను ఆపుకోలేకపోయారు. చాలా బాధేసింది. తర్వాత నుంచి నాలుగైదు రోజుల ముందే అక్కడకు చేరుకొనేలా ప్రయాణాన్ని ఏర్పాటు చేస్తున్నా. అలాగే ఓటమి ఎదురైనప్పుడు వాళ్లకు చెప్పేది ఒక్కటే.. ‘ఈసారి చూసుకుందాం’ అని. వాళ్లు కూడా అంతగా అప్‌సెట్‌ అవ్వరు. గెలిచినప్పుడూ హుందాగా ఉంటారు. ఇండియాకు వచ్చాక గుడికి వెళ్లి వస్తామంతే. పిల్లలకు, నాకు ఇంట్లో ఉండటమే ఇష్టం. ప్రాక్టీస్‌, చదువు లేదంటే ఒత్తిడి తగ్గించుకోవడానికి ఏదైనా కామెడీ ఛానెల్‌ చూస్తారు. ఇంటికొచ్చాక వాళ్లకి ఇష్టమైన చేపలు, చికెన్‌ వండుతా. అక్కాతమ్ముళ్లు ఒకరికొకరు చెస్‌లో సలహాలు, సూచనలిచ్చుకుంటారు. టోర్నమెంట్ల గురించి చర్చించుకుంటారు. నాకు చెస్‌ గురించి తెలీదు. తెలుసుకోవాలనీ అనుకోలేదు. తెలిస్తే వాళ్లు ఆడేటప్పుడు నాకూ ఒత్తిడి పెరిగిపోతుంది.


ఎన్నో ఇబ్బందులు..

ఈ పదేళ్లలో పిల్లల్ని తీసుకుని ఇటలీ, నార్వే, స్పెయిన్‌, ఆస్ట్రేలియా, అమెరికా, రష్యా.. ఇలా 30 దేశాలకు వెళ్లా. ఎక్కడకెళ్లినా బయట తిరగను. పిల్లలతోనే ఉంటా. పోటీ జరిగేటప్పుడు వేరే గదిలో ఉంటూ వాళ్లు గెలవాలని ప్రార్థన చేస్తా. ఒత్తిడి ఉన్నా వాళ్లెదుట చూపించను. మధ్య తరగతి కుటుంబం కావడంతో మొదట్లో ఆర్థిక ఇబ్బందులెన్నో ఎదుర్కొన్నాం. మావారు మాత్రమే చేసే ఉద్యోగంతో టికెట్లకీ, ఖర్చులకు నగదు సరిపోయేది కాదు. బ్యాంకు రుణం తీసుకొనేవాళ్లం. ఎన్ని సమస్యలైనా పిల్లల చెస్‌ మాత్రం ఆగకూడదనుకున్నాం. ఇబ్బందులెన్ని ఎదురైనా పిల్లలకు చెప్పకుండా సర్దుబాటు చేసుకునేవాళ్లం. విదేశాల్లో ఎన్నో పతకాలు సాధించారు. కానీ స్వదేశంలో ఒలింపియాడ్‌లో పతకాలు సాధించడం ఎంతో సంతృప్తినిచ్చింది. మా కష్టాలన్నీ మర్చిపోయేలా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని