సరళాబెన్‌... ఆ పేరే.. ఓ ఉద్యమం!

ఎందరో విదేశీ మహిళలు మన స్వతంత్రోద్యమంలో భాగమయ్యారు. వారందరికీ భిన్నం సరళాదేవి. భారత్‌లో ఆమె పోరాటం స్వాతంత్య్రంతోనే ఆగిపోలేదు. ఆ తర్వాతా అనేక ఉద్యమాల్లో భాగమయ్యారామె. ఈ గడ్డపైనే తుదిశ్వాస విడిచారు! ఇంగ్లాండ్‌ నుంచి ఇండియాకి ఎందుకు వచ్చారు? తన శిష్యుల్లో ఒకరు సరళాదేవిని అడిగిన ప్రశ్న ఇది....

Updated : 13 Aug 2022 04:46 IST

ఎందరో విదేశీ మహిళలు మన స్వతంత్రోద్యమంలో భాగమయ్యారు. వారందరికీ భిన్నం సరళాదేవి. భారత్‌లో ఆమె పోరాటం స్వాతంత్య్రంతోనే ఆగిపోలేదు. ఆ తర్వాతా అనేక ఉద్యమాల్లో భాగమయ్యారామె. ఈ గడ్డపైనే తుదిశ్వాస విడిచారు!

ఇంగ్లాండ్‌ నుంచి ఇండియాకి ఎందుకు వచ్చారు? తన శిష్యుల్లో ఒకరు సరళాదేవిని అడిగిన ప్రశ్న ఇది. ‘సానుభూతితోనే ప్రపంచ శాంతి, సహకారం, సమానత్వం సాధ్యమవుతాయి. కానీ పాశ్చాత్య నాగరికత దీనికి భిన్నంగా పనిచేస్తోంది. మరి వీటికి స్థానం ఎక్కడ ఉందా అని చూస్తే భారత్‌ కనిపించింది’.. అని బదులిచ్చారు సరళ. కేథరిన్‌ మేరీ హీల్‌మాన్‌.. ఈమె అసలు పేరు. ఇంగ్లాండ్‌లో ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టారు. స్వాతంత్య్రం కోసం గాంధీజీ నేతృత్వంలో శాంతి, అహింసా మార్గాల్లో... పోరాడుతున్నారని తెలిసి స్ఫూర్తి పొందారు సరళాదేవి. ‘ఈ పోరాటంలో భారతీయులతో కలిసి నడవాల్సిందే’ అనుకున్నారు. ‘ఇక్కడ అధిక శాతం గ్రామీణ పేదలే.. వారితో కలిసి పనిచేయగలవా’ అని గాంధీజీ అడిగితే.. ‘చేయగలను, చేస్తాను’ అని సమాధానమిచ్చారామె. అలా 31 ఏళ్ల వయసులో 1932లో మన గడ్డ మీద అడుగుపెట్టిన సరళాబెన్‌.. వార్ధాలోని సేవాగ్రామ్‌లో ఎనిమిదేళ్లు గాంధీజీ దగ్గర శిష్యరికం చేశారు. ఆపైన ప్రజలతో కలిసి పనిచేయాలన్న ఆయన సూచన మేరకు హిమాలయాల్లోని గర్వాల్‌కి వెళ్లారు. ప్రస్తుత ఉత్తరాఖండ్‌, కుమావ్‌ జిల్లాలోని కౌశనీ ప్రాంతంలో ‘లక్ష్మీ ఆశ్రమం’ స్థాపించి బాలికలు, మహిళలకు వృత్తి విద్యల్లో శిక్షణ ఇచ్చేవారు. పర్యావరణ పరిరక్షణపైన అవగాహన కల్పించేవారు. జాతీయ ఉద్యమాల్లో ఇక్కడి ప్రజల్నీ భాగం చేసేవారు. ‘క్విట్‌ ఇండియా’ సమయంలో కుమావ్‌ జిల్లాలోని ప్రతి లోయలోనూ ర్యాలీలు నిర్వహించారు. ఈ క్రమంలో నిర్బంధాలకీ గురయ్యారు. జైలుకీ వెళ్లారు.

స్వతంత్రం రాగానే సమస్యలన్నీ పోయాయని సంబరాలు చేసుకుంటున్న సమయంలో ‘ప్రాధాన్యం మారింది తప్ప పోరాటం ఆగకూడద’నుకున్నారు సరళ. అప్పుడప్పుడే వ్యాపారులు హిమాలయాల్లో భారీగా చెట్లను నరికేయడం మొదలైంది. చెట్లు వారి జీవనాధారమని అవి లేకపోతే అక్కడ మనుగడ ఉండదని స్థానికుల్లో చైతన్యం తెచ్చారు. ఆమె శిష్యుల్లో చిప్కో ఉద్యమకారుడు సుందర్‌లాల్‌ బహుగుణ ఒకరు. ఆమె గర్వాల్‌కే పరిమితం కాలేదు.. ఆచార్య వినోభాబావే భూదానోద్యమంలో, జయప్రకాశ్‌ నారాయణ్‌ సోషలిస్ట్‌ ఉద్యమంలో భాగమయ్యారు. చివరకు 1982లో పితోర్‌గఢ్‌లో తుదిశ్వాస విడిచారు. తన జీవిత చరిత్రని హిందీలో రాశారంటే ఆమెలో భారతీయత ఎంతలా భాగమైందో అర్థమవుతుంది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్