ఆ మూడు రంగులే మా జీవితం!
దేశమంతా 75 ఏళ్ల స్వతంత్ర ఉత్సవాల్లో మునిగి తేలుతోంది. ఎక్కడ చూసినా జెండా సంబరాలే. మనకి ఈ నెలలో కనిపిస్తోంది కానీ.. ఈ మహిళలకి ఏడాదంతా జెండా పండగే! ఇదే తమ జీవితమంటారు. అయిదు కోట్లకుపైగా ఖాదీ జెండాలను దేశానికి అందించారు కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ సంయుక్త సంఘం మహిళా కార్మికులు. ఇది తమదైన దేశసేవని గర్వంగా చెబుతున్న వీరిలో 18 ఏళ్ల యువతుల నుంచి 90 ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారు. వారిని వసుంధర పలకరించింది..
దేశమంతా 75 ఏళ్ల స్వతంత్ర ఉత్సవాల్లో మునిగి తేలుతోంది. ఎక్కడ చూసినా జెండా సంబరాలే. మనకి ఈ నెలలో కనిపిస్తోంది కానీ.. ఈ మహిళలకి ఏడాదంతా జెండా పండగే! ఇదే తమ జీవితమంటారు. అయిదు కోట్లకుపైగా ఖాదీ జెండాలను దేశానికి అందించారు కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ సంయుక్త సంఘం మహిళా కార్మికులు. ఇది తమదైన దేశసేవని గర్వంగా చెబుతున్న వీరిలో 18 ఏళ్ల యువతుల నుంచి 90 ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారు. వారిని వసుంధర పలకరించింది..
ఎర్రకోటపై ఎగరేసే జెండాను ఎవరు తయారు చేస్తారో తెలుసా? ఏ జెండా ఎంత పరిమాణంలో ఉండాలి? రంగుల మోతాదెంత? అశోక చక్రంలోని ఆకుల మధ్య ఎంత దూరముండాలి.. పెద్దగా చదువుకోకపోయినా ఈ ప్రశ్నలన్నింటికీ కర్ణాటక రాష్ట్రం బెంగేరిలోని కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ సంయుక్త సంఘం (కేకేజీఎస్‌ఎస్) మహిళా కార్మికులు ఠకీమని చెప్పేస్తారు. దేశంలో జాతీయ జెండా తయారీలో ‘బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్’ గుర్తింపు పొందిన సంస్థ ఇది. 1957లో ప్రారంభమైన ఈ సంస్థలో 2006 నుంచి వస్త్రం తయారీ నుంచి రంగులు, కుట్టడం వంటి పనులన్నీ పూర్తిగా చూసుకుంటోంది మహిళలే. ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఇందులో అవకాశమిచ్చారు. వీరిలో దశాబ్దాలుగా కొనసాగుతున్నవారున్నారు.
‘సంస్థ ప్రారంభమైన ఏడాది తర్వాత దినసరి కూలీగా 50 పైసలకు పనిలో చేరా. నేర్చుకుంటూ పనిచేయడం ఇక్కడి ప్రత్యేకత. పట్టు నుంచి దారం తీయటం ఇక్కడే నేర్చుకున్నా. వందల మందికి శిక్షణ ఇచ్చా. ఎంతోమంది వేరే పని చూసుకున్నా నేను మాత్రం సంస్థను వీడలేదు. ఈ పనిలో నాకెంతో సంతృప్తి. రోజూ ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ ఇక్కడికి వస్తా. ఓపికున్నంత వరకూ ఇదే కొనసాగిస్తా’నని గర్వంగా చెబుతోంది 90 ఏళ్ల షేకవ్వ.
చుట్టూ ఎన్నో వస్త్ర తయారీ సంస్థలు. ఇచ్చే జీతాలూ ఎక్కువే. అయినా అవేమీ వారిని ఆకర్షించట్లేదు. కారణం.. ‘17 ఏళ్ల అనుభవం నాది. చేసే పనిలో ఆత్మ సంతృప్తి. సమాజంలో గౌరవం. కాబట్టే ఏనాడూ వేతనాల గురించి బాధపడలేదు. మా వారు ఆటోడ్రైవర్. కొద్ది సంపాదనతో పిల్లల్ని చదివించటం కష్టంగా ఉండేది. కానీ ఇక్కడ పని చేస్తున్నానన్న గౌరవంతో కొన్ని స్వచ్ఛంద సంస్థలు మా పిల్లల్ని చదివించేందుకు ముందుకొచ్చాయి. అశోక చక్ర విభాగంలో చేస్తున్నా. ఇన్నాళ్లయినా రోజూ ఇదో సవాలే. కొలతల్లో ఏమాత్రం తేడా రాకూడదని అప్రమత్తంగా ఉంటా’నంటోంది నిర్మల.
నూలు వడకడం నుంచి నేత, బ్లీచింగ్, డై, అశోక చక్రాన్ని ముద్రించడం, కుట్టడం వరకు ఆరు విభాగాలుంటాయి. ప్రతి రోజూ బాధ్యతగా, అప్రమత్తంగా చేయాల్సిన పనే. అయినా కష్టమనిపించదు అంటుంది సవిత. ‘కుటుంబాన్ని నెగ్గుకురావటం కష్టమవడంతో ఇందులో చేరా. ఆ కృతజ్ఞతే కాదు.. గౌరవంతోపాటు భరోసాతో కూడిన వేతనాలు ఇక్కడి ప్రత్యేకత. పైగా మేం తయారు చేసే జెండాలు దేశవ్యాప్తంగా రెపరెపలాడుతోంటే సంబరంగా అనిపిస్తుంది. ఆ సంతోషం ముందు ఇదేమీ పెద్ద కష్టం కాదు. పైగా అంతా ఆడవాళ్లమే కాబట్టి సమన్వయంతో పని చేస్తా’మంటోంది.
జెండాకు వినియోగించే ఖాదీ వస్త్రం డెనిమ్ జీన్స్ కంటే మందంగా ఉంటుంది. ఇక్కడ పని చేసే మహిళలు వందకుపైనే. అయినా దేశవ్యాప్తంగా అవసరమైన జెండాలను జులైలోపే అందించేలా కష్టపడతారు. ఏడాదికి రూ.రెండున్నర కోట్ల విలువైన జెండాలను సరఫరా చేస్తారు. ‘దాదాపు అందరి నేపథ్యమూ ఒకటే. కుటుంబసభ్యుల్లా కలిసి మెలిసి పని చేస్తాం. ముందే ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. అందరం దాన్ని అనుసరిస్తా’మని 13 ఏళ్ల అనుభవమున్న జయంతి చెబితే.. ‘కుల, మత, ప్రాంతీయ భేదాలు మా దగ్గరుండవు. నీది, నాది అంటూ కూర్చోం. అవసరమైతే ఒకరికొకరం పనిలో సాయం చేసుకుంటాం. కులాలు, మతాల ప్రస్తావనా మచ్చుకి కూడా కనిపించదు. అందరం పూజ చేస్తున్నంత భక్తి భావనతో జెండాలను రూపొందిస్తా’ మంటారు రుక్సానా, ఫాతిమా.
ప్రతి జెండా 18 నాణ్యతా పరీక్షలను ఎదుర్కొంటుంది. కోడ్ నిబంధనల ప్రకారమే రంగులను అద్దాలి. వాటిని నిర్ణీత సమయం ఆరబెట్టాలి. ప్రతిరంగునీ విడివిడిగా వస్త్రాలపై అద్ది సరైన సైజుల్లో కత్తిరించి జెండాగా కుడతారు. దాన్ని మడత పెట్టడంలోనూ ప్రత్యేక పద్ధతిని పాటిస్తారు. మిల్లీమీటర్ల నుంచి దారప్పోగుల వరకూ ప్రతిదీ లెక్కే. అవన్నీ చూసుకోవాలంటే ఎంత ఓపిక కావాలి?
‘నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించాలంటే చాలా ఓపిక ఉండాలి. అది మహిళలకే సాధ్యం. గతంలో మగవాళ్లు చేసినవాటిలో తేడాలొచ్చి వృథా అవుతుండేవి. మహిళలు బాధ్యత తీసుకున్నాక ఈ సమస్యలే లేవు. దశాబ్దాలుగా పని చేస్తున్న వారిలోనూ అంతే శ్రద్ధ, అప్రమత్తత’ అంటారు సంస్థ మేనేజర్ అన్నపూర్ణ. 65 ఏళ్లుగా రాష్ట్రపతి భవన్, పార్లమెంట్, దేశంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ వాహనాలు.. దేశ నలుమూలలకీ జెండాలను పంపుతున్నారంటే.. ఆ శ్రద్ధ, భక్తి భావమే కారణం. మరి వాళ్లకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే కదూ.
- కె.ముకుంద, బెంగళూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.