పరిశోధక శక్తి!

శాస్త్ర సాంకేతిక రంగాల్లో గడిచిన 75 ఏళ్లలో మహిళలు ఎంతో పురోగతి సాధించారు. మరీ ముఖ్యంగా గత రెండు దశాబ్దాలుగా మనవాళ్లు ఈ రంగాల్లో దూసుకుపోతున్నారు. ఈ మహిళలు అలాంటివారే. అంతరిక్షం, వైద్యం, కంప్యూటర్స్‌...

Updated : 15 Aug 2022 07:55 IST

శాస్త్ర సాంకేతిక రంగాల్లో గడిచిన 75 ఏళ్లలో మహిళలు ఎంతో పురోగతి సాధించారు. మరీ ముఖ్యంగా గత రెండు దశాబ్దాలుగా మనవాళ్లు ఈ రంగాల్లో దూసుకుపోతున్నారు. ఈ మహిళలు అలాంటివారే. అంతరిక్షం, వైద్యం, కంప్యూటర్స్‌... ఇలా తమవైన రంగాల్లో ప్రథములుగా నిలిచి  దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఆ స్పూర్తిని యువతరం అందుకోబోతోంది.

టెస్సీ థామస్‌.. డీఆర్‌డీవోలో డిస్టింగ్విష్డ్‌ సైంటిస్ట్‌, డైరెక్టర్‌ జనరల్‌(ఏరోనాటికల్‌ సిస్టమ్స్‌). టెస్సీ.. పుట్టిపెరిగింది అలెప్పీలో. పుణెలోని ‘డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్డ్‌ టెక్నాలజీస్‌’ నుంచి గైడెడ్‌ మిసైల్‌ టెక్నాలజీలో మాస్టర్స్‌ పూర్తిచేసి 1988లో డీఆర్‌డీవోలో చేరారు. ఆపైన జేఎన్‌టీయూ హైదరాబాద్‌ నుంచి మిసైల్‌ గైడెన్స్‌లో పీహెచ్‌డీ చేశారు. క్షిపణుల ప్రయోగంలో అవసరమైన ఇంధన వ్యవస్థను అభివృద్ధి చేసి ప్రత్యేకతను చాటుకున్నారు. అమెరికా చేపట్టిన అపోలో మిషన్‌ గురించి స్కూల్‌ విద్యార్థిగా చదిచిన టెస్సీ... రాకెట్లమీద మక్కువ పెంచుకున్నారు. కలాం నేతృత్వంలో ఖండాంతర క్షిపణి ‘అగ్ని’ ప్రాజెక్టులో పనిచేసి భారత్‌లో క్షిపణి తయారీ రంగంలో అడుగుపెట్టిన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు. అగ్ని-4, 5 మిసైల్స్‌కు ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌.. ఈ ఘనత సాధించిన తొలి మహిళ ఈమె. ఈ ప్రయాణంలో డీఆర్‌డీవో ‘సైంటిస్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ -2008, డాక్టర్‌ నాయుడమ్మ మెమోరియల్‌ అవార్డ్‌-2014 సహా అనేక అవార్డులు అందుకున్నారు. ‘మిసైల్‌ మహిళ’గా పేరొందారు. 


రాకెట్‌ ప్రయోగాల్లో...

ష్టమైన పని గురించి చెప్పడానికి ‘రాకెట్‌ సైన్స్‌’ అని చెబుతాం. ఆ రంగంలోనే అడుగుపెట్టి దేశం గర్వించదగ్గ ప్రాజెక్టులు చంద్రయాన్‌, మంగళ్‌యాన్‌లలో కీలక పాత్ర పోషించి ‘రాకెట్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఇండియా’గా ఖ్యాతి చెందారు రీతూ కరిధాల్‌. లఖ్‌నవూకు చెందిన రీతూ ఐఐఎస్సీ బెంగళూరు నుంచి ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో ఎంటెక్‌ చేసి 2007లో ఇస్రోలో చేరారు. చంద్రయాన్‌-2 ప్రాజెక్టుకు మిషన్‌ డైరెక్టర్‌. మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌- ‘మంగళ్‌యాన్‌’కు డిప్యూటీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. మంగళ్యాన్‌ కోసం స్వతంత్రంగా పనిచేసే మెదడుని అభివృద్ధిచేశారు. పొరపాట్లను సరిచేసుకోగలగడం దీని ప్రత్యేకత. ఫోర్బ్స్‌ ఇండియా- స్వశక్తితో ఎదిగిన మహిళల జాబితా-2020లో ఈమెను చేర్చింది.


భారత్‌నుంచి తొలి మహిళ..

డాక్టర్‌ గగన్‌దీప్‌ కాంగ్‌.. రాయల్‌ సొసైటీ ఫెలోగా ఎంపికైన తొలి భారత మహిళా శాస్త్రవేత్త. వైరస్‌, బ్యాక్టీరియాలతో వచ్చే వ్యాధుల్ని అడ్డుకోవడంపై చేసిన ఇంటర్‌-డిసిప్లినరీ రిసర్చ్‌ ద్వారా తన ప్రత్యేకతను చాటుకున్నారు కాంగ్‌. సిమ్లాకు చెందిన ఈమె.. సీఎమ్‌సీ-వెల్లూర్‌ నుంచి ఎంబీబీఎస్‌, ఎండీ, పీహెచ్‌డీ చేశారు. ప్రస్తుతం అక్కడే ప్రొఫెసర్‌(గ్యాస్ట్రోఇంటెస్టైనల్‌)గా ఉన్నారు.  ఇంగ్లాండ్‌, అమెరికాల్లోనూ పరిశోధనలు చేశారు. పిల్లల్లో డయేరియాకు కారణమైన రోటావైరస్‌ నివారణకు తన బృందంతో కలిసి భారత్‌లో సొంతంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. ఫరీదాబాద్‌లోని ట్రాన్స్‌లేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు 2016-2020 మధ్య ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా చేశారు. 


కంప్యూటర్‌కి భాషలు నేర్పుతూ!

కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్‌ అయిన కాలికా.. జేఎన్‌యూ-దిల్లీ నుంచి లింగ్విస్టిక్స్‌లో మాస్టర్స్‌, ఆపైన యూనివర్సిటీ ఆఫ్‌ యార్క్‌ నుంచి ఫొనెటిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు. కొన్నాళ్లు ఫిజీలో ప్రొఫెసర్‌గా చేశారు. స్పీచ్‌ టెక్నాలజీపైన పనిచేస్తున్న ఓ బెల్జియం కంపెనీ భాషాశాస్త్రంలో కాలికా ప్రతిభను గుర్తించి స్పీచ్‌ టెక్నాలజిస్ట్‌గా నియమించుకుంది. కొన్నాళ్లకు భారత్‌కు తిరిగొచ్చి పిపోపెటా సింప్యూటర్స్‌ అంకుర సంస్థలో, హెచ్‌పీ ల్యాబ్స్‌లో పనిచేశారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌ బెంగళూరు పరిశోధన కేంద్రంలో ‘ప్రాజెక్ట్‌ మిలాంజ్‌’కు నేతృత్వం వహిస్తున్నారు. లిపి, స్పీచ్‌ ద్వారా ఒకేసారి భిన్న భాషల పదాలు ఉపయోగించినపుడు కంప్యూటర్‌లో వాటిని క్రోడీకరించి సమాచారాన్ని చూపడం ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యం. దీనివల్ల సామాన్యులూ కంప్యూటర్‌ సేవల్ని మరింత సులభంగా పొందొచ్చని చెబుతారు.


మెదడుని పరిశోధిస్తూ...

నిషి నింగిలోకి వెళ్లాడు, సముద్రం లోతుల్నీ చూశాడు. కానీ తన గురించి తాను పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాడు. టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసర్చ్‌లో ప్రొఫెసర్‌ అయిన విదిత వైద్య ఆ ప్రయత్నమే చేస్తున్నారు. భావోద్వేగాలూ, ఆందోళనల ప్రభావం మెదడుపై ఎలా చూపుతుందోన్న అంశంపైన పరిశోధిస్తున్నారీమె. ముంబయిలో లైఫ్‌ సైన్సెస్‌, బయోకెమిస్ట్రీలో గ్రాడ్యుయేషన్‌, యేల్‌ యూనివర్సిటీ నుంచి న్యూరోసైన్స్‌లో మాస్టర్స్‌, పీహెచ్‌డీ చేశారు. ఆక్స్‌ఫర్డ్‌లో పోస్ట్‌-డాక్‌ చేశాక స్వదేశం వచ్చి టీఐఎఫ్‌ఆర్‌లో చేరారు. సొంత ల్యాబ్‌ని అభివృద్ధి చేసి ఒకటిన్నర దశాబ్దాలుగా ఈ పరిశోధనలు చేస్తున్నారు. చిన్నవయసులో ఒత్తిడికి గురైన వారిలో జీవితకాలం దాని ప్రభావం ఉంటుందన్నది ఈ పరిశోధనల్లో తేలిన ఒక ముఖ్యమైన అంశం. పిల్లల పెంపకంలో ఎంతో మార్పురావాలంటారు విదిత. మానసిక సమస్యలకు మందుల అభివృద్ధి దిశగా ఫార్మా కంపెనీలతో కలిసి పని చేస్తున్నారీమె.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్