రాష్ట్రాలు దాటారు.. పొదుపు పాఠాలు చెప్పారు

ఎనిమిదో తరగతి చదివి... పక్కఊరికి కూడా  ఒంటరిగా వెళ్లడానికి జంకిన రజిత... ఒక మంచి లక్ష్యం కోసం పదహారు రాష్ట్రాలు తిరిగింది. వేలమంది మహిళల్ని ఒక్కటి చేసింది. హనుమకొండకు చెందిన సాబేరాదీ ఇదే బాట. ఇంతకీ ఏ లక్ష్యం కోసం వీళ్లు ఇన్ని రాష్ట్రాలు తిరిగారో తెలుసా? తమ జీవితాల్లో పొదుపు తెచ్చిన మంచి మార్పు.. తోటి మహిళల జీవితాల్లోనూ  రావాలని. ఆ వివరాలు వారి మాటల్లోనే...

Published : 22 Aug 2022 00:35 IST

ఎనిమిదో తరగతి చదివి... పక్కఊరికి కూడా  ఒంటరిగా వెళ్లడానికి జంకిన రజిత... ఒక మంచి లక్ష్యం కోసం పదహారు రాష్ట్రాలు తిరిగింది. వేలమంది మహిళల్ని ఒక్కటి చేసింది. హనుమకొండకు చెందిన సాబేరాదీ ఇదే బాట. ఇంతకీ ఏ లక్ష్యం కోసం వీళ్లు ఇన్ని రాష్ట్రాలు తిరిగారో తెలుసా? తమ జీవితాల్లో పొదుపు తెచ్చిన మంచి మార్పు.. తోటి మహిళల జీవితాల్లోనూ  రావాలని. ఆ వివరాలు వారి మాటల్లోనే...


అలా అంటుంటే సంతోషం...

ఇంటర్‌ వరకూ చదివా. మావారు రహీముద్దీన్‌ వ్యవసాయం చేసేవారు. పెళ్లైన పదేళ్ల తర్వాత పొదుపు సంఘంలో చేరాను. సంఘంలో చురుగ్గా ఉండేదాన్ని. దాంతో పొరుగు రాష్ట్రాల వారికి ఈ పొదుపు గురించి తెలియ చెప్పేందుకు సీఆర్‌పీగా శిక్షణ ఇచ్చారు. రెండు నెలల్లో బుక్‌కీపింగ్‌, సంఘాల ఏర్పాటు గురించి నేర్చుకుని.. మొదట యూపీలోని గ్రామాలకు వెళ్లాను. మన అమ్మమ్మల కాలంలోకి అడుగుపెట్టినట్టు అనిపించింది. ఎందుకంటే వాళ్లకు పొదుపు గురించి ఏం తెలియదు. చెప్పినా వినేవారు కాదు. దాంతో వాళ్లు పొలాలకు వెళ్తే పొలాలకు, వంట చేస్తుంటే పొయ్యి దగ్గర కూర్చుని వాళ్లకు నచ్చచెప్పడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. వాళ్లని ఒప్పించి సంఘం ఏర్పాటు చేసి అది నిర్వహించుకోవడానికి కావాల్సిన శిక్షణ ఇచ్చి రెండువారాల తర్వాత... మేం వెళ్లి పోతుంటే వాళ్లు ఏడుస్తూ వచ్చి మమ్మల్ని సాగనంపేవారు. మొదట్లో కష్టమైనా... మాకిచ్చిన శిక్షణ వల్ల రెండు వారాలు లేదా నెల రోజుల సమయంలో ఐదారు సంఘాలు ఏర్పాటు చేస్తేకానీ ఇంటికి వచ్చేవాళ్లం కాదు. అంతవరకూ ఇంట్లో పిల్లల్ని మా అత్తమామలు, తోటికోడళ్లు చూసుకొనేవారు. రోజుకింతని మాకు అధికారులు చెల్లిస్తారు. బిహార్‌, ఎంపీ, ఝార్ఖండ్‌, రాజస్థాన్‌ సహా.. తొమ్మిది రాష్ట్రాలు తిరిగా. అలా నేనిచ్చిన శిక్షణతో బాగుపడ్డ ఎంతోమంది ఫోన్లు చేసి ‘మేడమ్‌ మేం కిరాణా దుకాణం పెట్టుకున్నాం. చిన్న వ్యాపారం మొదలుపెట్టి.. ఇల్లు కట్టుకున్నాం..’ అంటూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. మరోపక్క ఈ పొదుపువల్ల మా పిల్లల్నీ చదివించుకోగలిగా. అబ్బాయిలిద్దరూ ఇంజినీరింగ్‌ చదివి, ఐటీ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అమ్మాయీ చదువుకుంది.


స్వయం సహాయక సంఘాలుగా మారి.. పొదుపుతో మహిళలు అద్భుతాలు సాధిస్తున్న వైనం తక్కిన రాష్ట్రాలతో పోలిస్తే మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ. చదువుకున్నది తక్కువే అయినా సంఘాలని సమర్థంగా నిర్వహించడంలో.. పొదుపు లెక్కల్ని పక్కాగా వేయడంలో వీళ్ల ముందు బిజినెస్‌ స్కూలు విద్యార్థులు కూడా బలాదూరే. ఈ నైపుణ్యమే వారికి కొన్ని ప్రత్యేక అవకాశాలని తెచ్చిపెట్టింది. అసలు పొదుపు సంఘాలు అనేవి ఉంటాయని తెలియని రాష్ట్రాలకు వెళ్లి... అక్కడ సంఘాలు ఏర్పాటు చేయాలి. లెక్కలన్నీ పక్కాగా ఉండేలా బుక్‌కీపింగ్‌ నైపుణ్యాలని బోధించాలి. ఇలా పొదుపు పాఠాలు బోధించడంలో నైపుణ్యం ఉన్నవాళ్లని సీఆర్‌పీ(కమ్యునిటీ రిసోర్స్‌ పర్సన్‌)లు అంటారు. సాధారణంగా ప్రతి ప్రాంతంలోనూ సీఆర్‌పీలుంటారు. అయితే ఒక్క హనుమకొండ జిల్లా వేలేరు మండంలోనే 140మంది మహిళా సీఆర్‌పీలు ఉండటం విశేషం.


విమానమెక్కి.. పాఠాలు చెప్పా!

మా సొంతూరు సిద్దిపేట. ఎనిమిదో తరగతి చదివా. చిన్న వయసులోనే పెళ్లయ్యింది. ఆయనా పెద్దగా చదువుకోలేదు. ఉన్న ఊళ్లో ఉపాధిలేక ధర్మసాగర్‌ వెళ్లాం. తక్కువ జీతానికి... ఆయన గుమస్తాగా పనిచేసేవారు. తెలిసిన వాళ్లు నెలకి
రూ.30... పొదుపు చేస్తావా? అని అడిగారు. ఆ చిన్నమొత్తానికి కూడా ఆలోచించా. మనవల్ల అవుతుందా? అని. సంఘంలో చేరాక చురుగ్గా ఉంటూ రుణాల లెక్కలు రాసేందుకు అవసరమైన బుక్‌ కీపింగ్‌ పని నేర్చుకున్నా. ఆ పనిచేసినందుకు రూ.30 వచ్చాయి. ఆ చిన్నమొత్తాలతోనే ఓ కిరాణా దుకాణం మొదలుపెట్టాం. ఆ సమయంలోనే పొరుగు రాష్ట్రాలకు వెళ్లి అక్కడివారికి మన పొదుపు పాఠాలు నేర్పేందుకు అవసరమైన సీఆర్‌పీ శిక్షణ తీసుకున్నా. హిందీ నేర్చుకున్నా. అంతవరకూ పొరుగూరు కూడా వెళ్లని నేను మొదటిసారి ఉత్తర్‌ప్రదేశ్‌ వెళ్లా. మొదట్లో వాళ్లు మమ్మల్ని నమ్మేవారు కాదు. ఇంట్లో మగవాళ్లుకానీ, వృద్ధులైన ఆడవాళ్లు కానీ వచ్చేవారు. వాళ్లకి నమ్మకం కలిగించి కొన్ని వారాల పాటు అక్కడే ఉండి సంఘాలు ఏర్పాటు చేసి వచ్చేవాళ్లం. ఆరుసార్లు యూపీ వెళ్లాను. ఇంటిదగ్గర పిల్లల్ని అత్తమ్మ చూసుకొనేవారు. బిహార్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, అసోం, పంజాబ్‌లతోపాటు.. అండమాన్‌ కూడా వెళ్లి ఎన్నో పొదుపు సంఘాలని ఏర్పాటు చేశా. ఇందుకోసం విమానం ఎక్కా. నా ఆదాయంతో పిల్లల్ని చదివించుకున్నా. పెద్దపాప హారిక జియాలజీలో పీహెచ్‌డీ చేస్తోంది. పీజీలో బంగారు పతకం సాధించింది. 

   -ఆకునూరి భద్రయ్య, హనుమకొండ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్