అమ్మమ్మ వంట.. ఆమె వ్యాపారం!

‘బామ్మ చేతి రుచి’ని ఇష్టపడని వారెవరు? దాన్ని ఈ తరాలకు అందించాలనుకున్నారు అపూర్వ పురోహిత్‌. దానికి సమాజ సేవా తోడైతే బాగుంటుందనుకున్న ఆమె ప్రయత్నమే ‘అజోల్‌’.తాజా, స్థానిక ఆహారానికి కొన్నేళ్లుగా

Updated : 23 Aug 2022 08:50 IST

‘బామ్మ చేతి రుచి’ని ఇష్టపడని వారెవరు? దాన్ని ఈ తరాలకు అందించాలనుకున్నారు అపూర్వ పురోహిత్‌. దానికి సమాజ సేవా తోడైతే బాగుంటుందనుకున్న ఆమె ప్రయత్నమే ‘అజోల్‌’.

తాజా, స్థానిక ఆహారానికి కొన్నేళ్లుగా ఆదరణ పెరుగుతుండటాన్ని గమనించారు అపూర్వ. అప్పుడే ఆమెకు తన అమ్మమ్మ వంట గుర్తొచ్చింది. తాజాగా చేసిపెట్టుకొని ఉపయోగించే మసాలాలు, ఆరోగ్యకరమైన పచ్చళ్లు ఈ కాలం వాళ్లకి దూరమవుతున్నాయనుకున్నారు. వాటిని అందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతో 2021లో కొడుకుతో కలిసి ‘అజోల్‌’ ప్రారంభించారు. అంటే.. మరాఠీలో ‘అమ్మమ్మ ఇల్లు’ అని అర్థమట. వీళ్లది ముంబయి. అపూర్వ బీఎస్‌సీ ఫిజిక్స్‌, ఐఐఎం బెంగళూరు నుంచి మేనేజ్‌మెంట్‌లో పీజీ చేశారు. వివిధ కార్పొరేట్‌ సంస్థల్లో 30 ఏళ్లు ఉద్యోగం చేశారు. సొంతంగా ఏదైనా ప్రయత్నించాలనుకున్నప్పుడు ఆమె మనసు వ్యాపారం వైపు మళ్లింది. దీనికి సమాజ సేవా జోడించాలనుకొని మహారాష్ట్రలోని స్వయం సహాయక సంఘాల వారిని చేర్చుకుంటూ వెళ్లారు.

‘పల్లెలు, గ్రామీణ ప్రాంతాల వారికి ఏమీ తెలియదు అనుకుంటారు చాలామంది. కానీ, స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ఆహారం అక్కడే దొరుకుతుంది. ఇప్పటికీ తాతల నాటి సంప్రదాయ విధానాలనే వాడుతున్నవారెందరో. ఓసారి మహారాష్ట్రలోని పల్లెకు వెళ్లినపుడు కొన్ని స్వయం సహాయక సంఘాలను చూశా. తక్కువ ఖర్చులో నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. కానీ మార్కెటింగ్‌పై అవగాహన లేక సరకు మిగిలిపోతుంది. దీనికితోడు ఇంట్లో వాళ్లు, చుట్టుపక్కల వాళ్ల నుంచి హేళన భరించాలి. అయినా భరిస్తూ ఏదో సాధించాలన్న వాళ్ల తపన నాలో స్ఫూర్తి కలిగించింది. బామ్మల రుచుల్ని అందించడంతోపాటు ఇతరులకూ ఉపాధి కల్పించే అవకాశం. బాగుందనిపించింది. దీంతో వాళ్ల ఉత్పత్తులకు మార్కెటింగ్‌ కల్పిస్తానని ఒప్పందం చేసుకున్నా. తక్కువ ఖర్చు, నాణ్యమైన సరకు నినాదంగా పనిచేస్తున్నాం. ఇన్‌స్టంట్‌ చట్నీలు, పొడులు, వడియాలు, బెల్లం.. సేంద్రియ పదార్థాలతో తయారు చేసినవి మొత్తం 30కిపైగా రకాలను అమ్ముతున్నాం. అమెజాన్‌ వంటి ప్లాట్‌ఫామ్‌లతోపాటు సొంత వెబ్‌సైట్‌ ద్వారా కూడా అమ్మకాలు జరుపుతున్నాం. ఏడాదిన్నరలోనే విదేశాలకూ సరఫరా చేస్తున్నాం’ అని ఆనందంగా చెబుతారు అపూర్వ. దాదాపు 20 స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కల్పిస్తున్నారీవిడ. తయారీలోనే కాదు మార్కెటింగ్‌ వంటి వివిధ విభాగాల్లోనూ మహిళలకే ప్రాధాన్యమిచ్చారు. ప్రిజర్వేటివ్‌లను అసలు వాడరు. 16 నాణ్యత పరీక్షల తర్వాతే మార్కెట్‌లోకి తెస్తామంటున్న ఈవిడ ప్రస్తుతం మహారాష్ట్ర సంప్రదాయ రుచులనే అందిస్తున్నారు. ఇతర రాష్ట్రాల రుచులనూ అందించే ప్రయత్నంలో ఉన్నారు. గ్రామీణ మహిళలకు ఉపాధి, సంప్రదాయ రుచులకు ఆదరణ కల్పిస్తున్న ఈమె తీరు అభినందనీయమేగా మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్