ఈ యోధురాళ్లే... అక్కడి అమ్మాయిలకు రక్ష

మహిళల అక్రమ రవాణా, బాల్యవివాహాలు వాళ్ల డేగచూపులను దాటలేవు. స్కూలుకి రాకపోయినా.. నిఘా వర్గాల ద్వారా పరిస్థితేంటో కనుక్కుంటారు. ఉపాధి పేరుతో మోసం చేయాలని చూస్తే ఊచలు లెక్కబెట్టిస్తారు.

Updated : 24 Aug 2022 07:08 IST

 

మహిళల అక్రమ రవాణా, బాల్యవివాహాలు వాళ్ల డేగచూపులను దాటలేవు. స్కూలుకి రాకపోయినా.. నిఘా వర్గాల ద్వారా పరిస్థితేంటో కనుక్కుంటారు. ఉపాధి పేరుతో మోసం చేయాలని చూస్తే ఊచలు లెక్కబెట్టిస్తారు. బాధ, నిరాశ నిస్పృహలో ఉంటే చేయూతనిస్తారు. విమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ సేవల్లా ఉన్నాయి కదూ! నిజమే.. కానీ ఇవి చేస్తోంది సాధారణ అమ్మాయిలే!

సుందర్‌బన్‌.. పశ్చిమ్‌ బంగాలోని ఓ వెనుకబడిన ప్రాంతం. దానికితోడు ప్రకృతి విపత్తులు, వరదలెక్కువ. దీంతో ఆహార కొరత, నిరుద్యోగ సమస్యలు. ఒక్కోసారి తలదాచుకోవడమూ కష్టమే. అలాంటి సమయంలో ఎవరైనా ఉపాధి ఆశ చూపినా, ఆడపిల్లలకు భద్రత కల్పిస్తామన్నా విని మోసపోయేవారే ఎక్కువ. వాళ్లని నమ్మి వెళ్లిన అమ్మాయిల్ని వేరే దేశాలకు ఎగుమతి చేయడం, వ్యభిచార కూపంలోకి నెట్టడం వంటివి చేసేవారు. హ్యూమన్‌ ట్రాఫికింగ్‌లో పశ్చిమ్‌ బంగ 44 శాతంతో దేశంలోనే మొదటి స్థానంలో ఉంటే.. సుందర్‌బన్‌, దాని పక్క ప్రాంతాల్లోనే ఈ కేసులెక్కువ. వీళ్ల జీవితాల్లో మార్పు తేవాలనే ఉద్దేశంతో వరల్డ్‌ విజన్‌ ఇండియా అనే సంస్థ ‘గర్ల్‌ పవర్‌ ప్రాజెక్టు’ను ప్రారంభించింది. పిల్లలు, వెనుకబడిన తరగతుల వారికి ఆసరానిచ్చే సంస్థ ఇది. యవ్వనంలోకి అడుగుపెట్టిన 12 నుంచి 19 ఏళ్లలోపు అమ్మాయిలను ఎంపిక చేసి, శిక్షణనిస్తున్నారు. ట్రాఫికింగ్‌ విధానాలు, గమనించాల్సిన విషయాలతోపాటు ఎఫ్‌ఐఆర్‌ రాయడం, హెల్ప్‌లైన్‌కి ఫోన్‌ చేయడం, రిపోర్టు రాయడం వంటివి నేర్పిస్తున్నారు. ఆత్మరక్షణ విద్యల్లోనూ శిక్షణనిస్తున్నారు.
ఇప్పటి వరకూ ఇలా దాదాపు 6 వేలమంది అమ్మాయిలు శిక్షణ తీసుకున్నారట. ఒక్కో టీమ్‌లో 20-30 మంది ఉంటారు. నెట్‌వర్క్‌, ఇన్‌ఫార్మర్లనీ ఏర్పాటు చేసుకున్నారు. ఎన్‌జీఓ, వైద్యం, ఉద్యోగం.. ఇలా ఎన్నో రూపాల్లో చేసే మోసాలను అడ్డుకుందీ ‘గర్ల్‌ పవర్‌’ బృందం. ఇవే కాదు.. ఎవరైనా అమ్మాయి అన్యమనస్కంగా కనిపించినా సమస్య ఏంటో తెలుసుకుంటారు. లైంగిక వేధింపులు, ఇతర సమస్యల్నీ పరిష్కారమయ్యేలా చూస్తారు. జోధా (
బంగాలీలో యోధురాలని అర్థం) పేరుతో వీరు ఈ కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నారు. అయిదేళ్లలో ఈ ఒక్క గ్రామంలోనే 102 లైంగిక వేధింపులు, 334 బాల్యవివాహాలు, 29 మంది చిన్నారుల అక్రమ రవాణాలను అడ్డుకున్నారట. వీటి బారి నుంచి రక్షించిన అమ్మాయిలను తోటివారు వెలేయడం, చిన్నచూపు చూడటం వంటివీ సాధారణమే. వాటి నుంచీ రక్షణే కాదు, సమాజంలో అందరితో కలిసేలా అవగాహన కార్యక్రమాలూ నిర్వహిస్తారట. ఎవరైనా పిల్లలు తప్పిపోయినా తల్లిదండ్రులు వీళ్లని వెతుక్కుంటూ వస్తారట. అంతటి బృందస్ఫూర్తితో పనిచేస్తున్నారీ అమ్మాయిలు. వాళ్లని వాళ్లు రక్షించుకుంటూ.. మరెందరో అమ్మాయిలకు అండగా నిలుస్తున్న ఇలాంటి బృందాలు దేశవ్యాప్తంగా ఉంటే ఆడపిల్లలపై ఎన్నో అత్యాచారాలకు అడ్డుకట్ట పడుతుంది కదూ!


‘అమ్మాయి వయసుకొచ్చింది అనగానే పెళ్లి సలహాలిచ్చేవారే ఎక్కువ. దగ్గరుండి మరీ మంచిదంటూ సంబంధాలు తెస్తుంటారు. 18 ఏళ్లు రాకుండా చేసే పెళ్లినీ ‘తప్పిదం’గానే భావిస్తాం మేం. దీనికారణంగా వచ్చే సమస్యల్ని వివరిస్తాం. కొన్నిసార్లు ఊరిపెద్దలు, నాయకులు మీకెందుకు ఇవన్నీ అంటూ అడ్డుపడతారు. అక్కడ్నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తారు. అవసరమైతే మా ఇళ్లల్లో వాళ్లనీ బెదిరిస్తారు. అమ్మానాన్నా నాకు సర్దిచెప్పబోతే ‘ఇదే పరిస్థితి నాకూ ఎదురైతే’అని అడిగానోసారి. అప్పట్నుంచి అర్థం చేసుకొని, దన్నుగా నిలుస్తున్నార’ని చెబుతోందో 19 ఏళ్ల అమ్మాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని