పోరాడి ‘కళ’కు గుర్తింపు సాధించింది!

మలయాళ సినీ పరిశ్రమలో ఆమె తొలి మహిళా మేకప్‌ ఆర్టిస్ట్‌. కానీ ఆ గుర్తింపు సాధించడానికి ఒకటీ రెండు కాదు ఏకంగా 11 ఏళ్లు వేచి చూసిందామె. పట్టువదలకుండా పోరాడింది. ఎట్టకేలకు ఇటీవల మిట్టా ఆంథోనీ ప్రయత్నం ఫలించింది.

Published : 25 Aug 2022 00:21 IST

మలయాళ సినీ పరిశ్రమలో ఆమె తొలి మహిళా మేకప్‌ ఆర్టిస్ట్‌. కానీ ఆ గుర్తింపు సాధించడానికి ఒకటీ రెండు కాదు ఏకంగా 11 ఏళ్లు వేచి చూసిందామె. పట్టువదలకుండా పోరాడింది. ఎట్టకేలకు ఇటీవల మిట్టా ఆంథోనీ ప్రయత్నం ఫలించింది.

ఫిల్మ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ కేరళ- మేకప్‌ యూనియన్‌లో మిట్టానే మొట్టమొదటి మహిళ. కానీ ఆ గుర్తింపు రావడానికి ముందు ఆమె ఎన్నో తిరస్కరణలు చూసింది, అవమానాల్ని ఎదుర్కొంది, కష్టాలు పడింది. 37 సినిమాలకు పని చేశాకే ఆమెకు మేకప్‌ యూనియన్‌ సభ్యత్వం వచ్చింది. ‘చిన్నప్పుడు సినిమాలు చూసిన రోజుల్లో మమ్ముట్టి, కమల్‌హాసన్‌ మేకప్‌లు ఆకట్టుకునేవి. అయితే అదంతా మేకప్‌ ఆర్టిస్టుల ప్రతిభ అని అప్పుడు తెలీదు. ఊహ తెలిశాక దాని వెనక ఎవరుంటారో అర్థమైంది. ఇంటర్‌ తర్వాత డిగ్రీలో చేరాను. కానీ నన్ను ఆ చదువులు అంతగా ఆకర్షించలేదు. దాంతో అది మధ్యలో ఆపేసి మేకప్‌లో డిప్లొమా చేశా. ఇది జరిగి దాదాపు 18 ఏళ్లవుతోంది. 2006-07లో మొదటిసారి ఓ టీవీ కార్యక్రమానికి పనిచేశా. తర్వాత కొత్త కోర్సులు నేర్చుకుంటూ సినిమాల్లో అడుగుపెట్టా. అరబిక్‌, హిందీ, తమిళం, భోజ్‌పురి సినీ పరిశ్రమల్లో చేశా’ అంటూ మేకప్‌ ఆర్టిస్టుగా తన ప్రయాణాన్ని వివరించింది మిట్టా.

సుప్రీం జోక్యంతో...

2011లో మొదటిసారి కేరళ మేకప్‌ ఆర్టిస్టుల యూనియన్‌లో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకుంది మిట్టా. అప్పుడు యూనియన్‌ ఆమెకు సభ్యత్వం ఇవ్వలేదు. మన దేశంలో ఏ సినీ పరిశ్రమలోనూ అసలు గుర్తింపు పొందిన మహిళా మేకప్‌ ఆర్టిస్టులు లేరన్న వాస్తవాన్ని అప్పుడే తెలుసుకుంది. అప్పటికే సుప్రీంకోర్టులో చాలామంది ఈ విషయమై పోరాటం చేస్తున్నారు. 2014లోనే మహిళల్ని మేకప్‌ ఆర్టిస్టులుగా చేర్చుకోవడంలో ఉన్న నిషేధాన్ని కొట్టి పారేసింది సుప్రీంకోర్టు. మేకప్‌ ఆర్టిస్టుగా మలయాళంలో సినిమాలు చేయకపోయినప్పటికీ డాక్యుమెంటరీలూ, ప్రభుత్వ ప్రాజెక్టులకు పనిచేసేది మిట్టా. ‘2017లో నా మొదటి మలయాళ సినిమా చేశా. 2018లో వచ్చిన కూడే సినిమాతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత మరో నాలుగైదు సినిమాలకూ పనిచేశా. సభ్యత్వం కోసం పట్టువదలకుండా ఏటా దరఖాస్తు చేస్తూనే ఉన్నా. ఎంతో మందితో మాట్లాడా. ఎన్నో ప్రయత్నాలు చేశా. చివరికి 11వ ప్రయత్నంలో సభ్యత్వం వచ్చింది’ అంటారు మిట్టా. మలయాళ చిత్రసీమలో ఏర్పాటైన ‘ఉమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌’ ఆమెకు అండగా నిలిచింది. చాలామంది మహిళలు సినిమాల్లో ఆర్టిస్టులుగా పనిచేస్తున్నా యూనియన్‌ గుర్తింపు లేనిదే అధికారిక మేకప్‌ ఆర్టిస్టులు కాలేరు. అలాంటి వారికి అవార్డుల్లో, ప్రభుత్వ రాయితీల్లో చోటుండదు. ఎట్టకేలకు తన పనికి తగిన గుర్తింపు పొందుతున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది మిట్టా. తన స్ఫూర్తితో మరింత మంది ఈ బాటలో నడుస్తారనడంలో సందేహం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్