పట్టుపట్టి.. పట్టాలు కొట్టి..

పిల్లలూ, కుటుంబ బాధ్యతలూ... వీటి మధ్య తీరికెక్కడిది. పెళ్లి తర్వాత చదువు కొనసాగించకపోవడానికి మనలో చాలామంది చెప్పే కారణాలు. కొందరైతే చదువుతోపాటు అభిరుచులకీ దూరమవుతారు. కానీ పట్టుదల ఉంటే ఇవన్నీ సాధ్యమని నిరూపించారు హేమలత.

Updated : 26 Aug 2022 07:13 IST

పిల్లలూ, కుటుంబ బాధ్యతలూ... వీటి మధ్య తీరికెక్కడిది. పెళ్లి తర్వాత చదువు కొనసాగించకపోవడానికి మనలో చాలామంది చెప్పే కారణాలు. కొందరైతే చదువుతోపాటు అభిరుచులకీ దూరమవుతారు. కానీ పట్టుదల ఉంటే ఇవన్నీ సాధ్యమని నిరూపించారు హేమలత. పెళ్లి తర్వాత 16 డిగ్రీలు చేశారామె. సంగీతంపైన ఇష్టంతో అటువైపూ అడుగులు వేశారు. ఇదంతా ఎలా సాధ్యమైందంటే...

లలు అందరికీ ఉంటాయి.. కానీ వాటిని సాకారం చేసుకొనేంత పట్టుదల కొంతమందికే ఉంటుంది. కొండముది హేమలత ఈ రెండో కోవకి చెందినవారు.  ‘మాది గుంటూరు జిల్లా పొన్నూరు. నాన్న ఉద్యోగరీత్యా.. విజయవాడలో స్థిరపడ్డాం. చదువంటే ప్రాణం నాకు. కానీ ఇంట్లో వాళ్లు 17 ఏళ్లకే పెళ్లి కుదిర్చారు. చదువు ఆగిపోతుందని ఆ పెళ్లి వద్దన్నా. కానీ ఆయన.. వాళ్ల పెద్దవాళ్లను తీసుకొచ్చి మరీ పట్టుబట్టారు. దాంతో రైల్వే వైద్యుడిగా పనిచేస్తున్న నాన్న.. ‘ఓసారి మళ్లీ ఆలోచించుకో తల్లీ’ అన్నారు. ‘నా చదువుకు అడ్డం రాకూడదు’ అనే షరతు విధించా. దానికి మావారు కుటుంబరావు సరేననడంతో పెళ్లి బాజాలు మోగాయి. మాకో బాబు మహేశ్‌. పెళ్లైతే చదువు అటకెక్కుతుంది అంటారు కదా... కానీ అందుకు భిన్నంగా నా చదువు వేగం పుంజుకుంది. మాబాబుకి చదువు నేర్పుతూనే, నేనూ ఏదో కోర్సు చేసేదాన్ని. వాడు పదో తరగతికి వచ్చేంతవరకూ టీచర్‌గా పనిచేశా. ఆ తర్వాత నాకిష్టమైన న్యాయవాద విద్య చదివి ప్రాక్టీస్‌ మొదలుపెట్టా. ప్రస్తుతం ఆంధ్రా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో రిసెర్చ్‌ స్కాలర్‌గా (బాలకార్మిక వ్యవస్థపై) కొనసాగుతున్నా. హైకోర్టులోనూ వాదిస్తున్నా. ఇటీవలే అంతర్జాతీయ మానవ హక్కులు, నేర నియంత్రణ సంస్థ (ఐహెచ్‌ఆర్‌సీసీఓ)కు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర న్యాయ సలహాదారుగా ఎంపికయ్యాను. మా బాబు ఏలూరులో ఆర్థోపెడిక్‌ సర్జన్‌. నిత్యం నేరస్థులు, పోలీసులు, కోర్టులతోనే నా పనంతా. కుటుంబ సభ్యుల సహకారంతో ధైర్యంగా ముందుకు సాగుతున్నా’ అంటున్న హేమలత... ఇటీవల విజయవాడలో నూతన కోర్టు భవనాల ప్రారంభోత్సవానికి వచ్చిన సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రమణ, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, ఇతర న్యాయమూర్తుల సమక్షంలో పాట పాడి ప్రశంసలు పొందారు. ‘చదువు, ఆఫీస్‌, ఇంటిపని వేటికవే టైం పెట్టుకుని చేసుకొనే దాన్ని. ఇష్టంతో చదివేదాన్ని కాబట్టి కష్టం అవ్వలేదు. సంకల్పం ఉంటే ఏ మహిళైనా తన కలల్ని నిజం చేసుకోవచ్చు’ అంటున్నారు హేమలత.


జువాలజీ, సైకాలజీ, ఇంగ్లిష్‌, ఫిలాసఫీ, హిందీ, మ్యూజిక్‌ల్లో పీజీలు చేశా. న్యాయవాద విద్యపై ఇష్టంతో... కార్మిక చట్టాలు, టార్ట్స్‌ అండ్‌ క్రైం, కాన్‌స్టిట్యూషనల్‌ లా, అడ్మినిస్ట్రేటివ్‌ లాలో ఎం.ఎల్‌. చేశా. క్రిమినల్‌ జస్టిస్‌లో పీజీ చేశా. సైబర్‌ లా, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌, ఏడీఆర్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఇంటర్నేషనల్‌ ప్రాపర్టీ రైట్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమాలు పూర్తిచేశా. చదువుతో పాటు అభిరుచుల్నీ బతికించుకున్నా. సంగీతంపై ఇష్టంతో గాత్రం, వయోలిన్‌, వీణలో మూడు డిప్లొమాలు, పీజీ చేశా. బీఈడీ పూర్తిచేశా.. అలా మొత్తం ఇప్పటికి 16 పట్టాలు పొందా.

- యద్దనపూడి ఛత్రపతి, విశాఖపట్నం

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్