అందరి బాగూ.. ఆమె లక్ష్యం!
‘చదువుకుంటేనే ఈ లోకంలో నిలవగలం’.. ఈ విషయం అనన్యకు చిన్నతనంలోనే అర్థమైంది. అందుకే ఎన్ని కష్టాలు ఎదురైనా చదువు కొనసాగించింది. అయితే ఆ అభివృద్ధి తనకే పరిమితం అవకూడదనుకుంది. తన వాళ్లందరికీ చేరాలనుకుంది.
‘చదువుకుంటేనే ఈ లోకంలో నిలవగలం’.. ఈ విషయం అనన్యకు చిన్నతనంలోనే అర్థమైంది. అందుకే ఎన్ని కష్టాలు ఎదురైనా చదువు కొనసాగించింది. అయితే ఆ అభివృద్ధి తనకే పరిమితం అవకూడదనుకుంది. తన వాళ్లందరికీ చేరాలనుకుంది. వేల బతుకుల్లో వెలుగులు నింపుతోన్న ఓ గిరిజన మహిళ స్ఫూర్తి కథనమిది!
సరైన ఆహారం, తాగునీరు, రవాణా సదుపాయాలు.. వంటి కనీస అవసరాలూ తెలియని ప్రాంతం అనన్య పాల్ దొడ్మనీ వాళ్లది. కాలిబాటన కొన్ని కిలోమీటర్లు వెళితే కానీ చదువు సాధ్యం కాదు. కానీ ఇదే తమ నుదుటి రాతను మార్చే మార్గమని అనన్యకు చిన్నతనంలోనే అర్థమైంది. అందుకే కష్టపడి చదివేది. ఈమెది అసోంలోని ఓ చిన్న గిరిజన గ్రామం. ఓసారి వాళ్ల నాన్నని ఎవరో కిడ్నాప్ చేశారు. అయిదు రోజులు చిత్రహింసలు పెట్టారు. తర్వాత ఆయన తప్పించుకొని ఇంటికొచ్చినా.. ఆ వారం రోజులూ ఆమె కుటుంబం ఆయన ఆచూకీ తెలియక నరకమే చవి చూసింది. తనకే కాదు చుట్టూ ఉన్నవాళ్లకీ ఏం చేయాలో, ఎవరిని సాయమడగాలో తెలియని పరిస్థితి. అప్పుడే అనన్యకి తన ప్రజల్లో మార్పు తీసుకురావడం ఎంత అవసరమో అర్థమైంది.
12 ప్రాజెక్టులు..
ఎనిమిదో తరగతి నుంచే చుట్టుపక్కల పిల్లలకు చదవడం, రాయడం, లెక్కలూ నేర్పించేది. కాలేజీకొచ్చాక కొన్ని ఎన్‌జీఓ లతో చేయి కలిపి పిల్లలకు బోధన, చేతివృత్తుల్లో శిక్షణ ఇప్పించేది. పర్యావరణ హిత మెన్‌స్ట్రువల్ ఉత్పత్తులు వాడేలా చేయడమే కాదు.. వాళ్లతో వాటిని తయారుచేయించి అమ్మించేది. నిధులు సేకరించి చుట్టుపక్కల గ్రామాల్లో లెర్నింగ్ సెంటర్లు, టాయిలెట్లు, విద్యుత్ సదుపాయాల్ని కల్పించింది. తన కృషితో ప్రేరణ పొంది కొంతమంది యువకులు ఆమెతో చేతులు కలిపారు. అందరూ కలసి కూర్చుని చర్చించుకొని సమస్యల్ని పరిష్కరిస్తుంటారు. 2019లో ‘ట్రైబల్ కనెక్ట్’ ఎన్‌జీఓను ప్రారంభించింది. అన్నపూర్ణ, లల్లి, గ్యాన్, హ్యాపీ ఫుడ్‌బాక్స్, వింగ్స్.. ఇలా 12 ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. వృద్ధులకు దన్నుగా ఉండటం, ఆడపిల్లలకు చదువు, వయోజన విద్య, పిల్లలకు నాణ్యమైన ఆహారం.. ఇలా ఒక్కో అవసరాన్ని ఇవి తీరుస్తాయి. ‘ప్రభుత్వమే సాయం చేయాలని కూర్చుంటే పనులు ముందుకు సాగవని తెలుసు. అలాగని నేనో పరిపూర్ణ మహిళనని అనను. నాకూ తెలియనివి చాలానే ఉన్నాయి. కానీ ఏదో ఒకటి చేసుకుంటూ వెళితే కనీసం ఉన్నచోట నుంచి కొంచెమైనా ముందుకు వెళతామన్న ఆశ నాది. ఆ ఉద్దేశంతోనే నాకు తోచింది చేసుకుంటూ వెళ్లా. అయితే చేసే పని పరిపూర్ణంగా ఉండాలని నమ్ముతా. ఆ తీరు వల్లే ఈశాన్య రాష్ట్ర సరిహద్దుల్లో 150 లెర్నింగ్ సెంటర్లు, దేశవ్యాప్తంగా 80 వేల గిరిజన మహిళలకి పర్యావరణ హిత మెన్‌స్ట్రువల్ ఉత్పత్తుల తయారీలో శిక్షణ వంటివి సాధ్యమయ్యాయి. నా సేవల్ని కర్ణాటక, పశ్చిమ్ బంగాల్లోని గిరిజన గ్రామాలకీ విస్తరించా’ననే అనన్య సైకాలజిస్ట్. తన జీతంలో అధిక శాతం సేవాకార్యక్రమాలకే ఉపయోగిస్తోంది. ఈమె సేవలు మెచ్చి ప్రభుత్వం, ఐక్యరాజ్యసమితి కర్మవీర్ చక్ర పురస్కారాన్నిచ్చింది. నేర్పాలంటే నిరంతరం నేర్చుకోవడమే మార్గమనే ఈమె ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తూనే ఉంది. గిరిజనులందరికీ ఉత్తమ జీవితాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈమె జీవితం స్ఫూర్తిదాయకమే కదూ!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.