మంచు వానలో.. పనిచేశాం!

కరిగిన కాలాన్ని వెనక్కి తీసుకురావడం ఎవరివల్లయినా అవుతుందా?‘సీతారామం’ సినిమాలో మనల్ని కాలంతో పాటు వెనక్కి తీసుకెళ్లి శెభాష్‌ అనిపించుకుందీ కళా దర్శకురాలు. మహర్షి, గజినీ వంటి హిట్‌ సినిమాల్లో తన మాయాజాలాన్నిచూపించిన ఈ తెలుగమ్మాయి వైష్ణవీరెడ్డి వసుంధరతో ముచ్చటించింది...

Updated : 28 Aug 2022 09:16 IST

కరిగిన కాలాన్ని వెనక్కి తీసుకురావడం ఎవరివల్లయినా అవుతుందా?‘సీతారామం’ సినిమాలో మనల్ని కాలంతో పాటు వెనక్కి తీసుకెళ్లి శెభాష్‌ అనిపించుకుందీ కళా దర్శకురాలు. మహర్షి, గజినీ వంటి హిట్‌ సినిమాల్లో తన మాయాజాలాన్నిచూపించిన ఈ తెలుగమ్మాయి వైష్ణవీరెడ్డి వసుంధరతో ముచ్చటించింది...

నేను పుట్టి, పెరిగింది చెన్నైలో. అక్కడే డిగ్రీ చదివా. అమ్మ లక్ష్మి, నాన్న తిరుమలరావు. ఇద్దరూ న్యాయవాదులే. సినిమాలంటే పిచ్చి నాకు. ఊహతెలిశాక.. ఏ సినిమానీ వదల్లేదు.  కొన్నిరోజులకి.. తెరపై సన్నివేశాల్ని నాకు నచ్చినట్టుగా ఊహించుకోవడం మొదలుపెట్టాను. అదో అలవాటుగా మారి.. సినిమాల మీద ప్రేమ మొదలైంది. అందులోనూ ఆర్ట్‌ డైరెక్షన్‌ అంటే మరీ ఆసక్తి. డిగ్రీ అయ్యాక సినిమాల్లో పనిచేయాలనుందని ఇంట్లోవాళ్లకి చెప్పా. ససేమిరా అన్నారు. అమ్మాయిలకు సినిమా రంగం సరిపడదన్నారు. ‘వేళాపాళాలేని పనివేళలు చాలా కష్టం’ వంటివన్నీ చెప్పారు. నా పట్టుదల చూసి చివరకు ఒప్పుకొన్నారు. అలా నేను నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అహ్మదాబాద్‌లో ఫిల్మ్‌ డైరెక్షన్‌లో పీజీ చేశా.

వందలమందితో..

చదువయ్యాక ప్రముఖ ప్రొడక్షన్‌ డిజైనర్‌ సునీల్‌ సహాయకురాలిగా చేరా. ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఆయన తన ఊహల్ని, ఆలోచనల్ని నాకు చెబుతూ.. డిజైనింగ్‌, కాన్సెప్ట్‌, కలర్స్‌ వంటివీ వివరిస్తారు. వాటిని కార్యరూపంలోకి తేవడం నా బాధ్యత. కథ, సన్నివేశానికి తగినట్లుగా డిజైన్లు, స్కెచ్‌లు వేసి అందుకు తగ్గ బడ్జెట్‌, సమయం వంటివన్నీ ఎగ్జిక్యూట్‌ చేస్తాను. సన్నివేశాలకు తగిన సెట్‌ వేయడానికి ఒక్కోసారి రెండు మూడొందల మందితో పని చేయించాల్సి ఉంటుంది. ఇంత మందిని సమన్వయం చేసుకొంటూ గడువులోగా పని పూర్తిచేయాలి. ఇక్కడ బడ్జెట్‌ ఎంత ముఖ్యమో సమయం కూడా అంతే ముఖ్యం. స్క్రీన్‌పై దర్శకుడు, ప్రొడక్షన్‌ డిజైనర్‌ల మనసుని అర్థం చేసుకుని సెట్‌లకు ప్రాణం పోయాలి. అలా నేను ఛాలెంజింగ్‌గా తీసుకుని చేసిన చిత్రం ‘సీతారామం’.

మైనస్‌ డిగ్రీల్లో పనిచేశా...

‘సీతారామం’ సినిమా సెట్స్‌ కోసం ఆరునెలలు పరిశోధన చేశా. 1960, 70, 80ల్లో తేడా చూపించడానికీ, అప్పటి వస్త్రధారణ, తుపాకులు, ఉత్తరాలు, స్టాంపుల డిజైనింగ్‌ ప్రింటింగ్‌ వంటివన్నీ తెలుసుకోవడానికి చాలా లోతుగా పనిచేశా. ముఖ్యంగా కశ్మీరులో కంటోన్మెంట్‌ సెట్‌ కోసం చాలా కష్టపడ్డా. ఆ సెట్‌ వేయడానికి 20 రోజులు కావాలి. కానీ మాకు 15 రోజుల సమయమే దొరికింది. మైనస్‌ 10 డిగ్రీల చలిలో పని చేయాలి. మంచువర్షంలా కురిసేది. మరోపక్క ఇచ్చిన సమయంలో సెట్‌ వేయాలన్న ఒత్తిడి. సినిమా విడుదలయ్యాక.. నా కష్టానికి ఫలితం దక్కిందనిపించింది. మహర్షి సినిమా కోసం కూడా ఇదే స్థాయిలో కష్టపడ్డాను. 45 రోజులు పనిచేసి ఒక గ్రామాన్నే రూపొందించా. నిజంగా ఒక చిన్న పల్లె అనిపించేలా సెట్‌ వేశా. వాటర్‌ ట్యాంకుల నుంచి పాఠశాల, హెలీప్యాడ్‌ వరకు నిర్మించా. నా కెరియర్‌లో వేసిన పెద్ద సెట్‌ అదే.

అమ్మాయిలు వస్తున్నారు కానీ...

సెట్‌ డిజైనింగ్‌, ప్లానింగ్‌లో అమ్మాయిలు ఇప్పుడు ఎక్కువగానే వస్తున్నా... ఆర్ట్‌ డైరెక్షన్‌లో తక్కువగానే ఉన్నారు. సాధారణంగా మహిళలేదైనా ఆలోచన చెబితే మగవాళ్ల నుంచీ అంత త్వరగా సానుకూల స్పందన రాదు. గట్టిగా చెబితే మరోరకంగా తీసుకుంటారని అమ్మాయిలూ వెనకాడతారు. సామర్థ్యం, కష్టపడేతత్వం, విషయంపై లోతైన అవగాహన ఉంటే మనం చెప్పేదేదైనా అవతలి వారు వింటారు. ఆడ మగ తేడా లేదు.. అందరూ సమానమే అని ముందు మన మనసులో అనుకొంటే మార్పు అదే వస్తుంది. నేనైతే మన పనే మన గురించి చెప్పాలనుకుంటా. అందుకే నాకు ఛాలెంజ్‌ విసిరే సినిమాలకే పని చేస్తా. ఆర్ట్‌ డైరెక్టర్‌గా నా తొలి చిత్రం హిందీలో ఆమిర్‌ఖాన్‌ చేసిన ‘గజిని’. ఆమిర్‌ నుంచి పర్‌ఫెక్షన్‌, ‘మహర్షి’లో మహేష్‌బాబు నుంచి క్రమశిక్షణ, నిరాడంబరత, అందరికీ మర్యాదనివ్వడం వంటివన్నీ తెలుసుకున్నా.

గర్వంగా అనిపించింది...

‘సీతారామం’ విడుదలయ్యాక నా పనిని అభినందిస్తూ అందరూ సెల్ఫీలు అడుగుతుంటే గర్వంగా అనిపించింది. ఇప్పటివరకు తెలుగు, తమిళం, మలయాళం, హిందీల్లో 13 సినిమాలు చేశా. ఇటీవలే వంశీ పైడిపల్లి తమిళ చిత్రం అవిసు పూర్తయ్యింది. అమ్మాయిలకు నేను చెప్పేదేంటంటే మనల్ని మనం తీర్చిదిద్దుకుంటూ, నైపుణ్యాలను పెంచుకుంటే చాలు. విజయాలు తేలిగ్గా సాధించొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని