సాధనతో గుర్తింపు పొందింది...

ఈమె చేతిలో మ్యాజిక్‌ ఉంది. నవ వధువులు, మినియేచర్‌ వస్తువుల నుంచి రాచరికపు భవనాలను కేకుల్లా మార్చేస్తుంది. పదేళ్ల ఈమె కృషి, ప్రయోగాలకు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపులెన్నో వచ్చాయి.

Published : 29 Aug 2022 01:23 IST

ఈమె చేతిలో మ్యాజిక్‌ ఉంది. నవ వధువులు, మినియేచర్‌ వస్తువుల నుంచి రాచరికపు భవనాలను కేకుల్లా మార్చేస్తుంది. పదేళ్ల ఈమె కృషి, ప్రయోగాలకు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపులెన్నో వచ్చాయి. పలు పురస్కారాలు వరించాయి. సాధనతో ప్రపంచరికార్డులనూ సొంతం చేసుకొంది. ఫోర్బ్స్‌ జాబితాలోనూ.. స్థానాన్ని దక్కించుకున్న ప్రాచీ ధాబల్‌ దేవ్‌ అందరిలో స్ఫూర్తిని నింపుతోంది.

ప్రాచీకి బాల్యం నుంచి కేకు తిన్న ప్రతిసారీ చుట్టూ ఉన్న భవనాలు, వస్తువులను కేకుల్లా తయారుచేస్తే ఎలా ఉంటుందని ఆలోచించేది. పుణెకు చెందిన ఈమెకు సంప్రదాయ భవనాలు, రాచరికపు కట్టడాలంటే ఆసక్తి ఎక్కువ. తన చిన్ననాటి కలకు ఆసక్తిని కలిపి కొత్తగా ప్రయోగం చేయాలనుకుంది. దీనికోసం కేకు తయారీ శిక్షణ, ప్రత్యేక కోర్సులు చేసింది. మొదట వివాహాది శుభకార్యాలకు వధువు ఫొటో వచ్చేలా కేకు తయారుచేసి ప్రశంసలు అందుకుంది. పలు నగలదుకాణదారులకు ఆభరణాల డిజైన్స్‌ను కేకులా తయారుచేసి మార్కెటింగ్‌కు అందించడం మొదలుపెట్టింది. సెలబ్రిటీ వధువులు, చిన్నారుల కథల్లో వచ్చే కార్టూన్‌ పాత్రలకు కుకీస్‌ రూపాన్ని అందించి విక్రయిస్తోంది. ఆసక్తి ఉన్నవారికి ఆన్‌లైన్‌లో శిక్షణనూ అందిస్తోంది. పలు పరిశోధనలు, ప్రయోగాలు చేస్తూ ‘కేక్‌ డెకర్‌ ఇండియా’ ప్రారంభించింది. ఆసక్తితో లండన్‌లో రాయల్‌ ఐసింగ్‌ ఆర్ట్‌లో శిక్షణ తీసుకుంది.

గిన్నిస్‌ గుర్తింపు..

పురాతన, రాచరికపు కట్టడాల డిజైన్లపై ప్రాచీ అధ్యయనం చేపట్టి, వాటిలా కేకు చేయడానికి కావాల్సిన సాధన చేసి నైపుణ్యాలను పెంచుకుంది. ఇటీవల సృజనాత్మకతతో ప్రాచీ తయారుచేసిన రాయల్‌ కేకు ప్రపంచ గుర్తింపు పొంది, ఈ ఏడాది గిన్నీస్‌రికార్డులో స్థానాన్ని దక్కించుకుంది. ‘రకరకాల కట్టడాలను పరిశీలిస్తూ, వాటిని పోలినట్లే కేకు తయారుచేయడం మొదలుపెట్టా. కొత్తలో కాస్తంత కష్టమైనా, తిరిగి ప్రయత్నించి సాధించేదాన్ని. ఆ తర్వాత ఇప్పటివరకు ఎవరూ చేయని సాధన నేను చేయాలనుకున్నా. అలా రూపొందించిందే ఈ రాయల్‌ కేకు. ఈ కట్టడాన్ని కేకు రూపంలో సహజంగా తీసుకురావడానికి చాలా పద్ధతులు కనిపెట్టా. ప్రపంచరికార్డుకెక్కిన ఈ 100 కేజీల వెగాన్‌ ఎడిబుల్‌ రాయల్‌ ఐసింగ్‌ కేకు పొడవు 6.4 అడుగులు, ఎత్తు 4.6 అడుగులు. వెడల్పు 3.5 అడుగులు. ఇదొక్కటే రికార్డు కాకుండా, ఇప్పటివరకు 1500 వెగాన్‌ రాయల్‌ ఐసింగ్‌ స్ట్రక్చర్స్‌ కేకులను తయారుచేసిన తొలి వ్యక్తిగానూ గిన్నిస్‌కెక్కా. చాలా గర్వంగా ఉంది’ అని చెప్పుకొస్తున్న ప్రాచీని ‘వుమెన్‌ అఛీవర్స్‌ ఆఫ్‌ పుణె’, ‘సూపర్‌ షెఫ్‌ ఆఫ్‌ ద ఇయర్‌’, ‘కేకు మాస్టర్స్‌’ వంటి పలు అవార్డులు వరించాయి. ఈ తరహా కేకుల తయారీ కోసం అయిదేళ్లపాటు సాధన చేసి విజయం సాధించిన ఈ ఐసింగ్‌ క్వీన్‌  ఫోర్బ్స్‌ జాబితాలోనూ స్థానాన్ని దక్కించుకుంది. ఆన్‌లైన్‌లో ప్రపంచవ్యాప్తంగా కేకు తయారీలో శిక్షణను అందిస్తున్న ప్రాచీ అమరవీరుల భార్యలకు ఉచితంగా నేర్పుతోంది. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేస్తానంటోంది ప్రాచీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్