హరిత సైన్యాన్ని తయారు చేసింది

నీతి గోయల్‌.. పాదాలకు మట్టి అంటకుండా పెరిగింది. ‘యువరాణిలా పెరిగింది.. కష్టాలెలా ఉంటాయో తనకెలా తెలుస్తాయ’నుకుంటాం కదా! పేదవాళ్ల ఆకలి, మహిళల ఇబ్బందులూ తెలుసుకోవడమే కాదు వాళ్లకు సాయమూ అందిస్తోంది. గ్రామాల రూపురేఖల్ని మార్చడానికి ఓ సైన్యాన్నే తయారు చేసింది.

Published : 30 Aug 2022 00:41 IST

నీతి గోయల్‌.. పాదాలకు మట్టి అంటకుండా పెరిగింది. ‘యువరాణిలా పెరిగింది.. కష్టాలెలా ఉంటాయో తనకెలా తెలుస్తాయ’నుకుంటాం కదా! పేదవాళ్ల ఆకలి, మహిళల ఇబ్బందులూ తెలుసుకోవడమే కాదు వాళ్లకు సాయమూ అందిస్తోంది. గ్రామాల రూపురేఖల్ని మార్చడానికి ఓ సైన్యాన్నే తయారు చేసింది.

నీతి వాళ్ల నాన్న ఎస్‌కే గుప్తా పెద్ద పారిశ్రామికవేత్త. మేనేజ్‌మెంట్‌ విద్య పూర్తిచేసి, రెస్టారెంట్‌ వ్యాపారం ప్రారంభించింది. వీళ్లది ముంబయి. సొంతంగా కీబా, ఒస్తాద్‌, మద్రాస్‌ డైరీస్‌ వంటి రెస్టారెంట్లను విజయవంతంగా నిర్వహిస్తోంది. వాటిని ప్రపంచంలోనే అత్యుత్తమ 50 రెస్టారెంట్లలో రెండో స్థానంలో నిలిపింది. ఉత్తమ వ్యాపారవేత్తగా పురస్కారాలనూ అందుకుంది. నాన్న వ్యాపారంతోపాటు సమాజసేవా చేసేవారు. ఆయన ప్రభావం నీతి మీద ఎక్కువ. ఆయన స్ఫూర్తితో తనూ సేవాకార్యక్రమాలు చేసేది. అయినా ఏదో అసంతృప్తి అంటుంది నీతి. ఓసారి విహారయాత్రకు వెళ్లినప్పుడు ఓ పల్లెటూరిలో ఆగాల్సి వచ్చింది. అక్కడి ప్రజలకు తాగునీరు, మరుగుదొడ్డి వంటి కనీస అవసరాలూ లేకపోవడాన్ని గమనించింది. ‘స్వచ్ఛభారత్‌’ వంటివి నిర్వహిస్తున్నా మారుమూల గ్రామాలకు అవి చేరట్లేదని అర్థమైందామెకు. దీనికి డబ్బు సాయం మాత్రమే సరిపోదనుకుంది. సమస్య పరిష్కారం కోసం పరిశోధిస్తే.. మాదకద్రవ్యాలు, గృహహింస, నిరక్షరాస్యత వంటివి ప్రధాన కారణాలుగా గుర్తించింది. దీనివల్ల బలవుతోంది మహిళలు, పిల్లలేనని గుర్తించింది.

పిల్లలు బడుల్లోకి వెళ్లేలా ప్రోత్సహించింది. వారికి బలవర్థకమైన ఆహారం, పుస్తకాలు అందించడం వంటివి చేసింది. అమ్మాయిలు పెద్ద చదువులకు దూరం వెళ్లాల్సొస్తే సైకిళ్లు ఇచ్చి ప్రోత్సహించింది. 25 మంది మహిళల్ని ఒక బృందంగా చేర్చి ‘గ్రీన్‌ ఆర్మీ’ని మొదలుపెట్టింది. మాదకద్రవ్యాలు, గృహహింసల్ని ఎదుర్కోవడమే కాదు స్వీయరక్షణలోనూ శిక్షణిప్పించింది. వాళ్లకాళ్ల మీద వాళ్లు నిలబడేలా కుట్టుమిషన్లు, కూరగాయలు, చెప్పుల తయారీ, అల్లికలు వంటివి నేర్పించింది. అంతేకాదు.. ఈ మహిళలతో వివిధ గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అలా 250 గ్రామాల్లో 1800 మంది మహిళా సైనికుల్ని తయారు చేసింది. కొవిడ్‌ ముందు వలస కూలీలకు కనీసం తినడానికి తిండి లేకపోవడం గమనించి వారికి ఆహారం అందించింది. నటుడు సోనూసూద్‌తో కలిసి 2 లక్షలమందిని వాళ్ల గమ్యస్థానాలకు చేర్చింది. శిబిరాల్లో చిక్కుకుపోయినవారికి, పేదలు, వ్యభిచార గృహాలవారికి 80 లక్షల మందికి ఆహారం, నెలసరి ఉత్పత్తులు అందించింది.

‘నా వ్యాపారమే కడుపు నింపేది. అలాంటిది చెత్తబుట్టల్లో పిల్లలు తిండి కోసం వెతుక్కోవడం, ఆకలి తట్టుకోలేక మట్టి తింటుండటం చూసి తట్టుకోలేకపోయా. అందుకే సోనూసూద్‌తో చేయి కలిపా. గ్రామాల్లో కనీస వసతులు, ఆడపిల్లల చదువు.. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా. వీటితో ఏదో సాధించేశాననుకోను. చేయాల్సింది ఇంకా చాలా ఉంది. నాలానే ఇంకొందరూ ముందుకొస్తే నిజమైన అభివృద్ధి సాధ్యమే’నంటుంది 40 ఏళ్ల నీతా. తన సేవకు గుర్తింపుగా ఎన్నో రాష్ట్ర, జాతీయ పురస్కారాలనీ అందుకొంది. ట్విటర్‌ ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 17 మంది మహిళా ఛేంజ్‌ మేకర్స్‌లో నీతా ఒకరు. ఈఏడాది మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ మానవతావాది, సర్వీస్‌ ట్రెండ్‌ సెట్టర్‌గా పురస్కారాలు అందుకొన్న ఈమె టెడెక్స్‌ స్పీకర్‌ కూడా. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్